IND vs AFG U19 Semi Final : హెల్మెట్‌కు బంతి తగిలితే 9 పరుగులా? భారత్ ముందు భారీ టార్గెట్ ఉంచిన అఫ్గాన్ టీం

IND vs AFG U19 Semi Final : అండర్-19 వరల్డ్ కప్ 2026లో పెను సంచలనం నమోదైంది. రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ కుర్రాళ్లు భారత బౌలర్లను చితక్కొట్టేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్ టీమ్, నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోరు సాధించింది.

IND vs AFG U19 Semi Final : హెల్మెట్‌కు బంతి తగిలితే 9 పరుగులా?  భారత్ ముందు భారీ టార్గెట్ ఉంచిన అఫ్గాన్ టీం
Ind Vs Afg U19 Semi Final

Updated on: Feb 04, 2026 | 5:21 PM

IND vs AFG U19 Semi Final : అండర్-19 వరల్డ్ కప్ 2026లో పెను సంచలనం నమోదైంది. రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ కుర్రాళ్లు భారత బౌలర్లను చితక్కొట్టేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్ టీమ్, నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. సెమీఫైనల్ లాంటి ఒత్తిడి ఉండే మ్యాచ్‌లో ఇంత పెద్ద స్కోరు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఆయుష్ మాత్రే సారథ్యంలోని టీమిండియా ఫైనల్ చేరాలంటే.. అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలోనే అతిపెద్ద రన్ చేజ్ చేసి కొత్త రికార్డు సృష్టించాల్సి ఉంటుంది.

అఫ్గానిస్థాన్ ఇన్నింగ్స్ మొత్తం ఇద్దరు ఆటగాళ్ల చుట్టూనే తిరిగింది. ఓపెనర్లు మంచి పునాది వేసిన తర్వాత, మూడో నంబర్‌లో వచ్చిన ఫైసల్ షినోజాదా భారత బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. కేవలం 93 బంతుల్లోనే 14 ఫోర్ల సాయంతో 110 పరుగులు చేసి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అతనికి తోడుగా ఉజైరుల్లా నియాజై ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 86 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరిద్దరి సెంచరీల ధాటికి భారత బౌలర్లు సమాధానం చెప్పలేకపోయారు. దీపేష్ దేవేంద్రన్, కనిష్క చౌహాన్ చెరో రెండు వికెట్లు తీసినా, అఫ్గాన్ స్కోరును కట్టడి చేయలేకపోయారు.

ఈ మ్యాచ్‌లో ఒక విచిత్రమైన ఘటన ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. దీపేష్ దేవేంద్రన్ వేసిన 17వ ఓవర్ చివరి బంతికి ఏకంగా 9 పరుగులు లభించాయి. బ్యాటర్ బంతిని మిస్ చేయగా, అది వికెట్ కీపర్ చేతిలో పడకుండా వెనుక ఉన్న హెల్మెట్‌కు తగిలి బౌండరీ దాటింది. దీంతో పెనాల్టీ రూపంలో 5 పరుగులు, బౌండరీ రూపంలో 4 పరుగులు కలిపి మొత్తం 9 పరుగులు అఫ్గాన్ ఖాతాలో చేరాయి. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా భారత్‌కు భారంగా మారాయి.

టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉన్నా, 311 పరుగుల లక్ష్యం అనేది కొండంత సవాల్. వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే వంటి స్టార్ ప్లేయర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో ఇంత పెద్ద స్కోరును ఎవరూ విజయవంతంగా ఛేజ్ చేయలేదు. భారత కుర్రాళ్లు గనుక ఈ లక్ష్యాన్ని అందుకుంటే, అది క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే విజయం అవుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఉన్న భారత్, ఆరోసారి కప్పు నెగ్గాలంటే ఈ అఫ్గాన్ అడ్డంకిని దాటాల్సిందే.

 

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి