
2025–2027 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(WTC) సైకిల్‌కు రాబోయే రెండు నెలలు కీలకంగా మారనుంది. ఫైనల్ రేసులో తమ స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి అనేక జట్లు తహతహలాడుతున్నాయ్. భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే రెండు టెస్ట్‌ల సిరీస్.. అలాగే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగే యాషెస్ సిరీస్ ఈ సైకిల్ దిశను పూర్తిగా మార్చనున్నాయి.
ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన ఆస్ట్రేలియా 100 శాతం పాయింట్లు సంపాదించింది. ఇప్పటిదాకా ట్రావిస్ హెడ్(224 పరుగులు), మిచెల్ స్టార్క్(15 వికెట్లు) అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. నవంబర్ 21 నుంచి ప్రారంభమయ్యే యాషెస్ సిరీస్ ఇప్పుడు ఆస్ట్రేలియాకు అసలైన పరీక్ష. గత రెండు స్వదేశీ యాషెస్ సిరీస్‌లను 4–0తో గెలుచుకున్న కంగారూలు.. మళ్లీ అదే జోరు కొనసాగించాలని ఉవ్విళ్ళూరుతున్నారు.
ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో 61.90 శాతం పాయింట్లతో.. డబ్ల్యూటీసీలో భారత్ మంచి ఆరంభాన్ని ఇచ్చింది. ఇక ఇండియా తరపున శుభ్‌మాన్ గిల్(946 పరుగులు), మహమ్మద్ సిరాజ్ (33 వికెట్లు) మెరిశారు. ఇప్పుడు భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే సిరీస్ కీలకం కానుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ, శ్రీలంక, న్యూజిలాండ్ పర్యటనలు జరగనున్నాయి. ఇవి జట్టును ఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
కాగా, దక్షిణాఫ్రికా రెండు టెస్టుల్లో ఒకటి గెలించింది. ప్రస్తుతం 50 శాతం పాయింట్లను కలిగి ఉంది. టోనీ డి జోర్జీ(175 పరుగులు), సైమన్ హార్మర్ (13 వికెట్లు) టాప్ స్కోరర్లు. భారత్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్ వారికి పెద్ద అవకాశం అని చెప్పొచ్చు. ఇక సఫారీలు ఆ తర్వాత శ్రీలంకలో పర్యటిస్తారు.