
ప్రపంచకప్‌లో భాగంగా మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. టోర్నీలో వరుసగా విజయ పరంపరను కొనసాగిస్తున్న ఏకైక జట్టు టీమ్‌ఇండియా. ఇక ఫేవరెట్‌గా బరిలోకి దిగి అంచనాలకు తగ్గట్లు ఆడలేక సెమీస్ అవకాశాల్ని ప్రమాదంలో పడేసుకున్న జట్టు ఇంగ్లాండ్. ఈ రెండు జట్లు ఇవాళ ఢీకొనబోతున్నాయి. ఆతిథ్య జట్టుకు అత్యంత కీలక మ్యాచ్ కావడంతో అందరి దృష్టి ఈ మ్యాచ్‌పైనే ఉంది. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ప్రత్యర్థులందరినీ హడలెత్తించే ఫామ్‌లో ఉన్న ఇంగ్లిష్ జట్టు.. ఇప్పుడు అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది.
టోర్నీ ఆరంభంలోనే పాక్ చేతిలో కంగుతిన్న ఆ జట్టు.. తాజాగా శ్రీలంక, ఆస్ట్రేలియాల చేతుల్లో వరుస ఓటములు ఎదుర్కొంది. 7 మ్యాచ్‌లాడి 4 విజయాలతో 8 పాయింట్లు సాధించిన ఇంగ్లాండ్.. చివరి రెండు మ్యాచ్‌ల్లో భారత్, న్యూజిలాండ్‌లపై గెలిచి తీరాల్సిన స్థితిలో నిలిచింది. ఆదివారం చెలరేగి ఆడాలని పట్టుదలతో ఇంగ్లాండ్ ఉంది. కానీ వరుస విజయాలతో దూసుకెళ్తున్న కోహ్లీసేనను అడ్డుకోవడం అనేది సవాల్‌గా మారింది. ఇప్పటికే దాదాపుగా సెమీస్ బెర్తును కన్ఫార్మ్ చేసుకున్న భారత్.. ఇంగ్లాండ్‌పై విజయం సాధించి అధికారికంగా సెమీస్ చేరాలని ఉవ్విళ్లూరుతోంది.