ICC Women World Cup 2022: న్యూజిలాండ్‌లో జరుగుతున్న మహిళల ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా వెనుకబడుతోంది. ప్లేయర్స్ ఆటతీరు అభిమానులని నిరాశకి గురిచేస్తుంది. రెండు మ్యాచ్‌లలో ఒకటి గెలిస్తే మరొకటి ఓడిపోయింది. మొదటి మ్యాచ్ పాకిస్తాన్‌పై గెలిస్తే రెండో మ్యాచ్ న్యూజిలాండ్‌పై ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ప్రపంచకప్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 107 పరుగుల భారీ తేడాతో ఓడించింది. భారత్ 244 పరుగులు చేసి పాకిస్థాన్‌ను 137 పరుగులకే పరిమితం చేసింది. ఆ తర్వాతి మ్యాచ్‌లోనే ఆతిథ్య న్యూజిలాండ్‌తో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. న్యూజిలాండ్ 260 పరుగులకు ఆలౌటైంది. జవాబుగా భారత్ 198 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్రపంచకప్‌కి ముందు నుంచే భారత మహిళల క్రికెట్ జట్టు బౌలింగ్ లోపంతో బాధపడుతుంది. బ్యాటింగ్ పర్వాలేదనిపించినా బౌలింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతుంది.
ప్రపంచకప్‌కి ముందు న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత జట్టు బౌలింగ్‌లో సత్తా చాటలేదు. న్యూజిలాండ్ జట్టు భారత్‌పై వరుసగా 3 మ్యాచ్‌లలో 270 కంటే ఎక్కువ స్కోర్లు (275, 273, 280 ) సాధించింది. అందులో వారు రెండుసార్లు లక్ష్యాన్ని విజయవంతంగా సాధించారు. నాలుగో మ్యాచ్‌లో మాత్రమే భారత బౌలర్లు న్యూజిలాండ్‌ను 198 పరుగుల స్వల్ప స్కోరు వద్దకి కట్టడి చేశారు. ఆ సమయంలో జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా బౌలింగ్ బలహీనంగా ఉందని భావించింది. ప్రపంచకప్‌కు ముందు బౌలింగ్ అంశం ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది.
బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్ బాగా లేదు. బౌలింగ్ స్పెల్ సరిగ్గా లేదు. అయినప్పటికీ మేము పరిస్థితులకు తగినివిధంగా ఆడాలని నిర్ణయించుకున్నామని ప్రకటించింది. అదే ఒక శుభపరిణామం ఏంటంటే బ్యాటింగ్ మాత్రం మెరుగ్గా ఉంది. భారత్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 270కి పైగా స్కోర్ చేయగా, చివరి వన్డేలో 252 పరుగుల లక్ష్యాన్ని కూడా సులభంగా సాధించింది. భారత జట్టు నిరంతరం 250 పరుగులకు పైగా స్కోర్ చేస్తోంది. ఇది గతేడాది వరకు కష్టతరంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.