ICC U-19 World Cup 2022: క్రికెట్ మ్యాచ్‌లలో బ్యాట్స్‌మెన్ ఎప్పుడూ బౌండరీలు బాదేందుకు ప్రయత్నిస్తారు. అదే సమయంలో, ఫీల్డర్లు ఈ బౌండరీలను ఆపేందుకు చూస్తుంటారు. కొన్నిసార్లు ఫీల్డర్లు దానిని ఆపడంలో విజయం సాధిస్తారు. మరికొన్నిసార్లు విఫలమవుతుంటుంటారు. ఇందులో అద్భుతమైన డైవ్‌లు ఆకట్టుకుంటుంటాయి. నెట్టింట్లోనూ తెగ వైరల్ అవుతుంటాయి. ఇవి క్రికెట్‌లో సర్వసాధారణం. అయితే ఫీల్డర్ స్వయంగా బంతిని ఫోర్ కోసం పంపడం చాలా అరుదుగా జరుగుతుంది. ఓవర్-త్రోల విషయంలో ఇలా జరుగుతుంది. అయితే ఫీల్డర్ స్వయంగా బంతిని తన కాలితో తన్నడంతో అది బౌండరీ వెలుపలకు చేరడం అప్పుడప్పుడు వింటుంటాం. ఇలాంటి అరుదైన దృశ్యాలు క్రికెట్‌లో అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. ICC U-19 ప్రపంచ కప్ 2022 (ICC U-19 World Cup 2022)లో ఇలాంటిదే జరిగింది. ఈ మ్యాచులో పాకిస్తాన్(Pakistan) వర్సెస్ ఆస్ట్రేలియా (Australia) మ్యాచ్ జరిగింది. పాక్ ఫీల్డర్ బంతిని ఆపడానికి ప్రయత్నించి బౌండరీ చేర్చాడు.
ప్రపంచ కప్‌లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జనవరి 28 శుక్రవారం నాడు నార్త్ సౌండ్‌లో పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అండర్-19 జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌లు రాణించి శుభారంభం చేశారు. 37వ ఓవర్ వరకు జట్టు స్కోరు 180 దాటగా, ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఈలోగా పాకిస్థాన్‌కు వికెట్ తీసే అవకాశం లభించగా, ఈ అవకాశం రాగానే పాక్ ఫీల్డర్ ఫుల్ ఫోర్స్ ఇచ్చాడు. అయితే ఇందులో విజయవంతంకాకపోగా అదనంగా 4 పరుగులు ఇచ్చాడు.
ఫుల్ ఫోర్స్‌తో బంతిని తన్నాడు..
ఇన్నింగ్స్ 37వ ఓవర్‌లో ఇది జరిగింది. జీషన్ జమీర్ వేసిన ఈ ఓవర్ రెండో బంతికి ఆస్ట్రేలియాకు చెందిన ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ కోరీ మిల్లర్ హై షాట్ ఆడాడు. బంతి లాంగ్ ఆఫ్ బౌండరీ వైపు గాలిలోకి వెళ్లింది. పాక్ ఫీల్డర్ క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించి వెనుకకు పరుగెత్తాడు. కానీ అతను బంతిని అందుకోలేకపోయాడు. క్యాచ్ అతని చేతికి రాకముందే నేలను తాకింది. అప్పటి వరకు బాగానే ఉంది. కానీ, ఆతర్వాత బంతి నేలపై పడి బౌండరీవైపు వెళ్తోంది. దానిని పట్టుకోవడానికి పరిగెడుతున్న ఫీల్డర్ తనను తాను ఆపుకోలేకపోయాడు. అనుకోకుండా అతను బంతిని తన్నాడు. అది నేరుగా బౌండరీకి వెళ్లి ఆగిపోయింది. పాకిస్థాన్‌కి వికెట్ లభించకపోగా.. అదనంగా ఆస్ట్రేలియాకు 4 పరుగులు ఇచ్చింది.
ఆస్ట్రేలియా బలమైన భాగస్వామ్యం..
అయితే, పాకిస్థాన్ మరో వికెట్ కోసం పెద్దగా వేచి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. 38వ ఓవర్‌లో అవైస్ అలీ బౌలింగ్‌లో టీగ్ వైలీ (71), కోరీ మిల్లర్ (64) ఇన్నింగ్స్ ముగిసింది. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ల మధ్య రెండో వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యం ఉంది. దీని ఆధారంగా ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. ఈ మ్యాచులో పాకిస్తాన్ టీం కేవలం 157 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో పాక్ 119 పరుగుల తేడాతో మ్యాచులో ఓడిపోయింది.
Also Read: 29 ఫోర్లు, 7 సిక్సులు.. బౌలర్లను ఉతికారేసిన ఓపెనర్లు.. ఇదేం బ్యాటింగ్ రా బాబోయ్ అంటోన్న నెటిజన్లు