
ICC Rankings : అంతర్జాతీయ క్రికెట్ మండలి బుధవారం మధ్యాహ్నం వన్డే, టెస్టు ఫార్మాట్‌లకు సంబంధించిన తాజా ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో ఒక చారిత్రక మార్పు జరిగింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ మూడు వారాల పాటు కొనసాగిన నంబర్-1 వన్డే బ్యాటర్ స్థానాన్ని కోల్పోయాడు. న్యూజిలాండ్‌కు చెందిన డాషింగ్ బ్యాట్స్‌మెన్ డారిల్ మిచెల్ అగ్రస్థానానికి చేరుకోవడంతో 46 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌కు చెందిన ఒక ఆటగాడు వన్డేల్లో నంబర్-1 బ్యాటర్‌గా నిలిచాడు. మరోవైపు టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మాత్రం టీమిండియా స్టార్ జస్‌ప్రీత్ బుమ్రా తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు.
వన్డేలో డారిల్ మిచెల్ సంచలనం
న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్, వెస్టిండీస్‌తో నవంబర్ 16న జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో 119 పరుగుల అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. ఈ ప్రదర్శన అతనికి ర్యాంకింగ్స్‌లో భారీగా కలిసొచ్చింది. మిచెల్ ఏకంగా నంబర్-1 స్థానానికి చేరుకోవడం ద్వారా 1979లో గ్లెన్ టర్నర్ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. దురదృష్టవశాత్తు, మిచెల్ నడుము నొప్పి కారణంగా ఈ సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. మరోవైపు, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 102 పరుగులు చేయడం వలన, ఆరు స్థానానికి చేరుకోగా, మహ్మద్ రిజ్వాన్ 22వ స్థానానికి, ఫఖర్ జమాన్ 26వ స్థానానికి ఎగబాకారు.
వన్డే బౌలర్లలో రషీద్ ఖాన్ టాప్
వన్డే ఫార్మాట్‌లో బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ తన నంబర్-1 స్థానాన్ని కొనసాగించాడు. పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో 3 వికెట్లు పడగొట్టి 11 స్థానాలు ఎగబాకి ఏకంగా 9వ స్థానానికి చేరుకున్నాడు. అలాగే, పాకిస్తాన్ పేసర్ హారిస్ రవూఫ్ 5 స్థానాలు మెరుగుపరుచుకుని 23వ స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్‌కు చెందిన జాయ్‌డెన్ సీల్స్, రోస్టన్ చేజ్ కూడా ర్యాంకింగ్స్‌లో మెరుగుదల సాధించారు.
టెస్టుల్లో బుమ్రా జోరు
టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా మొత్తం 6 వికెట్లు పడగొట్టడం వలన ఈ స్థానం పదిలమైంది. భారత స్పిన్నర్లలో కూడా మంచి పురోగతి కనిపించింది. కుల్‌దీప్ యాదవ్ రెండు స్థానాలు పైకి వచ్చి తన కెరీర్‌లో అత్యుత్తమంగా 13వ స్థానాన్ని చేరుకోగా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నాలుగు స్థానాలు ఎగబాకి 15వ స్థానంలో ఉన్నాడు. సౌతాఫ్రికా ఆఫ్ స్పిన్నర్ సైమన్ హార్మర్ ఈడెన్ గార్డెన్స్‌లో 8 వికెట్లు తీయడంతో 20 స్థానాలు పైకి వచ్చి 24వ స్థానంలో నిలిచాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..