MS Dhoni: టీమిండియా(Team India) మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ(MS Dhoni) టీమిండియా క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు. తనదైన మార్క్ కెప్టెన్సీతో ఎన్నో మ్యాచులను గెలిపించి, ప్రపంచకప్‌ను అందించాడు. ఈ విషయాన్ని రవిశాస్త్రి(Ravi Shastri) ఇటీవల ప్రశంసిస్తూ.. పొగడ్తలతో ముంచెత్తాడు. అలాగే కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ధోని ఎప్పుడూ తన వెంట మొబైల్ ఫోన్‌ని తీసుకెళ్లేవాడు కాదని, ఎంతోకాలం పాటు గాడ్జెట్‌లకు దూరంగా ఉంటాడని శాస్త్రి వెల్లడించాడు.
రవి శాస్త్రి టీమిండియా మేనేజర్‌గా ఉన్నప్పుడు ధోనితో కలిసి పనిచేశారు. ఆ తరువాత జట్టుకు ప్రధాన కోచ్‌గా చేశారు. ధోనీ అదే సమయంలో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లలో అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్‌లలో ఒకరిగా తన కెరీర్‌ను ముగించాడు.
అలాగే రవిశాస్త్రి మాట్లాడుతూ, “ధోని సున్నా స్కోర్ చేసినా, వంద స్కోర్ చేసినా, ప్రపంచకప్ గెలిచినా, తొలి రౌండ్‌లోనే ఓడినా ఎలాంటి తేడా లేదు. నేను చాలా మంది క్రికెటర్‌లను చూశాను. కానీ, అలాంటి వారు ఎవరూ లేరు. సచిన్ టెండూల్కర్ కూడా అద్భుతమైన స్వభావాన్ని కలిగి ఉంటాడు. అయితే సచిన్ కొన్నిసార్లు కోపం తెచ్చుకుంటాడు. కానీ, ధోని అలా చేయలేదు” అని శాస్త్రి పేర్కొన్నాడు.
“ధోని ఫోన్ చేతిలో ఎప్పుడూ ఫోన్ కనిపించదు. ఈ రోజు వరకు, ధోనీ ఫోన్ నంబర్ నా దగ్గర లేదు. నేను అతని నంబర్ ఎప్పుడూ అడగలేదు కూడా. ఎందుకంటే ధోనీ ఎప్పుడూ ఫోన్ తీసుకెళ్లడని నాకు తెలుసు. మీరు అతనితో సన్నిహితంగా ఉండాలనుకున్నప్పుడు, అతనిని ఎలా సంప్రదించాలో మీకు అప్పుడే తెలుస్తుంది. అందుకే చాలా ప్రత్యేకమైన వ్యక్తి” అని చెప్పుకొచ్చాడు.
ఎంఎస్ ధోని ఆగస్టు 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే అతను రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కి నాయకత్వం వహించనున్నాడు. IPL 2022 మెగా వేలంలో CSK రిటైన్ చేసిన నలుగురు ఆటగాళ్లలో ధోనీ ఒకరు.