
Uppal Stadium: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భూగర్భ జలాల వినియోగాన్ని తగ్గించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. స్టేడియంలో వర్షపు నీటిని సేకరించి శుద్ధి చేసే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ)కి తెలిపింది. ఈ వ్యవస్థ అమల్లోకి వస్తే ప్రతి ఏడాది 2 నుంచి 3 కోట్ల లీటర్ల వరకు వర్షపు నీటిని సేకరించి వినియోగించే అవకాశం ఉందని వెల్లడించింది.
పిచ్ నిర్వహణ కోసం భూగర్భ జలాలను అధికంగా వినియోగిస్తున్నారంటూ దాఖలైన కేసులో భాగంగా హెచ్‌సీఏ జూలై 2న ఎన్‌జీటీకి స్టేటస్ రిపోర్ట్ సమర్పించింది. కొత్త రైన్‌వాటర్ హార్వెస్టింగ్, ఫిల్ట్రేషన్ వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు తీసుకుని పనులు పూర్తి చేసేందుకు కొంత గడువు ఇవ్వాలని, అప్పటి వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ట్రైబ్యునల్‌ను కోరింది.
హెచ్‌సీఏ పరిశీలిస్తున్న ప్రతిపాదన ప్రకారం.. స్టేడియంలో పడే వర్షపు నీటిని సేకరించి శుద్ధి చేసి మైదానం నిర్వహణ, తోటల సాగు, ఇతర అవసరాలకు వినియోగించనున్నారు. అదనంగా భూగర్భ జలాలను రీచార్జ్ చేసే విధంగా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే స్టేడియాన్ని వాటర్ పాజిటివ్‌గా మార్చే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు హెచ్‌సీఏ తెలిపింది. వర్షపు నీటితో పాటు మురుగునీటిని శుద్ధి చేసి మైదానం, పచ్చదనం నిర్వహణ కోసం వినియోగించే అవకాశాలను కూడా హెచ్‌సీఏ పరిశీలిస్తోంది. దీంతో భూగర్భ జలాల వినియోగం మరింత తగ్గుతుందని పేర్కొంది.
ప్రస్తుతం ఉప్పల్ స్టేడియంలో మొత్తం 8.2 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేసే మూడు ట్యాంకులు ఉన్నాయి. గేట్ నంబర్-5 సమీపంలో 3.5 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఒక ట్యాంకు ప్రజా అవసరాల కోసం వినియోగిస్తుండగా, 2.2 లక్షల లీటర్ల సామర్థ్యంతో మరో ట్యాంకును అగ్నిమాపక అత్యవసర అవసరాల కోసం కేటాయించారు. గేట్ నంబర్-3 వద్ద 2.5 లక్షల లీటర్ల సామర్థ్యంతో మరో ట్యాంకు సాధారణ కార్యకలాపాల కోసం ఉపయోగిస్తున్నారు.
ఇదికూడా చదవండి: Video: ఇలాంటి ఔట్ చూశారా.. బద్దకంతో వికెట్ పారేసుకున్న టీమిండియా ప్లేయర్.. ఎవరంటే?
హైదర్ అలీ అనే వ్యక్తి ఎన్‌జీటీలో దాఖలు చేసిన పిటిషన్‌లో.. క్రికెట్ మైదానాల నిర్వహణ కోసం భూగర్భ జలాలను వినియోగిస్తున్నారని, బదులుగా శుద్ధి చేసిన నీరు లేదా రైన్‌వాటర్ హార్వెస్టింగ్ వంటి ప్రత్యామ్నాయాలను ఎందుకు ఉపయోగించడం లేదని ప్రశ్నించారు. ఐపీఎల్ వంటి వాణిజ్య టోర్నీల సమయంలో కూడా భారీగా నీరు వినియోగిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ కేసులో 2021 నుంచే ఎన్‌జీటీ విచారణ కొనసాగుతోంది. పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా హెచ్‌సీఏ సమయానికి స్టేటస్ రిపోర్ట్ సమర్పించకపోవడంతో ఈ ఏడాది జనవరిలో ట్రైబ్యునల్ రూ.5 వేల జరిమానా విధించింది. అనంతరం హెచ్‌సీఏ జరిమానా చెల్లించి, సాంకేతిక వివరాలు సేకరించడం, నిపుణుల సలహాలు తీసుకోవడం వల్లే ఆలస్యమైందని వివరణ ఇచ్చింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..