Bangladesh vs West Indies: ఎవరు సామీ నీవు..? వచ్చిరాగానే చితక్కొట్టావ్.. వెస్ట్ ఇండీస్ చరిత్రలోనే రెండో ప్లేయర్ గా రికార్డు..

|

Dec 13, 2024 | 6:50 PM

వెస్టిండీస్ ఆటగాడు అమీర్ జాంగూ వన్డే క్రికెట్‌లో తన అరంగేట్ర మ్యాచ్‌లోనే 104 నాటౌట్ సెంచరీ సాధించి, క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. వెస్టిండీస్ తన 322 పరుగుల లక్ష్యాన్ని కేవలం 45.5 ఓవర్లలో ఛేదించింది.

Bangladesh vs West Indies: ఎవరు సామీ నీవు..? వచ్చిరాగానే చితక్కొట్టావ్.. వెస్ట్ ఇండీస్ చరిత్రలోనే రెండో ప్లేయర్ గా రికార్డు..
Amir Jangoo Wi Vs Ban
Follow us on

వెస్టిండీస్ బ్యాటర్ అమీర్ జాంగూ వన్డే క్రికెట్‌లో తన అరంగేట్రంలోనే అసాధారణ ప్రదర్శనతో రికార్డులను తిరగరాశాడు. బంగ్లాదేశ్‌తో సెయింట్ కిట్స్‌లో జరిగిన మూడో వన్డేలో, జాంగూ 6వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 83 బంతుల్లో 104 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో జాంగూ 6 ఫోర్లు, 4 సిక్సర్లతో చెలరేగి, తాను ఆడిన 80వ బంతికి సిక్సర్‌తో తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

జాంగూ తన సెంచరీ సాధించి, వన్డే అరంగేట్రంలోనే సెంచరీ చేసిన రెండో వెస్టిండీస్ బ్యాటర్‌గా నిలిచాడు. అతనికి ముందు డెస్మండ్ హేన్స్ 1978లో ఆస్ట్రేలియాపై 148 పరుగులతో అరంగేట్ర సెంచరీ చేసిన తొలి వెస్టిండీస్ ఆటగాడు. హేన్స్ చేసిన 148 పరుగులు ఇప్పటికీ వన్డే అరంగేట్రంలోనే ఒక ఆటగాడు చేసిన అత్యధిక స్కోరుగా ఉంది.

27 ఏళ్ల జాంగూ ట్రినిడాడ్‌కు చెందిన క్రికెటర్‌గా, వెస్టిండీస్ జట్టులోకి అరంగేట్రం చేసిన వెంటనే క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఐదో వికెట్‌కు కీసీ కార్తీతో కలిసి 132 పరుగుల భాగస్వామ్యం, తర్వాత గుడాకేష్ మోటీతో కలిసి ఏడో వికెట్‌కు అజేయంగా 91 పరుగుల భాగస్వామ్యంతో, జట్టుకు విజయాన్ని అందించాడు. వెస్టిండీస్ 322 పరుగుల లక్ష్యాన్ని కేవలం 45.5 ఓవర్లలో ఛేదించి నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

అంతర్జాతీయంగా కూడా, జాంగూ ఫాస్టెస్ట్ సెంచరీ సాధించి రికార్డు సృష్టించాడు. వన్డే అరంగేట్రంలో 80 బంతుల్లోనే సెంచరీ చేసిన జాంగూ, దక్షిణాఫ్రికా బ్యాటర్ రీజా హెండ్రిక్స్ 88 బంతుల్లో సాధించిన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును బద్దలు కొట్టాడు. హెండ్రిక్స్ ఈ రికార్డును 2018లో శ్రీలంకపై తన అరంగేట్ర మ్యాచ్‌లో సాధించాడు.

భారత్ తరఫున, కేఎల్ రాహుల్ మాత్రమే వన్డే అరంగేట్రంలో సెంచరీ సాధించిన ఆటగాడు. 2016లో జింబాబ్వేపై హరారేలో తన తొలి మ్యాచ్‌లో 115 బంతుల్లో 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, అరంగేట్రాన్ని చిరస్మరణీయంగా మార్చుకున్నాడు.

అమీర్ జాంగూ తన అద్భుత ప్రదర్శనతో వెస్టిండీస్ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్ అతనికి అంతర్జాతీయ క్రికెట్‌లో మరింత పేరును తెచ్చిపెట్టడం ఖాయం.