Harmanpreet Kaur : 28బంతుల్లోనే సెంచరీ.. ఇంగ్లండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన డీఎస్పీ.. విమర్శకుల నోరు మూయించిన కెప్టెన్

భారత మహిళా క్రికెట్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఇంగ్లాండ్‌లో జరిగిన మూడో వన్డేలో కేవలం 28 బంతుల్లోనే సెంచరీ చేసి చరిత్ర సృష్టించింది. తన విమర్శకులకు బ్యాట్‌తో సమాధానం చెప్పిన ఆమె, ఇంగ్లాండ్ గడ్డపై మూడు వన్డే సెంచరీలు సాధించిన తొలి విదేశీ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పింది.

Harmanpreet Kaur : 28బంతుల్లోనే సెంచరీ.. ఇంగ్లండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన డీఎస్పీ.. విమర్శకుల నోరు మూయించిన కెప్టెన్
Harmanpreet Kaur

Updated on: Jul 23, 2025 | 1:19 PM

Harmanpreet Kaur : ఇంగ్లాండ్ గడ్డపై భారత మహిళా క్రికెట్ జట్టు మరోసారి తమ సత్తాను నిరూపించుకుంది. ఈసారి ఈ అద్భుత ప్రదర్శన చేసింది ప్రజలు ముద్దుగా డీఎస్పీ అని పిలుచుకునే క్రీడాకారిణి. ఈమె పంజాబ్ పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్. ఆమె ఎవరో కాదు భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్. తన బ్యాట్‌తో ఆమె తుఫాన్‌ను సృష్టించి, మైదానంలో పరుగుల వర్షం కురిపించింది. ఇంగ్లాండ్ గడ్డపై భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాట్ గర్జించడంతో స్టేడియం మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. ఈ మెరుపు ఇన్నింగ్స్‌లో ఆమె కేవలం సెంచరీ సాధించడమే కాకుండా, తన విమర్శకులకు దీటైన సమాధానం ఇచ్చింది. సోషల్ మీడియాలో కొందరు ఆమెను రిటైర్ అవ్వమని మాట్లాడుకోవడం మొదలుపెట్టిన వారికి, ఈ ఒక్క అద్భుతమైన ఇన్నింగ్స్ అందరి నోళ్లూ మూయించింది.

హర్మన్‌ప్రీత్ సిరీస్‌లోని మూడో, కీలకమైన వన్డేలో కేవలం 82 బంతుల్లోనే 102 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఆమె 54 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్న తర్వాత, కేవలం 28 బంతుల్లోనే దాన్ని సెంచరీగా మార్చడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఇన్నింగ్స్‌లో ఆమె బ్యాట్ నుంచి 14 ఫోర్లు వెల్లువెత్తాయి. వీటిలో 12 ఫోర్లు ఆఫ్ సైడ్ బంతులకే కొట్టింది. ఇది ఆమె బ్యాటింగ్ నైపుణ్యానికి నిదర్శనం.

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో వన్డే భారత జట్టుకు డూ ఆర్ డై లాంటి మ్యాచ్. మొదటి మ్యాచ్‌లో భారత్ గెలవగా, రెండో మ్యాచ్ ఇంగ్లాండ్ సొంతం చేసుకుంది. అలాంటి ఒత్తిడిలో హర్మన్‌ప్రీత్ తన కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్‌ను గెలిపించింది. ఆమె కెప్టెన్సీ ఇన్నింగ్స్ పుణ్యమా అని భారత్ 5 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యం ముందు ఇంగ్లాండ్ తలవంచక తప్పలేదు. ఈ విజయంతో పాటు, హర్మన్‌ప్రీత్ కౌర్ 266 రోజుల తర్వాత 50+ స్కోరు సాధించి, ఫామ్ లేమితో పోరాడుతున్న తన కెరీర్‌కు కొత్త ఊపునిచ్చింది.

ఈ ఇన్నింగ్స్‌తో హర్మన్‌ప్రీత్ ఒక చారిత్రక రికార్డును కూడా సృష్టించింది. ఇంగ్లాండ్ గడ్డపై వన్డే క్రికెట్‌లో మూడు సెంచరీలు సాధించిన తొలి విదేశీ బ్యాట్స్‌మెన్ గా ఆమె నిలిచింది. ఆమె మొదటి సెంచరీ ఆస్ట్రేలియాపై 171 పరుగులు (నాటౌట్), రెండో సెంచరీ ఇంగ్లాండ్‌పై 143 పరుగులు (నాటౌట్), మూడో సెంచరీ 102 పరుగులతో ఇఫ్పుడు చేసింది. ఈ మూడు అద్భుతమైన సెంచరీలు ఆమెను విదేశీ గడ్డపై మ్యాచ్ విన్నర్ ప్లేయర్‌గా నిలిపాయి.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..