Hardik Pandya : 11 సిక్సర్లు, 8 ఫోర్లు, 68 బంతుల్లో 133 పరుగులు..రాజ్‌కోట్ స్టేడియంలో పరుగుల ప్రభంజనం

Hardik Pandya : టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. గురువారం రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో చండీగఢ్‌తో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ (ఎలైట్ గ్రూప్ బి) మ్యాచ్‌లో పాండ్యా మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

Hardik Pandya : 11 సిక్సర్లు, 8 ఫోర్లు, 68 బంతుల్లో 133 పరుగులు..రాజ్‌కోట్ స్టేడియంలో పరుగుల ప్రభంజనం
Hardik Pandya

Updated on: Jan 08, 2026 | 8:45 PM

Hardik Pandya : టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. గురువారం రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో చండీగఢ్‌తో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ (ఎలైట్ గ్రూప్ బి) మ్యాచ్‌లో పాండ్యా మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మైదానం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపిస్తూ ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. కేవలం 31 బంతుల్లోనే 75 పరుగులు చేసి, బరోడా జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

టాస్ గెలిచిన బరోడా జట్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. కేవలం 11 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన ప్రియాన్షు మోలియాతో కలిసి పాండ్యా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 6వ నంబర్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన హార్దిక్, మొదట్లో కాస్త నిదానంగా ఆడినా, కుదురుకున్నాక మాత్రం బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 19 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

హార్దిక్ పాండ్యా ఆడిన ఈ మెరుపు ఇన్నింగ్స్‌లో మొత్తం 9 భీకరమైన సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి. అంటే 75 పరుగుల్లో 62 పరుగులు కేవలం బౌండరీల రూపంలోనే వచ్చాయి. అతని స్ట్రైక్ రేట్ 241.94గా నమోదైంది. గత మ్యాచ్‌లో విదర్భపై 68 బంతుల్లోనే 133 పరుగులు (11 సిక్సర్లు, 8 ఫోర్లు) చేసిన పాండ్యా, అదే ఊపును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. ప్రియాన్షు మోలియాతో కలిసి 5వ వికెట్‌కు 90 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి బరోడాను పటిష్ట స్థితిలో నిలిపాడు.

ఒకవైపు పాండ్యా విధ్వంసం సృష్టిస్తుంటే.. మరోవైపు ప్రియాన్షు మోలియా క్లాసిక్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 106 బంతుల్లో 103 పరుగులు చేసి జట్టుకు పటిష్టమైన పునాది వేశాడు. హార్దిక్ అవుట్ అయిన తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ రంగప్రవేశం చేశాడు. పాండ్యా వదిలిన చోటు నుంచే జితేష్ మొదలుపెట్టాడు. కేవలం 33 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు బాదాడు. మోలియా, జితేష్ కలిసి 6వ వికెట్‌కు కేవలం 57 బంతుల్లోనే 106 పరుగులు జోడించడంతో బరోడా స్కోరు 350 మార్కును దాటి, చివరకు 391 వద్ద నిలిచింది.

న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ముందు హార్దిక్ పాండ్యా ఇంతటి భీకర ఫామ్‌లో ఉండటం భారత జట్టుకు సానుకూల అంశం. వైట్ బాల్ క్రికెట్‌లో తానే అసలైన మ్యాచ్ విన్నర్ అని పాండ్యా మరోసారి నిరూపించుకున్నాడు. బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ 10 ఓవర్లు వేసి 3 వికెట్లు తీయడం అతని ఫిట్‌నెస్‌కు నిదర్శనం. గాయాల నుంచి కోలుకుని పూర్తి స్థాయి ఆల్‌రౌండర్‌గా పాండ్యా చూపిస్తున్న ఈ ప్రదర్శన చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు.

 

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.