Hardik Pandya : రెండు నెలలు క్రికెట్‎కు దూరమైనా ఫైర్ తగ్గలే..42 బంతుల్లో 77 పరుగులు..టీ20 సిరీస్‌కు లైన్ క్లియర్

గాయం కారణంగా దాదాపు రెండు నెలలు క్రికెట్‌కు దూరంగా ఉన్న స్టార్ ఆల్-రౌండర్ హార్దిక్ పాండ్యా, ఎట్టకేలకు తిరిగి మైదానంలోకి అడుగుపెట్టి సంచలనం సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025 లో బరోడా జట్టు తరఫున ఆడిన హార్దిక్, పంజాబ్‌పై 77 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్‌ ఆడి, తన జట్టుకు 7 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు.

Hardik Pandya : రెండు నెలలు క్రికెట్‎కు దూరమైనా ఫైర్ తగ్గలే..42 బంతుల్లో 77 పరుగులు..టీ20 సిరీస్‌కు లైన్ క్లియర్
Hardik Pandya (1)

Updated on: Dec 02, 2025 | 5:45 PM

Hardik Pandya : గాయం కారణంగా దాదాపు రెండు నెలలు క్రికెట్‌కు దూరంగా ఉన్న స్టార్ ఆల్-రౌండర్ హార్దిక్ పాండ్యా, ఎట్టకేలకు తిరిగి మైదానంలోకి అడుగుపెట్టి సంచలనం సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025 లో బరోడా జట్టు తరఫున ఆడిన హార్దిక్, పంజాబ్‌పై 77 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్‌ ఆడి, తన జట్టుకు 7 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో తాను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు నిరూపించాడు.

ఆసియా కప్ 2025 లో గాయపడిన తర్వాత హార్దిక్ పాండ్యా క్రికెట్‌కు కొంతకాలం దూరంగా ఉన్నాడు. శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ 2025 సూపర్-4 మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా క్వాడ్రిసెప్ ఇంజరీకి (తొడ ముందు భాగంలో) గురయ్యాడు. ఈ గాయం కారణంగా అతను రెండు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది.

సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌కు దూరమైన హార్దిక్, తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడానికి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా తరఫున కనీసం రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. తొలి మ్యాచ్‌లోనే బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ పాల్గొనడం ద్వారా, తాను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు హార్దిక్ నిరూపించాడు. ఈ ప్రదర్శనతో అతను సౌతాఫ్రికా సిరీస్‌లో జరగబోయే టీ20 సిరీస్‌లోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది.

పంజాబ్ జట్టు అద్భుతమైన బ్యాటింగ్‌తో బరోడా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు ఏకంగా 222 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ కేవలం 19 బంతుల్లో 50 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అన్‌మోల్‌ప్రీత్ సింగ్ 69 పరుగులు, నమన్ ధీర్ 39 పరుగులు చేశారు.

బరోడా తరఫున బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యా 4 ఓవర్లలో 52 పరుగులు ఇచ్చి ఒక వికెట్ (అభిషేక్ శర్మ) తీసుకున్నాడు. పరుగులు సమర్పించినా, పూర్తి కోటా ఓవర్లు వేయడం అతని ఫిట్‌నెస్‌కు సాక్ష్యం. 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బరోడా జట్టుకు హార్దిక్ పాండ్యా తన బ్యాటింగ్‌తో ఊపు తెచ్చాడు.

92 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన తర్వాత, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్ పాండ్యా దూకుడు ప్రదర్శించాడు. అతను కేవలం 42 బంతుల్లో అజేయంగా 77 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్ స్ట్రైక్ రేట్ 183.33 గా ఉంది. అతని బ్యాట్ నుంచి 7 మెరుపు ఫోర్లు మరియు 4 భారీ సిక్సర్లు వచ్చాయి. హార్దిక్ ఈ విధ్వంసక ఇన్నింగ్స్ కారణంగా బరోడా జట్టు 223 పరుగుల భారీ లక్ష్యాన్ని సులభంగా ఛేదించి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.