
IND vs NZ 4th T20 : టీ20 వరల్డ్ కప్ 2026కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ టీమిండియా మేనేజ్‌మెంట్‌కు సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఇప్పటికే 3-0తో సొంతం చేసుకుంది. సిరీస్ చేతికి చిక్కిన తరుణంలో, బుధవారం విశాఖపట్నం వేదికగా జరగనున్న నాలుగో టీ20లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. అయితే, అందరి దృష్టి సంజూ శాంసన్ లేదా బుమ్రాపైనే ఉన్నా, టీమిండియా మేనేజ్‌మెంట్ ఒక బోల్డ్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఈ మ్యాచ్ నుంచి తప్పించడం.
టీ20 వరల్డ్ కప్ 2026 ముంగిట ప్రతి మ్యాచ్ టీమిండియాకు ఒక ప్రాక్టీస్ లాంటిదే. ఇప్పటికే న్యూజిలాండ్‌పై సిరీస్ గెలిచిన భారత్, ఇప్పుడు మిగిలిన రెండు మ్యాచ్‌లను ప్రయోగాలకు వేదికగా మార్చుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ అనే పదం ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఇప్పటికే కొన్ని మ్యాచ్‌ల్లో విశ్రాంతి ఇస్తున్న జట్టు మేనేజ్‌మెంట్, ఇప్పుడు అదే సూత్రాన్ని హార్దిక్ పాండ్యాకు కూడా వర్తింపజేయాలని భావిస్తోంది. హార్దిక్ ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఆడాడు. కేవలం ఒకే ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసినా, మూడు మ్యాచ్‌ల్లోనూ కలిపి 8 ఓవర్లు బౌలింగ్ చేశాడు.
హార్దిక్ పాండ్యా టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ అతని ఫిట్‌నెస్ ఎప్పుడూ ఒక మిస్టరీనే. ఏ సమయంలో గాయపడతాడో ఎవరికీ తెలియదు. ఇప్పటికే వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్ సమస్యలతో జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇలాంటి తరుణంలో టీ20 వరల్డ్ కప్‌కు కొద్ది రోజుల ముందు, సిరీస్ ఫలితం తేలిపోయిన ఒక నామమాత్రపు మ్యాచ్ కోసం హార్దిక్‌ను మైదానంలోకి దించడం అనవసరమైన రిస్క్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ పొరపాటున ఈ మ్యాచ్‌లో హార్దిక్ గాయపడితే, అది వరల్డ్ కప్ రేసులో టీమిండియాకు కోలుకోలేని దెబ్బ అవుతుంది. అందుకే అతని ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను దృష్టిలో ఉంచుకుని విశ్రాంతి ఇవ్వడమే ఉత్తమం.
హార్దిక్ పాండ్యా జట్టులో లేకపోతే ఆ స్థానాన్ని భర్తీ చేయడం ఎవరికీ సాధ్యం కాదు. అయితే జట్టు కూర్పును బట్టి మార్పులు చేయవచ్చు. ఒకవేళ అదనపు బ్యాటర్ కావాలనుకుంటే శ్రేయస్ అయ్యర్ కు అవకాశం దక్కవచ్చు. అప్పుడు శివమ్ దూబేతో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయించి, అతని బౌలింగ్ పటిమను పరీక్షించే అవకాశం ఉంటుంది. లేదా అదనపు స్పిన్నర్ కావాలనుకుంటే రవి బిష్ణోయ్ లేదా స్పిన్ ఆల్‌రౌండర్‌ను తీసుకోవచ్చు. ఏది ఏమైనా వైజాగ్‌లో జరిగే నాలుగో టీ20లో యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇచ్చి, సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడమే గంభీర్-సూర్య ద్వయం తీసుకోబోయే తెలివైన నిర్ణయం కానుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..