Harbhajan Singh : హర్భజన్ సింగ్ పశ్చాత్తాపం.. శ్రీశాంత్ కూతురు మాటలతో కుప్పకూలిన భజ్జీ

ఐపీఎల్ 2008 నాటి థప్పడ్ కాండ్(చెంపదెబ్బ ఘటన) పై హర్భజన్ సింగ్ ఆర్ అశ్విన్ షోలో సంచలన విషయాలు వెల్లడించాడు. ఈ ఘటన తర్వాత శ్రీశాంత్ కూతురు తనతో మాట్లాడటానికి నిరాకరించినప్పుడు తాను ఎంత బాధపడ్డాడో, ఆ పశ్చాత్తాపం ఇప్పటికీ తనను ఎలా వెంటాడుతుందో హర్భజన్ పంచుకున్నాడు.

Harbhajan Singh : హర్భజన్ సింగ్ పశ్చాత్తాపం.. శ్రీశాంత్ కూతురు మాటలతో కుప్పకూలిన భజ్జీ
Harbhajan Singh

Updated on: Jul 21, 2025 | 12:39 PM

Harbhajan Singh : భారత క్రికెట్‌లో పెద్ద చర్చకు దారితీసిన సంఘటన ఐపీఎల్ 2008 లో జరిగింది. అప్పట్లో హర్భజన్ సింగ్, శ్రీశాంత్ మధ్య జరిగిన చెంపదెబ్బ సంఘటన సంఘటన సంచలనం సృష్టించింది. ఒక మ్యాచ్ తర్వాత వీరిద్దరు గొడవ పడ్డారు, ఆ తర్వాత శ్రీశాంత్ ఏడుస్తూ కనిపించాడు. హర్భజన్ అతన్ని చెంపదెబ్బ కొట్టాడని అప్పుడు తెలిసింది. ఆ సమయంలో శ్రీశాంత్ పంజాబ్ కింగ్స్ తరఫున, హర్భజన్ ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నారు. ఈ విషయంపై చాలా పెద్ద వివాదం చెలరేగింది. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత హర్భజన్ సింగ్ అశ్విన్ షోలో ఈ సంఘటన గురించి మాట్లాడాడు. ఆ గొడవ తర్వాత శ్రీశాంత్ కూతురు తనతో మాట్లాడటానికి ఇష్టపడలేదని, అది తనను చాలా బాధించిందని హర్భజన్ చెప్పాడు. ఆ మాటలు విన్నప్పుడు తను ఎంత కుప్పకూలిపోయాడో వెల్లడించాడు.

హర్భజన్ సింగ్ మాట్లాడుతూ, తన జీవితంలో ఒక విషయాన్ని మార్చగలిగితే అది ఈ చెంపదెబ్బ సంఘటన మాత్రమేనని చెప్పాడు. ఎందుకంటే, శ్రీశాంత్, అతని కూతురికి తాను పదే పదే క్షమాపణలు చెప్పినప్పటికీ, దానిని సరిదిద్దలేమని అన్నాడు. మొహాలీలో జరిగిన ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ తర్వాతే హర్భజన్, శ్రీశాంత్ ను చెంపదెబ్బ కొట్టాడు. మ్యాచ్ ఓడిపోయిన తర్వాత శ్రీశాంత్ భజ్జీని ఆటపట్టించాడని, దాంతో హర్భజన్ ఓపిక కోల్పోయాడని చెప్పాడు. ఇప్పుడు ఈ ఇద్దరు క్రికెటర్లు ఆ సంఘటనను మరిచిపోయి ముందుకు సాగుతున్నారు. కానీ, భజ్జీని మాత్రం ఆ ఘటన ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది.

అశ్విన్ యూట్యూబ్ షోలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ, “నా జీవితం నుంచి ఒక విషయాన్ని చెరిపివేయాలనుకుంటే, అది శ్రీశాంత్‌తో జరిగిన సంఘటన. అది తప్పు, నేను అలా చేయకూడదు. నేను 200 సార్లు క్షమాపణలు చెప్పాను. ఆ మ్యాచ్‌లో మేము ఒకరికొకరు ఆపోజిట్లో ఆడాం, కానీ అది అలా ప్రవర్తించే స్థాయికి వెళ్లకూడదు. అతనిది ఒకే ఒక్క తప్పు, నన్ను రెచ్చగొట్టాడు, అది ఓకే, కానీ ఆ తర్వాత నేను చేసింది సరికాదు” అని అన్నాడు.

హర్భజన్ సింగ్ మాట్లాడుతూ, “దీనిపై నాకు ఎక్కువగా బాధ కలిగింది శ్రీశాంత్ కూతురిని కలిసినప్పుడు. నేను ఆమెతో ఎంతో ప్రేమగా మాట్లాడుతుంటే, ‘నేను మీతో మాట్లాడాలనుకోవడం లేదు. మీరు మా నాన్నను కొట్టారు’ అని చెప్పింది. అది విని నేను కుప్పకూలిపోయాను, నాకు కన్నీళ్లు వచ్చాయి. నేను తనపై ఎలాంటి ముద్ర వేశానో తెలుసుకుని నన్ను నేను ప్రశ్నించుకున్నాను? ఆమె నన్ను చెడ్డవాడిగా భావిస్తుంటుంది కదా? ఆమె నన్ను, తన నాన్నను చెంపదెబ్బ కొట్టిన వ్యక్తిగా తెలుసు కదా?. అది నాకు చాలా చెడ్డగా అనిపించింది. ఇప్పటికీ నేను తన కూతురికి క్షమాపణలు చెబుతాను, నేను ఏమీ చేయలేను. నేను ఏమి చేస్తే నీకు మంచి అనిపిస్తుంది, నేను అలాంటి వ్యక్తిని కాదని నీకు తెలుస్తుంది, చెప్పు?’ అని నేను అడుగుతాను. శ్రీశాంత్ కూతురు పెద్దయ్యాక నన్ను ఈ కోణంలో చూడకూడదని కోరుకుంటున్నాను” అని చెప్పాడు.

 

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి