Gurnoor Brar : భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. వన్డే అరంగేట్రంలోనే చరిత్ర సృష్టించిన గుర్నూర్ బ్రార్

Gurnoor Brar : అఫ్గానిస్తాన్‌పై ధర్మశాల వన్డేలో అరంగేట్రం చేసిన గుర్నూర్ బ్రార్ 3 వికెట్లతో చరిత్ర సృష్టించాడు. భారత వన్డే డెబ్యూ బౌలర్ల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్న ఈ యువ పేసర్, తన అద్భుత ప్రదర్శనతో విమర్శకులకు బలమైన సమాధానం ఇచ్చాడు.

Gurnoor Brar : భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. వన్డే అరంగేట్రంలోనే చరిత్ర సృష్టించిన గుర్నూర్ బ్రార్
Gurnoor Brar

Updated on: Jun 14, 2026 | 1:03 PM

Gurnoor Brar : టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లోకి అడుగుపెడుతూనే సరికొత్త చరిత్ర సృష్టించాడు. శనివారం ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అతను భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు అతని సెలెక్షన్‌పై సోషల్ మీడియాలో ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ.. వాటన్నింటికీ తన బౌలింగ్‌తోనే ఈ యువ పేసర్ సమాధానం చెప్పాడు. తాను వేసిన మొదటి ఓవర్లోనే వికెట్ తీసి భారత జట్టుకు అద్భుతమైన బ్రేక్ త్రూ అందించాడు.

గుర్నూర్ బ్రార్ వేసిన మొదటి ఓవర్లోనే అఫ్గాన్ స్టార్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ, డారిల్ మిచెల్ తర్వాత మూడో స్థానంలో ఉన్న భయంకరమైన బ్యాటర్‌ను గుర్నూర్ కేవలం 1 పరుగుకే పెవిలియన్‌కు పంపడం విశేషం. అక్కడితోనే ఆగకుండా అఫ్గాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్, జియావుర్ రహ్మాన్ షరీఫీలను కూడా అవుట్ చేసి మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపు తిప్పేశాడు. మొత్తంగా 4.5 ఓవర్లలో కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు.

ఈ అద్భుత ప్రదర్శనతో గుర్నూర్ బ్రార్ వన్డే అరంగేట్రంలోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్ల జాబితాలో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ క్రమంలో 1991లో వాకా మైదానంలో వెస్టిండీస్‌పై 3/30 రికార్డు సాధించిన మాజీ బౌలర్ సుబ్రతో బెనర్జీని గుర్నూర్ వెనక్కి నెట్టాడు. ఈ జాబితాలో 2021లో ఇంగ్లాండ్‌పై 4/54 తీసిన ప్రసిద్ధ్ కృష్ణ టాప్‌లో ఉండగా.. నోయల్ డేవిడ్ (3/21), వరుణ్ ఆరోన్ (3/24) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ బౌలర్ కూడా వన్డే డెబ్యూలో 5 వికెట్ల మార్కును అందుకోకపోవడం గమనార్హం.

ధర్మశాలలో కురిసిన భారీ వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను ఇరు జట్లకు చెరి 25 ఓవర్లుగా కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ జట్టు ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (51 బంతుల్లో 102 పరుగులు) సెంచరీతో చెలరేగడంతో 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది. భారత జట్టులో గుర్నూర్‌తో పాటు హర్ష్ దూబే కూడా ఇదే మ్యాచ్‌తో డెబ్యూ చేశాడు. హర్ష్ దూబే కూడా అద్భుతంగా రాణించి 5 ఓవర్లలో 47 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. వీరితో పాటు అర్ష్‌దీప్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి చెరో 2 వికెట్లు పడగొట్టారు.

195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ప్రారంభంలోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో జరిగిన కమ్యూనికేషన్ లోపం వల్ల సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ (16) రన్ అవుట్ అయ్యాడు. అయితే ఆ ఒత్తిడిని అధిగమిస్తూ గిల్ మైదానంలో నిలదొక్కుకున్నాడు. 66 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి తోడుగా ఈశాన్ కిషన్ (34), చివర్లో కేఎల్ రాహుల్ (19 బంతుల్లో 39 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 22.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో భారత్ 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. తదుపరి మ్యాచ్ జూన్ 17న లక్నోలో జరగనుంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us