
Alyssa Healy : ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ దిగ్గజం, కెప్టెన్ ఎలిస్సా హీలీ తన వన్డే కెరీర్‌కు చాలా గ్రాండ్‌గా వీడ్కోలు పలికారు. హోబర్ట్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఆమె ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఇది ఆమె కెరీర్‌లో ఆఖరి వన్డే మ్యాచ్ కావడం విశేషం. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన హీలీ, భారత్‌తో జరుగుతున్న ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్ తర్వాత శాశ్వతంగా ఆటకు వీడ్కోలు పలకనున్నారు. తన ఫేర్‌వెల్ మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకుంటూ కేవలం 79 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్న హీలీ, మొత్తంగా 98 బంతుల్లో 158 పరుగులు సాధించి భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. హీలీ బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి అడుగుపెడుతున్న సమయంలో భారత క్రీడాకారిణులు రెండు వరుసలుగా నిలబడి ఆమెకు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ పట్ల భారత మహిళా జట్టు ప్రదర్శించిన ఈ క్రీడా స్ఫూర్తిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. క్రీజులోకి వచ్చిన తర్వాత హీలీ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఆమె ఇన్నింగ్స్‌లో ఏకంగా 27 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. స్నేహ రాణా వేసిన బంతిని రివర్స్ స్వీప్ ఆడబోయి క్లీన్ బౌల్డ్ కావడంతో ఆమె అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. తన చివరి వన్డేలో సెంచరీ చేసిన రెండో మహిళా క్రికెటర్‌గా హీలీ రికార్డు సృష్టించారు.
మరోవైపు, కామెంటరీ బాక్స్‌లో కూర్చున్న హీలీ భర్త, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తన భార్య సెంచరీ కొట్టగానే మురిసిపోయారు. హీలీ ఫోర్ కొట్టి వంద పరుగులు పూర్తి చేయగానే స్టార్క్ ముఖంలో కనిపించిన ఆనందం, గర్వం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హీలీ తన కెరీర్‌లో ఆస్ట్రేలియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించారు. 6 టీ20 ప్రపంచకప్‌లు, 2 వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన జట్టులో ఆమె సభ్యురాలు. 2010లో 19 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన హీలీ, వన్డేల్లో 3700 పైగా పరుగులు, టీ20ల్లో 3000 పైగా పరుగులు సాధించి తిరుగులేని లెజెండ్‌గా ఎదిగారు.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 409 పరుగుల భారీ స్కోరు సాధించింది. హీలీతో పాటు బెత్ మూనీ కూడా 106 పరుగులతో నాటౌట్‌గా నిలిచి సత్తా చాటారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కష్టాల్లో ఉంది. ఈ వన్డే సిరీస్ ముగిసిన తర్వాత మార్చి 6 నుంచి 9 వరకు పెర్త్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఏకైక డే అండ్ నైట్ టెస్ట్ జరగనుంది. అదే ఎలిస్సా హీలీకి ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్. ఆ తర్వాత ఆమె పసుపు రంగు జెర్సీలో మళ్ళీ కనిపించరు. ఒక శకం ముగియబోతున్న వేళ హీలీ ఆడిన ఈ మెరుపు ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..