ICC: రాబోయే రోజుల్లో క్రికెట్ ప్రపంచం బయో బుడగ నుంచి బయటపడే అవకాశాలు కినిపిస్తున్నాయి. నివేదికల ప్రకారం, బయో బుడగలు ఉపయోగించకుండా ప్రీమియర్ లీగ్ మోడల్‌ను నిర్వహించేందుకు కొత్త పద్ధతులను ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం జరిగిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో బయో బబుల్ సమస్యలపై చర్చించారు. ఇందులో సభ్యులంతా బబుల్ మోడల్ స్థిరంగా లేదని అంగీకరించారు. అయితే, మోడల్‌ను మార్చడానికి ఐసీసీ సభ్యులు ఎటువంటి టైమ్ ఫ్రేమ్‌ను సెట్ చేయకపోవడంతో మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందేనని తెలుస్తోంది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, ఐసీసీలోకి ఓ అధికారి మాట్లాడుతూ, ప్రీమియర్ లీగ్ తరహా మోడల్‌ను ఎంచుకునే ఛాన్స్ ఉంది. ఇక్కడ బయో-బబుల్ ఉపయోగించకుండా ఆటగాళ్లు క్రికెట్ ఆడనున్నారు. అయితే ఈ మోడల్‌లోనూ క్రమం తప్పకుండా ఆటగాళ్లను పరీక్షిస్తారు. ప్రీమియర్ లీగ్‌లో కరోనా పాజిటివ్ వ్యక్తితో పరిచయం ఉన్న ఆటగాళ్లను ఒంటరిగా పంపరు. పాజిటివ్ వచ్చిన వారు మాత్రమే క్వారంటైన్‌కు వెళ్లనున్నారు.
బయో-బబుల్ ఆటగాళ్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా అన్ని ఫార్మాట్‌లలో చాలా మ్యాచ్‌లు ఆడే జట్ల ఆటగాళ్లు చాలా కష్టాలు ఎదుర్కొనున్నారు. ఉదాహరణకు, జూన్ 2న ఇంగ్లండ్‌తో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్ సిరీస్ కోసం భారత జట్టు బయలుదేరింది. సెప్టెంబరు రెండవ వారంలో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో చివరి టెస్టు వాయిదా పడిన తర్వాత, చాలా మంది ఆటగాళ్లు టీ20 ప్రపంచ కప్‌కు వెళ్లే ముందు నేరుగా ఐపీఎల్ బుడగలోకి వెళ్లారు.
భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ప్రపంచ కప్‌లో తన జట్టు చివరి మ్యాచ్ తర్వాత ఇంత సుదీర్ఘమైన బబుల్ లైఫ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. “ఆరు నెలల పాటు బబుల్‌లో మూడు ఫార్మాట్‌లలో ఆడే ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. గత 24 నెలల్లో కేవలం 25 రోజులు మాత్రమే ఇంట్లో గడపగలిగారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పెద్ద ఆటగాడైన సరే.. వారి ఆటపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. దీంతో వారి సగటు కూడా తగ్గుతుంది’ అని పేర్కొన్నారు.