Viral Video : మాక్స్‌వెల్ కొడితే స్టేడియం దాటాల్సిందే..104 మీటర్ల భారీ సిక్సర్‌తో బంతి గల్లంతు..వీడియో వైరల్!

Viral Video : ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ మైదానంలోకి దిగితే బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. తాజాగా బిగ్ బాష్ లీగ్‎లో మాక్స్‌వెల్ తన విశ్వరూపాన్ని చూపించాడు. కేవలం బ్యాట్‌తో బంతిని తాకడమే ఆలస్యం.. అది ఏకంగా స్టేడియం దాటి బయట పడింది.

Viral Video : మాక్స్‌వెల్ కొడితే స్టేడియం దాటాల్సిందే..104 మీటర్ల భారీ సిక్సర్‌తో బంతి గల్లంతు..వీడియో వైరల్!
Glenn Maxwell

Updated on: Dec 28, 2025 | 6:01 PM

Viral Video : ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ మైదానంలోకి దిగితే బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. తాజాగా బిగ్ బాష్ లీగ్‎లో మాక్స్‌వెల్ తన విశ్వరూపాన్ని చూపించాడు. కేవలం బ్యాట్‌తో బంతిని తాకడమే ఆలస్యం.. అది ఏకంగా స్టేడియం దాటి బయట పడింది. మాక్సీ కొట్టిన ఆ ధాటికి బంతి కనిపించకుండా పోవడంతో, అంపైర్లు కొత్త బంతిని తీసుకురావాల్సి వచ్చింది.

డిసెంబర్ 28న సిడ్నీ థండర్, మెల్బోర్న్ స్టార్స్ మధ్య జరిగిన బిగ్ బాష్ లీగ్ మ్యాచ్‌లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. మెల్బోర్న్ స్టార్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 11వ ఓవర్ వేసిన డేనియల్ సామ్స్ బౌలింగ్‌లో మాక్స్‌వెల్ రెచ్చిపోయాడు. ఓవర్ మూడో బంతిని డీప్ మిడ్-వికెట్ దిశగా గాల్లోకి లేపాడు. ఆ షాట్ పవర్‌కు బంతి ఏకంగా 104 మీటర్ల దూరం ప్రయాణించి స్టేడియం బయట పడింది. బంతి దొరకకపోవడంతో మ్యాచ్‌ను కొనసాగించేందుకు నిర్వాహకులు కొత్త బంతిని మైదానంలోకి తెచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

సిడ్నీ థండర్ నిర్దేశించిన 129 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మెల్బోర్న్ స్టార్స్ ఊదేసింది. ఓపెనర్లు జో క్లార్క్ (60), సామ్ హార్పర్ (29) శుభారంభం ఇవ్వగా.. మాక్స్‌వెల్ తన మెరుపు బ్యాటింగ్‌తో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. కేవలం 20 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేసి జట్టుకు 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందించాడు. మాక్సీ స్ట్రైక్ రేట్ ఏకంగా 195గా ఉండటం విశేషం. 14 ఓవర్లలోనే మ్యాచ్ ముగిసిపోవడంతో మాక్స్‌వెల్ పవర్‌ ఏంటో మరోసారి రుజువైంది.

మాక్స్‌వెల్ ఇలా 100 మీటర్ల కంటే ఎక్కువ దూరం సిక్సర్లు కొట్టడం ఇదే మొదటిసారి కాదు. గత సీజన్ (BBL 14)లో ఏకంగా 122 మీటర్ల పొడవైన సిక్సర్ బాది టీ20 క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డును నెలకొల్పాడు. చిన్నపాటి బ్యాట్ స్వింగ్‌తోనే బంతిని స్టేడియం వెలుపలకు పంపగల సత్తా మాక్సీ సొంతం. తాజా ఇన్నింగ్స్‌తో మెల్బోర్న్ స్టార్స్ జట్టు పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది.

 

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..