Team India : కోహ్లీ-రోహిత్‌లపై గంభీర్ కీలక వ్యాఖ్యలు..2027 వరల్డ్ కప్ ప్రశ్నలకు చెక్ పెట్టిన లెజెండ్స్
Team India : ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ ఓటమి తర్వాత భారత జట్టు, సౌతాఫ్రికా పై గెలుపుతో సత్తా చాటింది. విశాఖపట్నంలో జరిగిన మూడవ వన్డేలో 9 వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ విజయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు మరోసారి అద్భుత ప్రదర్శన చేసి తమ విలువను నిరూపించుకున్నారు.

Team India : ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ ఓటమి తర్వాత భారత జట్టు, సౌతాఫ్రికా పై గెలుపుతో సత్తా చాటింది. విశాఖపట్నంలో జరిగిన మూడవ వన్డేలో 9 వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ విజయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు మరోసారి అద్భుత ప్రదర్శన చేసి తమ విలువను నిరూపించుకున్నారు. ఈ ఇద్దరు స్టార్ బ్యాట్స్‌మెన్‌లను ఉద్దేశించి, భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
గత రెండు నెలలుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై క్రికెట్ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరిగింది. కొన్ని నివేదికల ప్రకారం.. టీమ్ మేనేజ్‌మెంట్, సెలెక్టర్లు 2027 వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ఇద్దరినీ పక్కన పెట్టవచ్చని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఈ ఇద్దరు దిగ్గజాలే వరుసగా రెండు వన్డే సిరీస్‌లలో భారత జట్టుకు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లుగా నిలిచి, తమపై వచ్చిన అన్ని అనుమానాలను పటాపంచలు చేశారు.
వరుసగా రెండు వన్డే సిరీస్‌లలో రోహిత్, విరాట్‌ల నిలకడైన ప్రదర్శన, జట్టులో వారి ప్రాముఖ్యతను స్పష్టంగా రుజువు చేసింది. ఈ నేపథ్యంలో వారిని జట్టు నుంచి తొలగించడం అనేది ప్రస్తుతం అసాధ్యంగా మారింది. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యల్లోనూ ఈ సంకేతాలు కనిపించాయి. “వారిద్దరూ భారత్ తరఫున చాలా కాలంగా ఇలాంటి ప్రదర్శననే చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా వైట్-బాల్ ఫార్మాట్‌లో వారు మరింత మెరుగ్గా ఆడుతూనే ఉంటారని ఆశిస్తున్నాను” అని గంభీర్ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.
సుమారు 9 నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న విరాట్, రోహిత్ ఆస్ట్రేలియా సిరీస్‌తో తిరిగి వచ్చారు. ఆస్ట్రేలియా సిరీస్‌లో రోహిత్ శర్మ అత్యధికంగా 203 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకోగా, కోహ్లీ చివరి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ అత్యధికంగా 302 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. రోహిత్ శర్మ కూడా రెండు హాఫ్ సెంచరీలు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.




