క్రికెట్ చరిత్రలో ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలు మీరు చూసి ఉంటారు. అవి స్టాండ్స్‌లో కూర్చునే ప్రేక్షకుడిది.. లేదా అంపైర్.. లేదా ఏ ఆటగాడికైనా సంబంధించినది కావొచ్చు. ఇది ప్రేక్షకుడు, అంపైర్ లేదా స్టేడియంలో ఉన్న ఏ ఆటగాడికైనా సంబంధించినది కావచ్చు. ఇప్పుడు చెప్పబోయే సంఘటన ఓ గొప్ప క్రికెటర్‌ది. అతడు తన కెరీర్‌లో చివరి టెస్ట్ ఆడుతున్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. అది కుడా క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్ మైదానంలో జరిగింది. అతడు తన చివరి టెస్టులో అద్భుతమైన సెంచరీతో చెలరేగిపోయాడు. అయితే మ్యాచ్ ముందు రోజు మాత్రం రాత్రంతా మద్యం సేవించి మత్తులో తూలాడు. క్రీజులో బ్యాటింగ్ చేసినంతసేపు అతడు కడుపు అంతా తిప్పిందట. వాంతులు వస్తాయేమోనని భయపడ్డాడట. అయితే అవన్నీ పక్కన పెడితే అతడు మాత్రం తన చివరి టెస్టులో 26వ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. అతడెవరో కాదు గ్యారీ సోబర్స్.
ఈ టెస్ట్ మ్యాచ్ 1973వ సంవత్సరం ఆగష్టు 23-27 మధ్య జరిగింది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మూడో టెస్ట్ ఇది. ఇందులో వెస్టిండీస్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 8 వికెట్ల నష్టానికి 652 పరుగులకు డిక్లేర్ చేసింది. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు ఉన్నాయి. అయితే అందులోనూ అద్భుతమైన, చిరస్మరణీయ సెంచరీ గ్యారీ సోబర్స్‌ది అని చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహన్ కన్హాయ్ 157 పరుగులు చేయగా, గ్యారీ సోబర్స్ అజేయంగా 150 పరుగులు చేశాడు. ఇక బెర్నార్డ్ జూలియన్ 121 పరుగులతో అదరగొట్టాడు. అలాగే క్లైవ్ లాయిడ్ 63 పరుగులు చేయగా, రాయ్ ఫ్రెడెరిక్స్ 51 పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బాబ్ విల్లిస్ 4 వికెట్లు, టోనీ గ్రెయిగ్ మూడు వికెట్లు తీశారు.
సోబర్స్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే సెకండ్ రోజు ప్లే మొదలయ్యే ముందు రోజు రాత్రి అతడు రాత్రంతా మద్యం సేవించాడు. మరుసటి రోజు బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు, అతడి పరిస్థితి పూర్తిగా బాగోలేదు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వాంతులు అవుతాయేమోనని భయపడ్డాడు. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం అతడే వెల్లడించాడు. కాని ఆ ఇన్నింగ్స్‌లో సోబర్స్ మొత్తం 227 బంతులు ఎదుర్కుని 19 ఫోర్ల సహాయంతో అజేయంగా 150 పరుగులు చేశాడు.
కాగా, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులు చేసింది. కీత్ ఫ్లెచర్ అత్యధికంగా 68 పరుగులు చేశాడు. వెస్టిండీస్ బౌలర్లలో వాన్బర్న్ హోల్డర్, కీత్ బోయిస్ నాలుగేసి వికెట్లు తీశారు. రెండు వికెట్లు లాన్స్ గిబ్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఫాలో-ఆన్ ఆడిన ఇంగ్లాండ్ కేవలం 193 పరుగులకే ఆలౌట్ అయింది. ఈసారి కూడా కీత్ ఫ్లెచర్ అజేయంగా 86 పరుగులు చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ బౌలర్లు కీత్ బోస్ నాలుగు వికెట్లు, లాన్స్ గిబ్స్, బెర్నార్డ్ జూలియన్ మూడేసి వికెట్లు పడగొట్టారు.