Vaibhav Suryavanshi: ఓ రైతు కొడుకు.. 14 ఏళ్లకే ఐపీఎల్‌ ఎలా ఆడగలుగుతున్నాడు? పొలం అమ్మేసి మరీ.. కన్నీళ్లు పెట్టించే ఓ తండ్రి కథ!

వైభవ్ సూర్యవంశీ, 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ లో అడుగుపెట్టిన అద్భుత ప్రతిభావంతుడు. తన తండ్రి అండతో కష్టపడి, గ్రామీణ క్రికెట్ నుంచి ఐపీఎల్ వరకు తన ప్రయాణాన్ని సాధించాడు. అతని క్రికెట్ ప్రతిభ, తండ్రి త్యాగం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Vaibhav Suryavanshi: ఓ రైతు కొడుకు.. 14 ఏళ్లకే ఐపీఎల్‌ ఎలా ఆడగలుగుతున్నాడు? పొలం అమ్మేసి మరీ.. కన్నీళ్లు పెట్టించే ఓ తండ్రి కథ!
001

Edited By: Venkata Chari

Updated on: May 20, 2025 | 8:37 AM

వైభవ్‌ సూర్యవంశీ.. ఐపీఎల్‌ 2025 సీజన్‌ కోసం జరిగిన మెగా వేలంలో ఏకంగా రూ.కోటి 10 లక్షల ధర పలికి టాక్‌ ఆఫ్‌ ది క్రికెట్‌ టౌన్‌గా నిలిచాడు. ఎందుకంటే.. అప్పటికీ మనోడికి కేవలం 13 ఏళ్లు మాత్రమే. అంత చిన్న వయసులో ఐపీఎల్‌ లాంటి ఒక మెగా లీగ్‌లో అంత భారీ ధర పలకడంతో క్రికెట్‌ అభిమానులంతా ఎవర్రా వీడు అంటూ అతని గురించే మాట్లాడుకున్నారు. ఈ ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభంలో ధోని, సంజు శాంసన్‌ నటించిన ఓ యాడ్‌లో 13 ఏళ్ల కుర్రాడ్ని ఆడిస్తున్నావ్‌ అంటా.. అతను పుట్టకముందే మేం కప్పు గెలిచాం అని ధోని అంటాడు, పర్లేదులే అన్న మీరు ఐపీఎల్‌ నుంచి వెళ్లిపోయేలోపు అతను కూడా కప్పు గెలుస్తాడంటూ సంజు కూడా సరదాగా కౌంటర్‌ ఇస్తాడు. అలా ధోని లాంటి ఒక బిగ్‌ స్టార్‌ నటించే ఐపీఎల్‌ ప్రమోషనల్‌ యాడ్‌కు వైభవ్‌ స్క్రిప్ట్‌గా మారాడు.

కానీ, ఐపీఎల్‌ మొదలై రాజస్థాన్‌ రాయల్స్‌ 7 మ్యాచ్‌లు ఆడేసేంత వరకు కూడా వైభవ్‌కు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. కానీ, కెప్టెన్‌ సంజు శాంసన్‌ గాయంతో శనివారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరం కావడంతో.. వైభవ్‌ బరిలోకి దిగేందుకు రంగం సిద్ధమైంది. యశస్వి జైస్వాల్‌తో కలిసి 181 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగాడు. తాను ఎదుర్కొన్న ఫస్ట్‌ బాల్‌కే సిక్స్‌ కొట్టి.. పేరుకే పాల బుగ్గల పసివాడు, బరిలోకి దిగితే పంజా విసిరే బెబ్బులి అనేలా తన ఎంట్రీని తెలుగు కమర్షియల్‌ సినిమాలో హీరో ఎంట్రీ రేంజ్‌లో ఇచ్చాడు. ఆ తర్వాత ఫియర్‌లెస్‌ క్రికెట్‌ ఆడుతూ.. కొన్ని చూడచక్కటి షాట్లు ఆడాడు. మొత్తంగా 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 34 పరుగులు చేసి ఇంప్రెస్‌ చేశాడు.

అయితే.. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఈ కుర్రాడు ఐపీఎల్‌ ఆడుతున్నాడు అంటే.. హైలీ టాలెంటెడ్‌ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతని ఆట చూస్తే.. మినిమమ్‌ క్రికెట్‌ నాలెడ్జ్‌ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైపోయి ఉంటుంది. కానీ, ఇంత చిన్న వయసులో ఈ స్థాయికి రావాలంటే టాలెంట్‌ ఒక్కటే సరిపోదు కదా.. సపోర్ట్‌ ఉండాలి. మరి ఈ కుర్రాడికి ఆ సపోర్ట్‌ ఇచ్చింది ఎవరో తెలుసా? అతని కన్న తండ్రి. అందరి నాన్నలానే వైభవ్‌ వాళ్ల నాన్న కూడా తన కొడుకులోని టాలెంట్‌ను పసిగట్టాడు. ఇక అక్కడి నుంచి ఆయన ఎన్నో కష్టాలు భరిస్తూ.. కొడుకు క్రికెటర్‌ను చేయడమే లక్ష్యంగా ముందుకు నడిచాడు. మరి ఆ ప్రయాణంలో ఆయన ఎన్ని బాధలు పడ్డాడు, ఏం కోల్పో్యాడు అనేది తెలుసుకుంటే.. చాలా ఇన్స్‌పైరింగ్‌గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం రండి తెలుసుకుందాం..

2011 మార్చి 27న బీహార్‌లోని తాజ్‌పూర్ అనే ఓ మారుమూల గ్రామంలో జన్మించాడు వైభవ్ సూర్యవంశీ. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు.. వైభవ్‌కు నాలుగేళ్ల వయసులోనే క్రికెట్‌ అంటే ఇష్టమనే విషయం అతని తండ్రి సంజీవ్‌కి అర్థమైంది. వెంటనే తన ఇంటి వెనుక భాగంలో వైభవ్ కోసం ఒక చిన్న ఆట స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఆయనే స్వయంగా రోజంతా కష్టపడి ఆ స్థలం అంతా చదును చేసి కొడుకు కోసం చిన్న ప్లే గ్రౌండ్‌ తయారు చేసి ఇచ్చాడు. అలా ఇంటి వెనుక వైభవ్‌ ఆడుకునే వాడు. అతనికి తొమ్మిది సంవత్సరాలు నిండగానే క్రికెట్‌ కోచింగ్‌ కోసం తమ ఊరికి దగ్గర్లోని సమస్తిపూర్ పట్టణంలోని క్రికెట్ అకాడమీలో వైభవ్‌ను చేర్పాడు వాళ్ల నాన్న. తొమ్మిదేళ్ల కొడుకు క్రికెటర్‌గా ఎదుగుతాడనే నమ్మకంతో.. సంజీవ్‌ చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. వైభవ్‌ క్రికెట్‌ కోచింగ్‌ కోసం తన పొలం అమ్మాలని నిర్ణయించుకున్నాడు.

ఆ పొలంపై తన కుటుంబం ఆధారపడి జీవిస్తుందనే విషయాన్ని కూడా పక్కనపెట్టి.. కొడుకు ఎదుగుదలనే నమ్మాడు. తన కొడుకు క్రికెట్ కలలను సాకారం చేసుకోవడానికి మోతీపూర్‌లోని తన పొలాన్ని అమ్మేశాడు. అలా తన తండ్రి తన కోసం, తన కల ఇంతలా కష్టపడుతున్నాడు, ఇంత పెద్ద త్యాగం చేస్తున్నాడనే విషయం వైభవ్‌ పసి మనసుకు తెలుసో లేదు. అది తెలియకపోయినా.. క్రికెట్‌పై ఇష్టంతో ప్రాణం పెట్టి క్రికెట్‌లో మెళకులవలు నేర్చుకున్నాడు. సమస్తిపూర్‌లో రెండున్నర సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత విజయ్ మర్చంట్ ట్రోఫీ కోసం అండర్-16 ట్రయల్స్ ఇచ్చాడు వైభవ్‌. అదే సమయంలో మాజీ రంజీ ఆటగాడు మనీష్ ఓజా ఆధ్వర్యంలో వైభవ్‌కు మంచి క్వాలిటీ కోచింగ్‌ కూడా అందింది. ఆయన కోచింగ్‌ వైభవ్‌కు ఎంతో ప్లస్‌ అయింది.

ప్రస్తుతం వైభవ్‌ సక్సెస్‌లో తన తండ్రితో పాటు కోచ్‌ మనీష్‌ ఓజా పాత్ర కూడా ఎంతో ఉంది. కేవలం 12 సంవత్సరాల వయసులోనే బీహార్ తరపున వినూ మన్కడ్ ట్రోఫీలో ఆడి, కేవలం ఐదు మ్యాచ్‌ల్లోనే దాదాపు 400 పరుగులు చేశాడు. తరువాత 2023 నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని ములపాడులో జరిగిన అండర్-19 క్వాడ్రాంగ్యులర్ సిరీస్ కోసం వైభవ్ ఇండియా బీ అండర్-19 జట్టులోకి ఎంపికయ్యాడు. ఇండియా ఎ జట్టుతో పాటు బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ అండర్-19 జట్లు కూడా ఆ టోర్నీలో పాల్గొన్నాయి. 2024 ఐసిసి అండర్-19 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ఎంపిక చేయడానికి ఆ టోర్నమెంట్‌ను ఓ ట్రయల్‌లా భావించారు. ఆ టోర్నీలో ఇంగ్లాండ్‌పై 41 పరుగులు, బంగ్లాదేశ్‌పై డకౌట్, ఇండియా Aపై 8 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఇండియా అండర్‌ 19 టీమ్‌లో స్థానం సంపాదించలేకపోయాడు.

కానీ, వెంటనే పుంజుకుని, బిహార్‌ రంజీ ట్రోఫీ జట్టులో స్థానం సంపాదించడానికి అండర్‌-23 ఎంపిక శిబిరంలో బీహార్ సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. జనవరి 2024లో పాట్నాలో బలమైన ముంబై జట్టుతో జరిగిన బీహార్ రంజీ ట్రోఫీ 2023-24 ఎలైట్ గ్రూప్ B మ్యాచ్‌లో వైభవ్ ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. ఆ సమయంలో కేవలం 12 సంవత్సరాల 284 రోజుల వయస్సులో, వైభవ్ సూర్యవంశీ 1986 తర్వాత ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా, బీహార్ తరపున రంజీ ట్రోఫీలో ఆడిన రెండవ అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా కూడా నిలిచాడు. భారత క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసినప్పుడు వారి వయసు 16 ఏళ్ల కంటే తక్కువ. వారి రికార్డును వైభవ్‌ బ్రేక్‌ చేశాడు. సెప్టెంబర్ 2024లో చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన యూత్ టెస్ట్ మ్యాచ్‌లో భారత అండర్‌-19 జట్టులోకి అరంగేట్రం చేయడం ద్వారా వైభవ్ సూర్యవంశీ మరో చరిత్ర సృష్టించాడు.

ఆ మ్యాచ్‌లో 62 బంతుల్లో 104 పరుగులు చేసి అదరగొట్టాడు. ఆ మ్యాచ్‌ సమయంలో వైభవ్‌ వయసు కేవలం 13 సంవత్సరాల 188 రోజుల మాత్రమే. యుఏఈలో జరిగిన అండర్-19 ఆసియా కప్ 2024లో ఇండియా ఫైనల్‌కు చేరుకోవడంలో వైభవ్ సూర్యవంశీ కీలక పాత్ర పోషించాడు. 2024-25 సీజన్‌లో విజయ్ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్‌తో హైదరాబాద్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో బీహార్ తరపున ఆడిన తర్వాత లిస్ట్-ఎ క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. అదే టోర్నీలో బరోడాతో జరిగిన మ్యాచ్‌లో 42 బంతుల్లో 71 పరుగులు చేసి లిస్ట్ ఎ క్రికెట్‌లో హాఫ్‌ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయ ఆటగాడిగా కొత్త చరిత్ర సృష్టించాడు.

ఇలా ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చే ముందే ఎన్నో రికార్డులు నెలకొల్పుతూ వచ్చాడు. ఇక ఐపీఎల్‌ 2025 మెగా వేలానికి ముందు, రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్‌ నాగ్‌పూర్‌లో ట్రయల్స్ క్యాంప్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్యాంప్‌కు వైభవ్‌ కూడా హాజరయ్యాడు. అప్పుడు ఆర్‌ఆర్‌ బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్ రాథోడ్ ఒక ఓవర్లో 17 పరుగులు చేయాలని వైభవ్‌కు టార్గెట్‌ ఇచ్చారు. కానీ, వైభవ్‌ ఏకంగా మూడు సిక్సర్లు బాదేసి ఆయన టార్గెట్‌ను ఫినిష్‌ చేశాడు. దాంతో వైభవ్‌ను కచ్చితంగా తీసుకోవాల్సిందే అని విక్రమ్‌ రాథోడ్‌ ఫిక్స్‌ అయ్యాడు. అలా ఐపీఎల్‌ మెగా వేలంలో రాజస్థాన్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోటీ పడి వైభవ్‌ను ఒక కోటి 10 లక్షలకు సొంతం చేసుకొని.. ఈ సీజన్‌లో తమ టీమ్‌ ఆడే 8వ మ్యాచ్‌లో అవకాశం ఇచ్చింది.

అయితే.. వైభవ్‌ 14 ఏళ్లకే ఇంత జర్నీ చేశాడంటే.. నిజంగా గొప్ప విషయమే కానీ, ఈ ప్రయాణంలో ప్రతి అడుగులో వెన్నంటి నిలిచి, తన సమయం, డబ్బు, కష్టం అన్ని ఇచ్చిన తండ్రి సంజీవ్‌ చేసింది కూడా అంతకంటే గొప్ప పని. అయినా కొడుకు కొడుతున్న ప్రతి పరుగు ఆ తండ్రికి తన కష్టం మర్చిపోయేలా చేస్తుంది. ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని మరింత నిలబెట్టుకుంటూ.. త్వరలోనే వైభవ్‌ టీమిండియాకు కూడా ఆడి, దేశానికి ప్రాతినిధ్యం వహించి, ఆ తండ్రి రుణం తీర్చుకోవాలని కోరుకుందాం.. ఆల్‌ ది బెస్ట్‌ వైభవ్‌ సూర్యవంశీ.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.