
Team India: రాబోయే రెండు కీలకమైన ప్రపంచకప్‌ల నేపథ్యంలో భారత జట్ల కెప్టెన్ల ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. సూర్యకుమార్ యాదవ్ (సీనియర్ T20 జట్టు కెప్టెన్), ఆయుష్ మాత్రే (అండర్-19 జట్టు కెప్టెన్) ఇద్దరూ వరుస వైఫల్యాలతో సతమతమవుతుండటం టీమ్ ఇండియాకు పెద్ద తలనొప్పిగా మారింది.
ప్రపంచకప్‌ల ముంగిట ఆందోళన: 2026 ప్రారంభంలో జనవరిలో అండర్-19 ప్రపంచకప్, ఫిబ్రవరిలో పురుషుల టీ20 ప్రపంచకప్ జరగనున్నాయి. ఈ రెండు మెగా టోర్నీల్లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నప్పటికీ, కెప్టెన్ల పేలవ ప్రదర్శన జట్టును కలవరపెడుతోంది.
ఆయుష్ మాత్రే వైఫల్యం: ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో 348 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కెప్టెన్ ఆయుష్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. కేవలం ఫైనల్‌లోనే కాదు, ఈ టోర్నీ మొత్తంలో అతను 13 సగటుతో కేవలం 65 పరుగులు మాత్రమే చేశాడు. అండర్-19 కెరీర్‌లో ఇప్పటివరకు ఆడిన 14 వన్డేల్లో ఒక్క అర్ధశతకం కూడా చేయలేకపోవడం అతని ఫామ్‌పై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
సూర్యకుమార్ యాదవ్ గడ్డు కాలం: సీనియర్ టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా గత కొంతకాలంగా పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. 2024 ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీ చేపట్టిన సూర్య, 2025లో ఇప్పటివరకు ఆడిన 21 టీ20ల్లో కేవలం 218 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క ఫిఫ్టీ కూడా లేదు. ఇటీవల దక్షిణాఫ్రికా సిరీస్‌లోనూ 4 ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 34 పరుగులే చేశాడు.
ప్రపంచకప్ వంటి పెద్ద టోర్నమెంట్‌లకు వెళ్లేముందు కెప్టెన్లు ముందుండి జట్టును నడిపించాలి. కానీ, ప్రస్తుతం ఇద్దరు కెప్టెన్ల బ్యాట్లు మూగబోవడం భారత క్రికెట్ అభిమానులను, మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. టోర్నీలు ప్రారంభమయ్యేలోపు వీరు తిరిగి ఫామ్‌లోకి రావడం అత్యవసరం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..