
IPL 2025 Death Overs Bowling Analysis: ఐపీఎల్ అంటేనే పరుగుల సునామీ. బ్యాట్స్‌మెన్‌లు సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడే ఈ లీగ్‌లో, డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పరుగులు కట్టడి చేయడం బౌలర్లకు నిజమైన సవాల్. ఈ పరిస్థితుల్లో డాట్ బాల్స్ వేయడం అనేది బౌలర్ల నైపుణ్యానికి, ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండే సామర్థ్యానికి నిదర్శనం. 18వ ఐపీఎల్ సీజన్ 2025లో డెత్ ఓవర్లలో అత్యధిక డాట్ బాల్స్ వేసి తమ జట్లకు కీలక విజయాలను అందించిన ఐదుగురు బౌలర్ల గురించి ఇప్పుడు చూద్దాం..
1. మతీషా పతిరానా (చెన్నై సూపర్ కింగ్స్): చెన్నై సూపర్ కింగ్స్ యువ సంచలనం, శ్రీలంక స్టార్ పేసర్ మతీషా పతిరానా డెత్ ఓవర్లలో తనదైన మార్క్ చూపించాడు. “స్లింగర్ మలింగ” గా పేరుగాంచిన పతిరానా, డెత్ ఓవర్లలో అత్యధిక డాట్ బాల్స్ (36) వేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. అతని కచ్చితమైన యార్కర్లు, విభిన్నమైన బౌలింగ్ యాక్షన్ బ్యాట్స్‌మెన్‌లకు కొరకరాని కొయ్యగా మారాయి. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ, పరుగులు కట్టడి చేస్తూ CSK కు అండగా నిలిచాడు. అతను 9 వికెట్లు కూడా పడగొట్టాడు.
2. ప్రసిద్ధ్ కృష్ణ (గుజరాత్ టైటాన్స్): గుజరాత్ టైటాన్స్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ డెత్ ఓవర్లలో 34 డాట్ బాల్స్ వేసి రెండో స్థానంలో నిలిచాడు. తన వేగంతో, కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ తో బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతని బౌలింగ్ జట్టుకు చాలా కీలకంగా మారింది. ప్రసిద్ధ్ కృష్ణ 11 వికెట్లు కూడా పడగొట్టాడు.
3. జస్‌ప్రీత్ బుమ్రా (ముంబై ఇండియన్స్): ప్రపంచంలోనే అత్యుత్తమ డెత్ ఓవర్ల బౌలర్‌గా పేరుగాంచిన జస్‌ప్రీత్ బుమ్రా, ఈ సీజన్‌లో కూడా తన స్థాయిని నిరూపించుకున్నాడు. డెత్ ఓవర్లలో 29 డాట్ బాల్స్‌తో అతను మూడో స్థానంలో ఉన్నాడు. అతని కచ్చితమైన యార్కర్లు, స్లో బాల్స్, బౌన్సర్‌లతో బ్యాట్స్‌మెన్‌లకు పరుగులు రాకుండా అడ్డుకున్నాడు. ముఖ్యంగా ఒత్తిడిలో బుమ్రా బౌలింగ్ ముంబై ఇండియన్స్‌కు ఎన్నో మ్యాచ్‌లను గెలిపించింది. అతను 6 వికెట్లు సాధించాడు.
4. హర్షల్ పటేల్ (పంజాబ్ కింగ్స్): ‘పర్పుల్ పటేల్’ గా పేరుగాంచిన హర్షల్ పటేల్ తన స్లో డెలివరీలతో, వేగంలో మార్పులతో బ్యాట్స్‌మెన్‌లను బోల్తా కొట్టించడంలో దిట్ట. ఈ ఐపీఎల్ సీజన్‌లో డెత్ ఓవర్లలో 28 డాట్ బాల్స్ వేసి నాలుగో స్థానంలో నిలిచాడు. పంజాబ్ కింగ్స్ కు కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ, పరుగులు నియంత్రించడంలో అతను కీలక పాత్ర పోషించాడు. అతను 7 వికెట్లు పడగొట్టాడు.
5. నూర్ అహ్మద్ (చెన్నై సూపర్ కింగ్స్): చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న యువ ఆఫ్ఘన్ స్పిన్నర్ నూర్ అహ్మద్, తన లెగ్ స్పిన్ తో బ్యాట్స్‌మెన్‌లను ముప్పు తిప్పలు పెట్టాడు. డెత్ ఓవర్లలో 27 డాట్ బాల్స్ వేసి ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. స్పిన్నర్ అయి ఉండి డెత్ ఓవర్లలో ఇంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం విశేషం. అతను 5 వికెట్లు కూడా సాధించాడు.
ఈ ఐదుగురు బౌలర్లు తమ అద్భుతమైన బౌలింగ్‌తో ఐపీఎల్ 2025 లో డెత్ ఓవర్లలో బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేసి, తమ జట్ల విజయాలకు కీలక పాత్ర పోషించారు. వీరి ప్రదర్శన డెత్ ఓవర్లలో బౌలింగ్ ప్రాముఖ్యతను మరోసారి చాటిచెప్పింది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..