Match Fixing : భారత క్రికెట్‌లో భూకంపం.. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో నలుగురు క్రికెటర్లు సస్పెండ్

Match Fixing : క్రికెట్ ప్రపంచం మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా సిగ్గుపడాల్సి వచ్చింది. ఈసారి భారత దేశవాళీ క్రికెట్‌లో ఈ అవమానకర సంఘటన వెలుగులోకి వచ్చింది. అస్సాం క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సనాతన్ దాస్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. నలుగురు ఆటగాళ్లను తక్షణమే సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.

Match Fixing : భారత క్రికెట్‌లో భూకంపం.. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో నలుగురు క్రికెటర్లు సస్పెండ్
Syed Mushtaq Ali Trophy

Updated on: Dec 13, 2025 | 8:02 AM

Match Fixing : క్రికెట్ ప్రపంచం మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా సిగ్గుపడాల్సి వచ్చింది. ఈసారి భారత దేశవాళీ క్రికెట్‌లో ఈ అవమానకర సంఘటన వెలుగులోకి వచ్చింది. అస్సాం క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సనాతన్ దాస్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. నలుగురు ఆటగాళ్లను తక్షణమే సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. సస్పెండ్ చేయబడిన ఆ నలుగురు ఆటగాళ్లు అమిత్ సిన్హా, ఇషాన్ అహ్మద్, అమన్ త్రిపాఠి, అభిషేక్ ఠాకురి.

సస్పెండ్ అయిన ఈ నలుగురు ఆటగాళ్లు క్రికెట్‌లో అవినీతి సంబంధిత కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారని సనాతన్ దాస్ వెల్లడించారు. ఈ ఉదంతం సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2025 టోర్నమెంట్‌కు సంబంధించినది. అసోసియేషన్ కార్యదర్శి సనాతన్ దాస్ ఒక ప్రకటనలో ఈ విషయంపై మరింత స్పష్టత ఇచ్చారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం… “ఈ నలుగురు క్రికెటర్లు గతంలో వివిధ స్థాయిల్లో అస్సాంకు ప్రాతినిధ్యం వహించారు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2025లో అస్సాం తరఫున ఆడిన కొందరు ఆటగాళ్లను ప్రభావితం చేయడానికి, ఉసిగొల్పడానికి వీరు ప్రయత్నించారు.” ఈ ఆరోపణలు వెలుగులోకి రాగానే బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించింది.

అస్సాం క్రికెట్ అసోసియేషన్ ఈ నలుగురు ఆటగాళ్లపై కేవలం సస్పెన్షన్ విధించడమే కాకుండా, వారిపై నేర విచారణను కూడా ప్రారంభించింది. మ్యాచ్ ఫిక్సింగ్‌లో ప్రమేయం ఉన్న ఆ నలుగురు ఆటగాళ్లపై గువాహటిలోని క్రైమ్ బ్రాంచ్‌లో ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేసినట్లు ఏసీఏ తెలిపింది. ఇదిలా ఉండగా బీసీసీఐ కార్యదర్శి దేవ్జీత్ సైకియా ఇటువంటి అవినీతి కార్యకలాపాలకు పాల్పడే ఆటగాళ్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని సైకియా స్పష్టం చేశారు.

అస్సాం జట్టు సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ఎలైట్ గ్రూప్ A లో ఉంది. భారత స్టార్ క్రికెటర్ రియాన్ పరాగ్ కూడా ఈ జట్టు నుంచే ఆడుతున్నాడు. అస్సాం జట్టు 7 మ్యాచ్‌లలో కేవలం మూడు విజయాలు మాత్రమే నమోదు చేసి, తమ గ్రూప్‌లోని ఎనిమిది జట్లలో 7వ స్థానంలో నిలిచింది. అయితే మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో పేరు బయటపడిన ఆ నలుగురు ఆటగాళ్లలో ఎవరూ కూడా సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో అస్సాం స్క్వాడ్‌లో భాగం కాదని ఏసీఏ స్పష్టం చేసింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..