కరేబీయన్ క్రికెట్.. వెస్టిండీస్ జట్టు నుంచి ఎంతోమంది దిగ్గజ క్రికెటర్లు ఎన్నో ఘనతలు సాధించిన సంగతి తెలిసిందే. బ్రియాన్ లారా, వివిన్ రిచర్డ్స్, క్రిస్ గేల్, గ్యారీ సోబర్స్, గోర్డాన్ గ్రీనిడ్జ్, మైఖేల్ హోల్డింగ్, ఆండీ రాబర్ట్స్, జోయెల్ గార్నర్, మాల్కం మార్షల్ ఇలా చాలామంది దిగ్గజాలు ఉన్నారు. వీరంతా కూడా 1970-80 మధ్య కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ వెలుగు వెలిగారు. అయితే అంతకముందే ఈ టీం నుంచి ఓ స్పిన్నర్ ప్రపంచ క్రికెట్‌ను శాసించాడు. ఇక అతడు ఎవరో కాదు లాన్స్ గిబ్స్. 1960వ దశకంలో దిగ్గజ విండీస్ ఆఫ్-స్పిన్నర్‌గా ఘనత సాధించాడు. అతడి కెరీర్‌లో పలు ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం..
ఈ లెజెండరీ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ 29 సెప్టెంబర్ 1934న క్వీన్‌స్టౌన్, బ్రిటిష్ గయానాలో జన్మించాడు. 1953-54లో గిబ్స్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. లెగ్ స్పిన్నర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన గిబ్స్.. బంతుల వేగాన్ని నియంత్రించడంలో పట్టు కోల్పోయాడు. ఇక అప్పుడే అతడు మాజీ ఇంగ్లీష్ క్రికెటర్ ఆర్థర్ మెక్‌ఇంటైర్ సలహాల మేరకు ఆఫ్ స్పిన్నర్ అవతారమెత్తాడు.
1959వ సంవత్సరంలో గిబ్స్ పాకిస్థాన్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. మొదటి టెస్టులో నాలుగు వికెట్లు తీసిన గిబ్స్.. ఆ తర్వాత జట్టులో కీలక సభ్యుడిగా మారేందుకు కొంత సమయం తీసుకోవాల్సి వచ్చింది. ఇక 1961వ సంవత్సరంలో ఆస్ట్రేలియా పర్యటనలో గిబ్స్ దుమ్ముదులిపాడని చెప్పాలి. ఈ పర్యటనలో మూడు టెస్టులు ఆడిన గిబ్స్ మొత్తంగా 18 వికెట్లు తీశాడు. అడిలైడ్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో గిబ్స్ హ్యాట్రిక్‌తో సహా 5 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పర్యటనల అనంతరం టీమిండియాతో జరిగిన సిరీస్‌లో గిబ్స్ కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచాడు. 1962వ సంవత్సరంలో బ్రిడ్‌టౌన్‌లో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో గిబ్స్ 38 పరుగులిచ్చి 8 విక్లెట్లు పడగొట్టాడు.
టెస్టు క్రికెట్ చరిత్రలో 300 వికెట్లు తీసిన రెండో బౌలర్ గిబ్స్. అగ్రస్థానంలో ఇంగ్లాండ్ లెజెండరీ పేసర్ ఫ్రెడ్ ట్రూమాన్ ఉన్నాడు. అలాగే ప్రపంచంలోనే 300 వికెట్లు పడగొట్టిన మొట్టమొదటి స్పిన్నర్ గిబ్స్ కావడం విశేషం. 1975-76లో ఈ ఘనతను సాధించాడు. కాగా, 79 టెస్టులు ఆడిన గిబ్స్.. 1.98 ఎకానమీతో 309 వికెట్లు తీసుకున్నాడు. ఇందులో 18 సార్లు 5 వికెట్లు పడగొట్టాడు. అటు ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో గిబ్స్ ఏకంగా 1024 వికెట్లు తీశాడు.