AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడా.. నేడు కీలక ప్రకటన చేయనున్న భారత మాజీ సారథి ధోని..

MS Dhoni Social Media Post: సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసిన భారత మాజీ సారథి ఎంఎస్ ధోని సెప్టెంబర్ 25 న ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెప్పుకొచ్చాడు.

MS Dhoni: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడా.. నేడు కీలక ప్రకటన చేయనున్న భారత మాజీ సారథి ధోని..
Ms Dhoni
Venkata Chari
|

Updated on: Sep 25, 2022 | 8:47 AM

Share

MS Dhoni Social Media Post: భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన మహేంద్ర సింగ్ ధోని.. నేడు అంటే సెప్టెంబర్ 25న ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ధోనీ.. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఫేస్‌బుక్ లైవ్‌లో ఓ న్యూస్ ఇవ్వబోతున్నట్లు స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. దీంతో ఈ జార్ఖండ్ డైనమేట్ ఎలాంటి న్యూస్ ఇవ్వనున్నాడోనని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎంఎస్ ధోని తన ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో పోస్ట్ చేయడం ద్వారా ప్రత్యక్ష ప్రసారం గురించి సమాచారం అందించాడు. మహి చేసే కీలక ప్రకటనపైనే అంతా ఓ కన్నేశారు. మహేంద్ర సింగ్ ధోనీ తన అభిమానులతో లైవ్‌లో కలవబోతున్నాడు. సెప్టెంబర్ 25న ధోనీ తన అభిమానులతో మాట్లాడి ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడని భావిస్తున్నారు.

ఎంఎస్ ధోని సోషల్ మీడియా పోస్ట్‌లో “నేను మీతో ఒక వార్తను పంచుకుంటాను. సెప్టెంబర్ 25 మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ సమాచారాన్ని ఇస్తాను. మీరందరూ లైవ్‌లోకి వస్తారని ఆశిస్తున్నాను” అని రాసుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఆ విషయంలో ప్రపంచంలోనే ఏకైక సారథి..

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోనీ, అన్ని ICC ఈవెంట్‌లను (ODI ప్రపంచ కప్, T20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ) గెలుచుకున్న ప్రపంచంలోని ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో తన కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్‌ను నాలుగుసార్లు ఛాంపియన్‌గా మార్చాడు.

2004లో అరంగేట్రం..

23 డిసెంబర్ 2004న బంగ్లాదేశ్‌పై ధోని తన ODI అరంగేట్రం చేశాడు. దీని తర్వాత అతను డిసెంబర్ 2005లో శ్రీలంకపై టెస్టు అరంగేట్రం చేశాడు. వన్డేల్లో అరంగేట్రం చేసిన తర్వాత 2005లో పాకిస్థాన్‌పై ధోనీ సెంచరీ చేశాడు. 123 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 148 పరుగులు చేశాడు. ఫిబ్రవరి 2006లో కేవలం 46 బంతుల్లో 72 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ కూడా పాకిస్థాన్‌తో జరిగిందే కావడం విశేషం.

2007లో సారథిగా..

సెప్టెంబరు 2007లో తొలిసారి ధోనీకి భారత క్రికెట్ జట్టు కెప్టెన్సీ లభించింది. అతను 2007 T20 ప్రపంచ కప్‌లో భారత కెప్టెన్సీని చేపట్టాడు. భారతదేశాన్ని ప్రపంచ ఛాంపియన్‌గా చేశాడు. మహీ సారథ్యంలో భారత్ 2011 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. 28 ఏళ్ల తర్వాత భారత్ వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.

ఆ రికార్డులో మూడో స్థానం..

ఇలా చెప్పుకుంటూ పోతే.. ధోనీ రికార్డులు ఎన్నో ఉన్నాయి. వీటిని బద్దలు కొట్టడం ఏ ఆటగాడికైనా అంత సులభం కాదు. ప్రపంచంలోనే అత్యధిక ఔట్‌లు చేసిన వికెట్‌కీపర్‌గా మూడో స్థానంలో నిలిచాడు. ధోనీ 350 మ్యాచ్‌ల్లో 444 సార్లు ఆటగాళ్లను అవుట్ చేశాడు. ఇందులో 321 క్యాచ్‌లు, 123 స్టంప్‌లు ఉన్నాయి. ఈ విషయంలో కుమార సంగక్కర మొదటి స్థానంలో ఉన్నాడు. 482 మంది ఆటగాళ్లను పెవిలియన్‌కు పంపాడు. కాగా, ఆడమ్ గిల్‌క్రిస్ట్ రెండో స్థానంలో ఉన్నాడు.