Sunil Gavaskar Comments: క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్ మైదానంలో సెంచరీ చేసినంత మాత్రన అంతా అయిపోలేదని.. అసలు కథ ఇప్పుడే మొదలైందని ఇండియన్ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. తాజాగా రెండో టెస్టులో భారత ఓపెనర్ రోహిత్ శర్మ తొలి ఇన్నింగ్స్‌లో 83 పరుగులు చేయడంపై స్పందిస్తూ సన్నీ ఈ వ్యాఖ్యలు చేశాడు. సెంచరీ మిస్ అయిందని రోహిత్ బాధపడవచ్చు కానీ భారత బ్యాట్స్‌మెన్ విదేశాల్లో ఎక్కడ సెంచరీ బాదినా అది ప్రత్యేకమేనని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఓ స్పోర్ట్స్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ రోహిత్ శర్మ అద్భుతంగా ఆడాడని ప్రశంసించాడు.
ఒక్కో ఆటగాడిలో ఒక్కో నైపుణ్యం దాగి ఉంటుంది. అది అవసరమైనపుడు బయటికి వస్తుందన్నాడు. ‘ఒక టెస్టు మ్యాచ్‌లో పిచ్ ఎలా స్పందిస్తుందో ఎవరూ అంచనా వేయలేరు. పిచ్‌లో జీవం ఉందా లేదా అనేది ఎవరికి తెలియదు. బంతి బౌన్స్ అవుతుందా లేదా అనేది అర్థంకాదు. ఇవన్నీ తెలియాలంటే కాస్త సమయం పడుతుంది. ఈ క్రమంలోనే రోహిత్ తన ఆటను అద్భుతంగా మలుచుకున్నాడు. ఎలాంటి షాట్లు ఆడాలి. ఎలాంటి బంతులు వేయాలనే విషయాలపై కచ్చితమైన అవగాహనతో ఉన్నాడు. అదంతా మానసికంగా దృఢంగా ఉంటేనే సాధ్యమవుతుంది.
ఒక బ్యాట్స్‌మన్ ఒక మ్యాచ్‌లో 80 పరుగులు చేశాడంటే సిరీస్ మొత్తం 400 పైచిలుకు పరుగులు చేసే అవకాశం ఉంటుంది. ఒక ఆటగాడి నుంచి కెప్టెన్ ఇంతకన్నా ఏం ఆశించగలడు? ఇక సెంచరీ కోల్పోవడం అనేది రోహిత్ బాధపడి ఉండొచ్చు. కానీ, లార్డ్స్‌లో శతకం సాధించినంత మాత్రాన అంతా జయించినట్టు కాదు, అదొక్కటే ముఖ్యం కాదు’ అని గావస్కర్ విశ్లేషించాడు. సునీల్ గవాస్కర్ ఒంటి చేత్తో ఎన్నో విజయాలను దేశానికి అందించిన చరిత్ర ఉంది.