
FIFA World Cup 2026 : క్రీడా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి ముందే ఒక వింతైన, భయాందోళన కలిగించే వార్త వెలుగులోకి వచ్చింది. ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న స్విట్జర్లాండ్ ఫుట్‌బాల్ జట్టుకు ఊహించని ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం అమెరికాలో కఠినమైన శిక్షణ పొందుతున్న ఈ జట్టు ఆటగాళ్లకు అక్కడి స్థానిక అధికారులు, వన్యప్రాణి విభాగం అత్యంత కీలకమైన హెచ్చరికలు జారీ చేసింది. వారు ప్రాక్టీస్ చేస్తున్న ఏరియా చుట్టూ అత్యంత ప్రమాదకరమైన విషసర్పాలు తిరుగుతుండటమే ఇందుకు కారణం.
స్విట్జర్లాండ్ జట్టు ప్రస్తుతం అమెరికాలోని శాన్ డియాగో నగరంలో తమ వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. అయితే, వారు ఎంచుకున్న ట్రైనింగ్ క్యాంప్ వెలుపల ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములలో ఒకటైన రాటిల్ స్నేక్‌కి చెందిన నాలుగు విభిన్న జాతులు భారీ సంఖ్యలో నివసిస్తున్నట్లు గుర్తించారు. ఈ పాములు ఎంత ప్రమాదకరమైనవంటే, ఇవి కరిస్తే మనుషులు ప్రాణాలు కోల్పోవడానికి పెద్దగా సమయం పట్టదు. ఈ నేపథ్యంలో స్విస్ ఫుట్‌బాలర్లు తమ ప్రాక్టీస్ గ్రౌండ్ పరిధి దాటి అస్సలు బయటకు వెళ్లకూడదని యాజమాన్యం కఠినమైన నిబంధనలు విధించింది.
ట్రైనింగ్ సెషన్‌లో భాగంగా ఆటగాళ్లు కొట్టే ఫుట్‌బాల్స్ కొన్నిసార్లు మైదానాన్ని దాటి అవతలి వైపు ఉన్న పొదల్లోకి వెళ్తుంటాయి. సాధారణంగా అయితే ప్లేయర్స్ లేదా సిబ్బంది వెళ్లి ఆ బంతులను తెచ్చుకుంటారు. కానీ శాన్ డియాగో క్యాంప్‌లో మాత్రం అలా చేయడానికి వీల్లేదని కోచ్‌లు కరాఖండిగా చెప్పారు. పొరపాటున బాల్ గ్రౌండ్ సరిహద్దులు దాటి బయటకు వెళ్తే, ప్రాణాలను పణంగా పెట్టి ఆ బాల్స్ వెతకడానికి వెళ్లాల్సిన అవసరం లేదని, వాటిని అలాగే వదిలేసి వేరే కొత్త బంతులతో ప్రాక్టీస్ కొనసాగించాలని ఆటగాళ్లకు గట్టిగా ఆదేశించారు.
ఈసారి ఫిఫా వరల్డ్ కప్‌లో స్విట్జర్లాండ్ జట్టు గ్రూప్-బిలో చోటు దక్కించుకుంది. ఈ గ్రూప్‌లో ఆ జట్టుతో పాటు టోర్నీ ఆతిథ్య దేశమైన కెనడా, అలాగే ఖతార్, బోస్నియా అండ్ హెర్జెగోవినా జట్లు ఉన్నాయి. అంతర్జాతీయ ఫుట్‌బాల్ రంగంలో స్విట్జర్లాండ్ అత్యంత స్థిరమైన ప్రదర్శన చేసే జట్టుగా పేరు తెచ్చుకుంది. మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఆటను తమ నియంత్రణలో ఉంచుకోవడం, మైదానంలో చాలా తక్కువ తప్పులు చేయడం ఈ జట్టు ప్రధాన బలం. మరి ఇంతటి కన్సిస్టెన్సీ ఉన్న జట్టు ఈ పాముల భయాన్ని దాటుకుని ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో చూడాలి.
ఈ ఏడాది జరగబోయే ఫిఫా వరల్డ్ కప్ అనేక సరికొత్త రికార్డులకు వేదిక కానుంది. జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న ఈ ఫుట్‌బాల్ పండుగ జూలై 19 వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులను ఉర్రూతలూగించనుంది. ఫిఫా చరిత్రలోనే మొదటిసారిగా ఈసారి 48 జట్లు ప్రపంచకప్ టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి. అంతేకాకుండా, చరిత్రలో తొలిసారిగా మూడు దేశాలు (అమెరికా, కెనడా, మెక్సికో) సంయుక్తంగా ఈ మెగా టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తుండటం విశేషం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి