AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup 2026 : ఫుట్‌బాల్ హిస్టరీలో సరికొత్త చరిత్ర.. 36 ఏళ్ల నాటి వరల్డ్ కప్ రికార్డును బద్దలు కొట్టిన స్పెయిన్ గోల్‌కీపర్

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026లో స్పెయిన్ గోల్‌కీపర్ ఉనై సిమోన్ వరుసగా 519 నిమిషాలు గోల్ ఇవ్వకుండా 36 ఏళ్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఆస్ట్రియాపై విజయంతో స్పెయిన్ ప్రీక్వార్టర్స్‌కు చేరగా సిమోన్ చరిత్ర సృష్టించాడు.

FIFA World Cup 2026 : ఫుట్‌బాల్ హిస్టరీలో సరికొత్త చరిత్ర.. 36 ఏళ్ల నాటి వరల్డ్ కప్ రికార్డును బద్దలు కొట్టిన స్పెయిన్ గోల్‌కీపర్
Fifa World Cup 2026
Rakesh
|

Updated on: Jul 03, 2026 | 12:09 PM

Share

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026 రౌండ్ ఆఫ్ 32 పోరులో ఆస్ట్రియాపై 3-0తో ఘన విజయం సాధించిన స్పెయిన్ జట్టు ప్రీ-క్వార్టర్ ఫైనల్ టికెట్‌ను ఖరారు చేసుకోవడమే కాకుండా, ఫుట్‌బాల్ చరిత్రలో ఒక అద్భుతమైన మైలురాయిని అందుకుంది. స్పెయిన్ జట్టుకు చెందిన 29 ఏళ్ల స్టార్ గోల్‌కీపర్ ఉనై సిమోన్ వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ కాలం పాటు ప్రత్యర్థి జట్టుకు ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఈ టోర్నమెంట్‌లో వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ క్లీన్ షీట్ నమోదు చేయడం ద్వారా ఎథ్లెటిక్ బిల్బావో క్లబ్‌కు ఆడే ఈ నమ్మకమైన కీపర్ తన పేరును చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.

గత ప్రపంచకప్‌తో పాటు ప్రస్తుత వరల్డ్ కప్ మ్యాచ్‌లను కలిపి ఉనై సిమోన్ మైదానంలో వరుసగా 519 నిమిషాల పాటు ప్రత్యర్థులకు చిక్కకుండా అజేయంగా నిలిచాడు. ఈ అద్భుత ప్రదర్శనతో ఆయన ఇటలీకి చెందిన గ్రేట్ గోల్‌కీపర్ వాల్టర్ జెంగా 1990లో నెలకొల్పిన 36 ఏళ్ల నాటి రికార్డును అధిగమించాడు. వాల్టర్ జెంగా తన సొంత దేశంలో జరిగిన వరల్డ్ కప్‌లో వరుసగా 517 నిమిషాల పాటు గోల్ కాకుండా అడ్డుకుని ఐదు క్లీన్ షీట్లు సాధించాడు. ఇప్పుడు సిమోన్ ఆ రికార్డును దాటేశాడు. అంతేకాదు, ఆస్ట్రియాపై జరిగిన మ్యాచ్ రెండో హాఫ్‌లో సిమోన్ స్పెయిన్ దేశపు బెస్ట్ గోల్‌కీపర్ ఇకర్ కాసియాస్ పేరిట ఉన్న జాతీయ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. కాసియాస్ 2010, 2014 ప్రపంచకప్‌లలో స్పెయిన్ తరఫున సుదీర్ఘ కాలం క్లీన్ షీట్ సాధించిన కీపర్‌గా రికార్డుల్లో ఉన్నాడు.

ఈ మ్యాచ్‌లో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. స్పెయిన్ డిఫెన్స్ ఎంత బలంగా ఉందంటే, ఆస్ట్రియా ఆటగాళ్లు మ్యాచ్ మొత్తం మీద స్పెయిన్ గోల్ పోస్ట్ వైపు ఒక్కటంటే ఒక్క షాట్ ఆన్ టార్గెట్ కూడా కొట్టలేకపోయారు. దీనివల్ల గోల్‌కీపర్ ఉనై సిమోన్‌కు ఈ మ్యాచ్‌లో కనీసం ఒక్క సేవ్ చేయాల్సిన అవసరం కూడా రాలేదు. ఈ టోర్నమెంట్ మొత్తంలో స్పెయిన్ జట్టుపై ప్రత్యర్థి జట్లు కేవలం 4 సార్లు మాత్రమే ఖచ్చితమైన షాట్లు కొట్టగలిగాయంటే స్పెయిన్ రక్షణ శ్రేణి ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సిమోన్ మైదానంలో పెద్దగా హడావుడి చేయకపోయినా, జట్టును గెలిపించే విషయంలో వెనుక ఉండి నడిపించే ఒక అభేద్యమైన గోడలా మారాడు.

ప్రస్తుతం స్పెయిన్ ఫుట్‌బాల్ జట్టులో గోల్‌కీపర్ స్థానం కోసం పోటీ ఏ స్థాయిలో ఉందో చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఐరోపాలోని టాప్ క్లబ్స్‌కు ఆడి కప్పులు గెలిచిన ఇద్దరు ప్రపంచ స్థాయి బెస్ట్ కీపర్లు ఉనై సిమోన్ ఫామ్ కారణంగా మ్యాచ్ అంతా బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తోంది. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌లో ఆర్సెనల్ క్లబ్ తరఫున వరుసగా మూడు సార్లు గోల్డెన్ గ్లవ్ అవార్డు గెలుచుకుని, ఈ ఏడాది ఆ జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టిన డేవిడ్ రాయా ప్రస్తుతం స్పెయిన్ జట్టులో రిజర్వ్ కీపర్‌గా ఉన్నాడు. అలాగే బార్సిలోనా క్లబ్‌కు ఆడుతూ ప్రపంచంలోనే అత్యుత్తమ యువ కీపర్‌గా పేరు తెచ్చుకున్న గార్సియా కూడా కేవలం బెంచ్ మీద కూర్చుని మ్యాచ్ చూడాల్సి వస్తోంది. ఇంతటి దిగ్గజాలు జట్టులో ఉన్నప్పటికీ, స్పెయిన్ కోచ్ లుయిస్ డి లా ఫ్యూయెంటె మాత్రం ఉనై సిమోన్‌పైనే తన పూర్తి నమ్మకాన్ని ఉంచారు, ఆ నమ్మకాన్ని సిమోన్ నిలబెట్టుకున్నాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us