హైదరాబాద్‌లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంటేనే చర్చనీయాంశంగా మారుతుంది. గత అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భాగంగా టికెట్ల పంపిణీ విషయంలో ఎలాంటి రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా 18వ తేదీ న్యూజిలాండ్‌తో జరిగే తొలి వన్డే మ్యాచ్‌కు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికైంది. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వైఫల్యం మరోసారి బయటపడింది.
ఈనెల 18న భారత్- కివీస్ మధ్య జరగబోయే వన్డే మ్యాచ్‌కి సంబంధించిన టికెట్ల వివాదం మరోసారి స్పష్టంగా కనిపించింది. మ్యాచ్ దగ్గరపడుతున్న టికెట్ల గందరగోళం క్రికెట్ ప్రియులను వేదిస్తుంది. 13వ తారీఖు ఆన్ లైన్ లో పెట్టిన 6వేల టికెట్లు నిమిషాల వ్యవధిలో బుక్ అయ్యాయి. 14వ తారీఖు సాయంత్రం 5గంటలకు పేటీయంలో విడుదల చేసిన 7వేల టికెట్లు బుక్ అవక నానా తంటాలు పడ్డారు. అయితే టికెట్ల విషయంలో మాకేం సంబంధం లేదంటూ చేతులెత్తేస్తుంది హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్. దీంతో ఏం చేయాలో తేలియ తలలుపట్టుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.
హెచ్‌సీఏ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. పేటియంలో అమ్మకాలు ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే అభిమానులకు సర్వర్ సమస్య తలెత్తింది. పేటీఎం సైట్ మొరాయించడంతో టికెట్లను కొనుగోలు చేయలేక ఇబ్బందిపడ్డారు. తర్వాత విక్రయాలు ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే టికెట్లు సోల్డ్ ఔట్ అయ్యాయని నిర్వాహకులు ప్రకటించడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. టికెట్ల విక్రయాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని విమర్శలు చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. టికెట్లను పకడ్బంధీగా అమ్మడంలో హెచ్‌సీఏ పూర్తిగా విఫలమైందని అభిమానులు ఆరోపిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..