
Fact Check : సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తున్న ప్రతి పోస్టును గుడ్డిగా నమ్మడం ఎంత ప్రమాదకరమో చాటిచెప్పే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. భారత క్రికెట్ దిగ్గజం, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ పేరిట ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. విద్యార్థుల పరీక్షలు, పారదర్శకత, మెరిట్ సిస్టమ్‌పై కోహ్లీ వ్యాఖ్యానించినట్లు ఒక స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో కలకలం రేపింది. అయితే, ఫ్యాక్ట్ చెక్‌లో ఈ వైరల్ పోస్ట్ పూర్తిగా నకిలీది అని తేలింది.
వైరల్ పోస్ట్‌లో ఏముంది? నిజమేమిటి?
వైరల్ అవుతున్న స్క్రీన్‌షాట్‌లో విద్యార్థులకు న్యాయమైన పరీక్షా విధానం, పారదర్శక వ్యవస్థ అవసరమని, వారి వినతులపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విరాట్ కోహ్లీ కోరినట్లు రాసి ఉంది. ఈ పోస్ట్‌లో విరాట్ కోహ్లీ పేరు, ఆయన ప్రొఫైల్ ఫోటో, బ్లూ టిక్ స్పష్టంగా కనిపించడంతో చాలామంది నెటిజన్లు ఇది నిజమేనని భావించి లైక్‌లు, షేర్లతో వైరల్ చేశారు. విషయం వెలుగులోకి రాగానే దీనిపై నిజానిజాలు సేకరించగా, అసలు విషయం బయటపడింది. వైరల్ స్క్రీన్‌షాట్‌లో కనిపించే ఖాతా యూజర్‌నేమ్ @Highonchurma అని ఉంది. కానీ, విరాట్ కోహ్లీకి చెందిన అధికారిక , వెరిఫైడ్ ఎక్స్ హ్యాండిల్ @imVkohli. ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఉన్న ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌ను దుర్వినియోగం చేస్తూ ఒక యూజర్ తాత్కాలికంగా తన డిస్‌ప్లే నేమ్, ప్రొఫైల్ పిక్‌ను విరాట్ కోహ్లీలా మార్చి ఈ పోస్ట్ చేశాడు. బ్లూ టిక్ ఉండటంతో సామాన్య నెటిజన్లు దీనిని కోహ్లీ ఒరిజినల్ అకౌంట్ అనుకుని మోసపోయారు.
యూజర్‌నేమ్ పరిశీలన ఎందుకు ముఖ్యం?
సోషల్ మీడియా యుగంలో కేవలం పేరు, ప్రొఫైల్ ఫోటో లేదా బ్లూ టిక్ చూసి ఏ విషయాన్నీ నిజమని నమ్మకూడదు. ఏదైనా ప్రముఖ వ్యక్తికి చెందిన పోస్ట్ వైరల్ అయినప్పుడు, ఆ ప్రొఫైల్ కింద ఉండే హ్యాండిల్ / యూజర్‌నేమ్ (@username)ను పరిశీలించడం చాలా ముఖ్యం. విరాట్ కోహ్లీ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో విద్యార్థుల పరీక్షలు లేదా ఎగ్జామ్ సిస్టమ్‌కు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదని నిర్ధారణ అయింది.ఫేక్ వార్తలు, ఎడిట్ చేసిన స్క్రీన్‌షాట్‌లు నెట్‌లో క్షణాల్లో వ్యాపిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సున్నితమైన అంశాలను ఇతరులతో షేర్ చేయడానికి ముందు సంబంధిత వ్యక్తుల అధికారిక ఖాతాలు లేదా విశ్వసనీయ మీడియా సంస్థల సమాచారాన్ని సరిచూసుకోవడం శ్రేయస్కరం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..