Fact Check : రాజస్థాన్ రాయల్స్‌పై కేసు పెట్టిన బాలీవుడ్ హీరో ? వైరల్ వార్తలో నిజమెంత?

Fact Check : రాజస్థాన్ రాయల్స్ జట్టు పంజాబ్‌ ను ట్రోల్ చేస్తూ అర్జున్ కపూర్ మీమ్ పోస్ట్ చేయడం, ఆ తర్వాత డిలీట్ చేయడం సంచలనంగా మారింది. అయితే ఆయన కోర్టులో కేసు పెట్టాడు అన్న ప్రచారంలో నిజం లేదు.

Fact Check :  రాజస్థాన్ రాయల్స్‌పై కేసు పెట్టిన బాలీవుడ్ హీరో ? వైరల్ వార్తలో నిజమెంత?
Rajasthan Royals

Updated on: May 26, 2026 | 11:58 AM

Fact Check : ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు సరిగ్గా సమయానికి పుంజుకుని ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించి వార్తల్లో నిలిచింది. అయితే, ప్లేఆఫ్స్ చేరిన ఆనందంలో ఆ జట్టు సోషల్ మీడియా హ్యాండిల్ చేసిన ఒక చిన్న తప్పు ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 30 పరుగుల తేడాతో విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్, ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. ఇదే సమయంలో పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టు టోర్నమెంట్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పంజాబ్ జట్టును ఎగతాళి చేస్తూ రాజస్థాన్ రాయల్స్ ఒక మీమ్ పోస్ట్ చేసింది.

అసలు ఆ వైరల్ మీమ్ ఏంటి?

కొన్ని రోజుల క్రితం ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా ఉన్నప్పుడు.. పంజాబ్ కింగ్స్ జట్టు సోషల్ మీడియాలో “సారీ భాయ్, ఆజ్ నహీ!” (సారీ బ్రదర్, ఈరోజు కుదరదు) అంటూ రాజస్థాన్‌ను ఉద్దేశించి ఒక పోస్ట్ పెట్టింది. దానికి కౌంటర్‌గా.. తాము ప్లేఆఫ్స్ చేరగానే రాజస్థాన్ రాయల్స్ అడ్మిన్ బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ వైరల్ వీడియో క్లిప్‌ను వాడుతూ ఒక మీమ్ తయారు చేశాడు. ఆ వీడియోలో అందరూ లోపలికి వెళ్తుంటే అర్జున్ కపూర్ మాత్రం బయటే ఉండిపోయినట్లు చూపిస్తూ.. పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుందనే అర్థంలో దానికి మాతో పెట్టుకోకండి అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ మీమ్ నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యింది.

పోస్ట్ డిలీట్.. కేసు ఊహాగానాలు షురూ!

ఆ మీమ్ తెగ వైరల్ అయినప్పటికీ, నెటిజన్ల నుండి కొంత నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం అప్రమత్తమైంది. వెంటనే ఆ పోస్ట్‌ను తమ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి తొలగించింది. ఒక సెలబ్రిటీ అనుమతి లేకుండా అతని ఫోటోలు లేదా వీడియోలను వాడటం పర్సనాలిటీ రైట్స్ ఉల్లంఘన కిందికి వస్తుందనే ఉద్దేశంతోనే ఈ పోస్ట్ డిలీట్ చేసినట్లు సమాచారం. ఈ ఏడాది ప్రారంభంలోనే ఢిల్లీ హైకోర్టు అర్జున్ కపూర్ వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ.. అనుమతి లేకుండా అతని పేరు, వాయిస్, లేదా చిత్రాలను వాడకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

కేసు పెట్టాడంటూ వైరల్ పోస్టులు.. అసలు నిజం ఇదీ

రాజస్థాన్ రాయల్స్ ఆ పోస్ట్‌ను డిలీట్ చేయడమే ఆలస్యం.. సోషల్ మీడియాలో కథనాలు అల్లేశారు. అర్జున్ కపూర్ తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు గాను రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీపై భారీ డెఫమేషన్ కేసు ఫైల్ చేశాడంటూ ట్విట్టర్‌లో కొందరు పోస్టులు పెట్టారు. ఆ భయంతోనే రాజస్థాన్ టీమ్ పోస్ట్ డిలీట్ చేసిందని ప్రచారం చేశారు. కానీ, ఫ్యాక్ట్ చెక్ ప్రకారం ఇందులో ఎలాంటి నిజం లేదు. ఇప్పటివరకు అర్జున్ కపూర్ కానీ, అతని లీగల్ టీమ్ కానీ రాజస్థాన్ రాయల్స్‌పై ఎలాంటి కోర్టు కేసు లేదా చట్టపరమైన ఫిర్యాదు దాఖలు చేయలేదు. ఇరు పక్షాల నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి ఈ కేసు ప్రచారం కేవలం పుకారు మాత్రమే.

సోషల్ మీడియాలో ఫ్యాన్ బేస్‌ను పెంచుకోవడానికి ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇలాంటి ఫన్నీ మీమ్స్ వాడటం సహజమే అయినప్పటికీ, సెలబ్రిటీల పర్సనాలిటీ రైట్స్‌ను గౌరవించడం చాలా ముఖ్యం. రాజస్థాన్ రాయల్స్ చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్తగానే ఆ పోస్ట్‌ను తొలగించింది తప్ప, అర్జున్ కపూర్ కేసు పెట్టడం వల్ల కాదు. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి ఫేక్ న్యూస్‌లను నమ్మే ముందు నిజానిజాలు తెలుసుకోవడం అవసరం.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us