ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్ రేసులో 9 మంది.. ఆ జాబితాలో మనోడి పేరు గల్లంతు.. ఎందుకంటే..?

England Test Coach: భారత క్రికెట్ జట్టు మాజీ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్ కాబోతున్నాడంటూ గత కొద్ది రోజులుగా క్రీడా లోకంలో వార్తలు హోరెత్తాయి. అయితే, తాజాగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పరిశీలిస్తున్న 9 మంది ప్రధాన కోచ్‌ల జాబితాలో ద్రవిడ్ పేరు లేకపోవడం అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. అసలు ఈ ప్రతిష్టాత్మక రేసులో ఎవరెవరు ఉన్నారంటే..

ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్ రేసులో 9 మంది.. ఆ జాబితాలో మనోడి పేరు గల్లంతు.. ఎందుకంటే..?
England Test Coach

Updated on: Jul 15, 2026 | 1:04 PM

England Test Coach: ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్, ఆ తర్వాత న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాభవాల తర్వాత ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన స్వయంగా టెస్ట్ కోచ్ పదవికి రాజీనామా చేసి, కేవలం పరిమిత ఓవర్ల (వైట్ బాల్) క్రికెట్‌పైనే పూర్తి దృష్టి సారించాలని నిర్ణయించుకున్నాడు. మెకల్లమ్ ఆకస్మిక నిష్క్రమణతో టెస్ట్ ఫార్మాట్‌కు కొత్త కోచ్‌ను వెతికే పనిలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పడింది. ఈ క్రమంలోనే ఏకంగా 9 మంది ఉద్దండుల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, అందులో ఒక్క భారతీయుడి పేరు కూడా లేకపోవడం గమనార్హం.

పుకార్లకే పరిమితమైన భారత దిగ్గజాల పేర్లు..

గత కొన్ని రోజులుగా ఇంగ్లాండ్ నూతన టెస్ట్ హెడ్ కోచ్ రేసులో టీమిండియా మాజీ కోచ్‌లు రాహుల్ ద్రవిడ్, రవిశాస్త్రితో పాటు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ, ప్రఖ్యాత ‘ద డైలీ మెయిల్’ నివేదిక ప్రకారం ఇదంతా కేవలం వట్టి పుకార్లేనని తేలిపోయింది. షార్ట్‌లిస్ట్ చేసిన 9 మంది జాబితాలో ద్రవిడ్ పేరు ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. ఇక రవిశాస్త్రి, అశ్విన్ విషయాలైతే పూర్తిగా అవాస్తవాలని స్పష్టమైంది.

ఇది కూడా చదవండి: ఆ ముగ్గురు దద్దమ్మలు ఇక ఇంటికే.. వచ్చేస్తున్నాడ్రోయ్ అసలైన పులి.. కోహ్లీ దోస్త్ గ్రాండ్ ఎంట్రీ?

ఇవి కూడా చదవండి

ఆ ఇద్దరు ఇంగ్లాండ్ మాజీలు మాత్రమే..!

సాధారణంగా ఇంగ్లాండ్ కోచ్ పదవికి ఆ దేశానికి చెందిన మాజీలకే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుందనే అంచనాలు ఉంటాయి. పాల్ కాలింగ్‌వుడ్, ఆండ్రూ ఫ్లింటాఫ్ లాంటి దిగ్గజాల పేర్లు వినిపించినప్పటికీ, ఫైనల్ లిస్టులో వారు చోటు దక్కించుకోలేకపోయారు. కేవలం జొనాథన్ ట్రాట్, రిచర్డ్ డాసన్ అనే ఇద్దరు ఇంగ్లీష్ మాజీలు మాత్రమే రేసులో నిలిచారు. జొనాథన్ ట్రాట్ కోచింగ్ విభాగంలో ఇప్పటికే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగా, డాసన్ గతంలో ఇంగ్లాండ్ జట్టుతో కలిసి పనిచేసిన అనుభవం ఉన్నవాడు. వీరితో పాటు పాకిస్తాన్ వైట్ బాల్ మాజీ కోచ్ మైక్ హెస్సన్, ఐర్లాండ్ మాజీ కోచ్ ఆది బిరెల్ కూడా ఈ రేసులో ఉన్నారు.

ఇది కూడా చదవండి: Kohli vs Gambhir: టీమిండియాలో ముదిరిన విభేదాలు.. కోచ్ గంభీర్, కోహ్లీ మధ్య మాటలు బంద్..?

ఐపీఎల్ కోచ్‌లకే పెద్ద పీట..

ఈ జాబితాలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఐపీఎల్ 2026లో వివిధ ఫ్రాంచైజీలకు ప్రధాన కోచ్‌లుగా బాధ్యతలు నిర్వర్తించనున్న వారికే ఇంగ్లాండ్ బోర్డు పెద్ద పీట వేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ ఈ రేసులో అందరికంటే ముందున్నాడు. అలాగే, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆశాజ్యోతి, న్యూజిలాండ్ దిగ్గజం స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా గట్టి పోటీదారుడిగా ఉన్నాడు. వీరితో పాటు లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ జస్టిన్ లాంగర్, రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్ కుమార సంగక్కర, లక్నో గ్లోబల్ డైరెక్టర్ టామ్ మూడీ తదితరులు ఈ ప్రతిష్టాత్మక పదవి కోసం పోటీ పడుతున్నారు.

ఇది కూడా చదవండి: ఇంగ్లాండ్‌లో ఇరగదీసినా.. ఆ టీమిండియా స్టార్ ప్లేయర్‌కు 2027 వరల్డ్ కప్‌లో నో ప్లేస్.. ఎందుకంటే..?

ఏది ఏమైనా, ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్ పదవి ఎవరిని వరిస్తుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఐపీఎల్ వేదికగా అద్భుతాలు సృష్టిస్తున్న ఈ దిగ్గజాల్లో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఎవరి వైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాలి. అయితే, ద్రవిడ్ లాంటి భారత దిగ్గజం ఈ రేసులో లేకపోవడం మన అభిమానులకు కాస్త నిరాశ కలిగించే విషయమే అని చెప్పక తప్పదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us