
India WTC Qualification: పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన ఇంగ్లాండ్ (England) జట్టు.. మూడు టెస్ట్‌ల సిరీస్‌ను 3-0తో గెలుచుకుంది. ఇంగ్లాండ్ ఘన విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (World Test Championship) 2025-27 సైకిల్ పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఈ విజయంతో ఆ జట్టు ప్రస్తుత సైకిల్‌లో 16 మ్యాచ్‌ల్లో 7వ గెలుపు నమోదు చేసుకుంది. ఇంగ్లండ్ ఖాతాలో 74 పాయింట్లు చేరినా, పాయింట్ల శాతం 38.54గా ఉంది. దీంతో పట్టికలో ఆరో స్థానంలోనే కొనసాగుతోంది. భారత్ (India) ఐదో స్థానంలో 68 పాయింట్లు, 51.52 పాయింట్ల శాతంతో ఉంది. ఇంగ్లండ్ గెలుపు భారత ఫైనల్ అవకాశాలపై తక్షణ ప్రభావం చూపే పరిస్థితి లేదు.
ఈ సైకిల్‌లో ఇంగ్లండ్ ఇప్పటికే 8 పరాజయాలు చవిచూసింది. స్లో ఓవర్ రేట్ కారణంగా కీలక పాయింట్లు కోల్పోవడం కూడా ఆ జట్టు అవకాశాలను దెబ్బతీసింది. మిగిలిన 5 టెస్టులు విదేశీ గడ్డపై జరగనున్నాయి. దక్షిణాఫ్రికా (South Africa)తో 3, బంగ్లాదేశ్ (Bangladesh)తో 2 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ ఐదు టెస్టుల్లోనూ గెలిచి, ఓవర్‌రేట్ కారణంగా ఎలాంటి కోత లేకపోయినా ఇంగ్లండ్ గరిష్ఠంగా 134 పాయింట్లకు చేరుతుంది. అప్పుడు పాయింట్ల శాతం 53.17గా ఉంటుంది. ఫైనల్ రేసులో నిలవాలంటే ఇవి ఏమాత్రం సరిపోవు.
ఎక్కువమంది చదివినది: ఆసియా విజేతగా నిలిచినా.. ట్రోఫీతోపాటు ఒక్కపైసా దక్కదు.. ఎందుకో తెలుసా?
పాకిస్థాన్ (Pakistan) ఓటమి కూడా భారత్ లెక్కలపై పెద్దగా మార్పు తీసుకురాలేదు. పాక్ జట్టు పట్టికలో చివరి స్థానంలోనే ఉంది. 16 పాయింట్లతో పాయింట్ల శాతం 14.81గా ఉంది. ఇంగ్లండ్ ఇంకా భారత్ వెనుక చాలా దూరంలో ఉండటంతో, ఎడ్జ్‌బాస్టన్ ఫలితం భారత జట్టుకు నేరుగా నష్టం కలిగించలేదు.
అసలు ప్రభావం ఇంగ్లండ్ మిగిలిన టెస్టుల ఫలితాల ద్వారా రావొచ్చు. దక్షిణాఫ్రికాతో జరిగే 3 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిస్తే, ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న ఆ జట్టు ఫైనల్ అవకాశాలకు గట్టి దెబ్బ తగులుతుంది. బంగ్లాదేశ్ ఫలితాలు కూడా పట్టికపై ప్రభావం చూపవచ్చు. ఈ జట్లు భారత్ కంటే ముందున్నందున, వాటి పాయింట్లు తగ్గడం భారత అవకాశాలకు పరోక్షంగా ఉపయోగపడుతుంది.
భారత్ మిగిలిన ఏడు టెస్టుల్లో జారిపోకుండా ఆడితే, దాని పాయింట్ల శాతం 70.37 వరకు పెరిగే అవకాశం ఉంది. అందుకే పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ విజయం కంటే, ఆ జట్టు తరువాత ఆడే ఐదు టెస్టుల ఫలితాలే భారత ఫైనల్ సమీకరణాల్లో ఎక్కువ ప్రాధాన్యం కలిగిన అంశంగా మారనున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..