
Don Bradman Fastest Century: క్రికెట్ చరిత్రలో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఉన్నాయి. కానీ, బ్యాటింగ్ నిర్వచనాన్ని మార్చిన ఘనత మాత్రం ఒకే ఒక్కరికి దక్కుతుంది. నవంబర్ 2, 1931న జరిగిన ఒక క్లబ్ మ్యాచ్‌లో సర్ డాన్ బ్రాడ్‌మాన్ అసాధారణ రీతిలో బ్యాట్ ఝులిపించాడు. ఆ కాలంలో ఒక ఓవర్‌లో 8 బంతులు ఉండేవి. ఆ లెక్కన చూస్తే, కేవలం 3 ఓవర్ల వ్యవధిలోనే ఆయన తన సెంచరీని పూర్తి చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.
ఈ చారిత్రక మ్యాచ్‌లో బ్రాడ్‌మాన్ ఎదుర్కొన్న బంతులు కేవలం 22 మాత్రమే. ఆ మూడు ఓవర్ల విధ్వంసం ఇలా సాగింది:
మొదటి ఓవర్: 33 పరుగులు
రెండవ ఓవర్: 40 పరుగులు
మూడవ ఓవర్: 29 పరుగులు
బౌలర్ ఎవరన్నది చూడకుండా, వచ్చిన ప్రతి బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా ఆయన సాగించిన ఈ ప్రస్థానం క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయి. కేవలం వేగంగా ఆడటమే కాకుండా, ప్రతి బంతిపై ఆయనకు ఉన్న పట్టు చూసి అప్పట్లో క్రీడా పండితులు సైతం నోరెళ్లబెట్టారు.
సెంచరీతో ఆగకుండా, బ్రాడ్‌మాన్ ఆ మ్యాచ్‌లో మొత్తం 256 పరుగుల భారీ స్కోరు సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 29 ఫోర్లు, 14 సిక్సర్లు ఉన్నాయి. నేటి టీ20 యుగంలో కూడా ఇంతటి దూకుడు ప్రదర్శించడం కష్టమే, అలాంటిది ఆ రోజుల్లోనే మైదానం నలుమూలలా షాట్లు ఆడుతూ బౌలర్లను బెంబేలెత్తించాడు. రన్ మెషీన్‌గా పేరుగాంచిన ఆయన, ఆట పట్ల తనకున్న ఆకలిని ఈ ఇన్నింగ్స్ ద్వారా మరోసారి నిరూపించుకున్నాడు.
లిత్గో జట్టు బౌలర్లు విల్ బ్లాక్, హౌరీ బేకర్‌లకు ఆ రోజు ఒక పీడకలలా మిగిలిపోయింది. బ్రాడ్‌మాన్ ధాటికి వారు బంతులు వేయడానికే భయపడే పరిస్థితి నెలకొంది. మొదటి, మూడవ ఓవర్లలో విల్ బ్లాక్‌ను టార్గెట్ చేసిన డాన్, రెండవ ఓవర్‌లో బేకర్‌ను చీల్చి చెండాడారు. ఈ విధ్వంసం కేవలం ఒక రికార్డు మాత్రమే కాదు, క్రికెట్ ప్రపంచంలో ఒక ఆటగాడు ఎంతటి ఆధిపత్యాన్ని చెలాయించగలడో చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..