PSLలో వెలిసిన ఐపీఎల్ ఫ్యూచర్ స్టార్.. విధ్వంసానికే బ్రాండ్ అంబాసిడర్ భయ్యా..!

Dian Forrester: క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్ సరికొత్త ప్రతిభకు వేదికగా నిలుస్తోంది. తాజాగా పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) వేదికగా ఓ యువ సంచలనం వెలుగులోకి వచ్చాడు. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ ఆల్ రౌండర్ తన తుఫాన్ బ్యాటింగ్ తో పాక్ గడ్డపై పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. ఈ ప్లేయర్ ఆటతీరు చూస్తుంటే త్వరలోనే ఐపీఎల్ లో భారీ ధర పలకడం ఖాయంగా కనిపిస్తోంది.

PSLలో వెలిసిన ఐపీఎల్ ఫ్యూచర్ స్టార్.. విధ్వంసానికే బ్రాండ్ అంబాసిడర్ భయ్యా..!
Dian Forrester

Updated on: Apr 07, 2026 | 8:27 PM

Dian Forrester: ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 సీజన్ లో డయాన్ ఫారెస్టర్ అనే 25 ఏళ్ల ఎడమచేతి వాటం ఆల్ రౌండర్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. రావల్పిండి జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్లేయర్.. మైదానంలో దిగితే చాలు బౌండరీల మోత మోగిస్తున్నాడు. ముఖ్యంగా ఏడో వరుసలో బ్యాటింగ్ కు వచ్చి విధ్వంసం సృష్టించడం ఇతడి ప్రత్యేకత. మహ్మద్ రిజ్వాన్ సారథ్యంలోని జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న ఫారెస్టర్, కేవలం రెండు మ్యాచ్‌లలోనే 7 భారీ సిక్సర్లతో 68 పరుగులు సాధించి తన సత్తా చాటాడు. డెత్ ఓవర్లలో బౌలర్లపై విరుచుకుపడుతున్న తీరు చూసి పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు సైతం అవాక్కవుతున్నారు.

అంతర్జాతీయ అరంగేట్రం, గణాంకాలు..

దక్షిణాఫ్రికాకు చెందిన ఈ యువ ఆటగాడు ఈ ఏడాది న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ఆ సిరీస్ లో 5 మ్యాచ్‌లలో 83 పరుగులు మాత్రమే చేసినప్పటికీ, లీగ్ క్రికెట్ లో మాత్రం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటివరకు తన టీ20 కెరీర్ లో 29 మ్యాచ్‌లు ఆడిన ఫారెస్టర్, 141.18 స్ట్రైక్ రేట్ తో 617 పరుగులు చేశాడు. ఇందులో 31 సిక్సర్లు ఉండటం గమనార్హం. కేవలం బ్యాటింగ్ లోనే కాకుండా బౌలింగ్ లోనూ జట్టుకు ఆసరాగా నిలవగల సామర్థ్యం ఇతడికి ఉంది.

ఐపీఎల్ ఫ్రాంచైజీల కన్ను..

ఐపీఎల్ లో ఫినిషర్ల పాత్ర పోషించే ఆల్ రౌండర్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా ఎడమచేతి వాటం బ్యాటర్లు భారీ సిక్సర్లు బాదగలిగితే వారికి కాసుల వర్షం కురుస్తుంది. డయాన్ ఫారెస్టర్ ప్రస్తుత ప్రదర్శన చూస్తుంటే, రాబోయే ఐపీఎల్ వేలంలో ఇతడి పేరు ప్రముఖంగా వినిపించే అవకాశం ఉంది. విధ్వంసకర బ్యాటింగ్ తో పాటు కీలక సమయాల్లో వికెట్లు తీయగల ఈ దక్షిణాఫ్రికా స్టార్, ఐపీఎల్ తదుపరి సూపర్ స్టార్ గా ఎదిగే అన్ని లక్షణాలను కలిగి ఉన్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us