Dhoni Coments : ఎంఎస్ ధోని మైదానంలోనే కెప్టెన్ కాదు బయట కూడా నిజమైన కెప్టెన్ అని నిరూపించుకున్నాడు. కరోనా కారణంగా ఐపిఎల్ 2021 ని బిసిసిఐ వాయిదా వేసింది. ఆ తర్వాత ఆటగాళ్లు స్వదేశానికి రావడం కొనసాగుతోంది. అటువంటి పరిస్థితిలో ఎంఎస్ ధోని తన జట్టు సభ్యులందరికీ వాగ్దానం చేసాడు. జట్టులోని ప్రతి సభ్యుడు ఇంటికి చేరుకున్నాకే తాను రాంచీలోని తన ఇంటికి వెళుతానని చెప్పాడు.
విదేశీ ఆటగాళ్లను సురక్షితంగా ఇంటికి పంపించడం తన మొదటి ప్రాధాన్యత అని ధోని అన్నాడు. సీఎస్‌కే బృందం ప్రస్తుతం ఢిల్లీలో ఉంది. ఆటగాళ్లందరితో ధోని వర్చువల్ మీటింగ్‌లో భాగంగా మాట్లాడాడు. జట్టు సభ్యులందరు ఇంటికి వెళ్లాక తాను చివరిగా వెళుతానని మీటింగ్‌లో చెప్పాడు. సీఎస్‌కే సభ్యుడు ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. టీం బస చేసిన హోటల్‌ను విడిచిపెట్టిన చివరి సభ్యుడిగా తాను ఉంటానని మహీ భాయ్ చెప్పాడన్నాడు. విదేశీ ఆటగాళ్ళు మొదట తమ ఇళ్లకు వెళ్లాలని కోరుకుంటారు. ఆ తర్వాత తాము వెళుతామని పేర్కొన్నాడు.
సీఎస్‌కే తమ ఆటగాళ్లను, సిబ్బందిని ఇంటికి పంపించడానికి ఢిల్లీ నుంచి చార్టర్ ఫ్లైట్ ఏర్పాటు చేసింది.10 సీట్ల చార్టర్ విమానం ఉదయం సిఎస్‌కె ఆటగాళ్లను రాజ్‌కోట్, ముంబైకి తీసుకెళుతుంది. సాయంత్రం బెంగళూరు, చెన్నైకి వెళుతుంది. ధోని గురువారం సాయంత్రం రాంచీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సిఎస్‌కె మాదిరిగానే ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ కూడా తమ ఆటగాళ్లను ఇంటికి పంపించడానికి చార్టర్ విమానం ఏర్పాటు చేశాయి.