
Dewald Brevis Run Out: చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ 2026 పోరులో యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ తన అసాధారణ ఫీల్డింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. సుమారు 30 మీటర్ల దూరం నుంచి నేరుగా వికెట్లను తాకిన అతని త్రో, లక్నో కీలక బ్యాటర్ ఐడెన్ మార్‌క్రామ్‌ను పెవిలియన్ చేర్చింది. ఈ అద్భుత విన్యాసం చూసిన అభిమానులు బ్రెవిస్‌ను రవీంద్ర జడేజాతో పోలుస్తున్నారు.
లక్నో ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఓ అద్భుత సంఘటన చోటుచేసుకుంది. అక్షత్ రఘువంశీ లాంగ్ ఆన్ వైపు బంతిని పంపి రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న డెవాల్డ్ బ్రెవిస్ మెరుపు వేగంతో బంతిని అందుకుని, క్షణాల్లో డైరెక్ట్ త్రో విసిరాడు. ఆ త్రో నేరుగా వికెట్లను తాకడంతో మార్‌క్రామ్ క్రీజులోకి రాకముందే అవుట్ అయ్యాడు. ఈ వికెట్ మ్యాచ్‌లోనే అత్యంత కీలక మలుపుగా మారింది. ఈ సీజన్‌లో ఇంత దూరం నుంచి డైరెక్ట్ రనౌట్ చేయడం ఇదే మొదటిసారి.
Bullet throw…and the 𝗦𝗧𝗨𝗠𝗣𝗦 𝗟𝗜𝗚𝗛𝗧 𝗨𝗣! 🎯 \|/
🎥 A brilliant bit of fielding from Dewald Brevis stuns Aiden Markram 😮🫡
Updates ▶️ https://t.co/MoXhlWHk4O#TATAIPL | #KhelBindaas | #CSKvLSG | @ChennaiIPL pic.twitter.com/20xOXzS07j
— IndianPremierLeague (@IPL) May 10, 2026
ఒకప్పుడు చెన్నై జట్టులో రవీంద్ర జడేజా ఫీల్డింగ్‌కు పర్యాయపదంగా ఉండేవాడు. ఈ సీజన్ కంటే ముందే ఆయన రాజస్థాన్ రాయల్స్‌కు మారడంతో సీఎస్కే ఆ లోటును ఎదుర్కొంటోంది. అయితే బ్రెవిస్ తన అద్భుతమైన ఫీల్డింగ్ ప్రమాణాలతో జడేజాను గుర్తు చేస్తున్నాడు. ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా బ్రెవిస్ అగ్రస్థానంలో ఉన్నాడు. చిరుతలా దూకుతూ బంతిని ఆపడంలో, ఖచ్చితమైన త్రోలు వేయడంలో అతను జడేజా శైలిని అనుకరిస్తున్నాడని అభిమానులు సామాజిక మాధ్యమాల్లో కొనియాడుతున్నారు.
సీజన్ ఆరంభంలో గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైన బ్రెవిస్, నాలుగో మ్యాచ్ నుంచి జట్టులోకి వచ్చాడు. గాయం తిరగబెట్టే ప్రమాదం ఉన్నప్పటికీ, మైదానంలో అతను చూపిస్తున్న నిబద్ధత ప్రశంసనీయం. బ్యాటింగ్‌లో ఇప్పటివరకు నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 64 పరుగులు మాత్రమే చేసినప్పటికీ, ఫీల్డింగ్‌లో మాత్రం జట్టుకు ఎంతో విలువైన సహకారం అందిస్తున్నాడు.
మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 204 పరుగుల భారీ స్కోరు సాధించింది. బ్రెవిస్ చేసిన రనౌట్ కారణంగా మధ్య ఓవర్లలో లక్నో వేగానికి అడ్డుకట్ట పడినప్పటికీ, ఆ జట్టు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇప్పుడు చెన్నై విజయం సాధించాలంటే బ్రెవిస్ బ్యాట్‌తో కూడా మెరవాల్సి ఉంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే చెన్నైకి ఈ విజయం ఎంతో అవసరం. రాయల్ ఛాలెంజర్స్ తరహాలో దూకుడుగా ఆడితేనే సీఎస్కే ఈ లక్ష్యాన్ని చేరుకోగలదు. పసుపు రంగు జెర్సీలో బ్రెవిస్ తన బ్యాటింగ్ ఫామ్‌ను ఈ మ్యాచ్‌లోనే తిరిగి పొందుతాడని అభిమానులు ఆశిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..