2027 వరల్డ్ కప్ గెలిచి రిటైర్ అవుతా..! స్టార్ క్రికెటర్ సంచలన ప్రకటన

దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ 2027 వన్డే ప్రపంచకప్‌ను సొంతగడ్డపై గెలిచి కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలని కోరుకుంటున్నాడు. జట్టులో చోటు ఖాయమని చెప్పలేమని, అప్పటివరకు అత్యుత్తమ ప్రదర్శన చేయడమే తన లక్ష్యమని తెలిపాడు. ఒత్తిడిలో సాధించిన రెండు సెంచరీలు తన కెరీర్‌లో ప్రత్యేకమని మిల్లర్ పేర్కొన్నాడు.

2027 వరల్డ్ కప్ గెలిచి రిటైర్ అవుతా..! స్టార్ క్రికెటర్ సంచలన ప్రకటన
2027 Wolrd Cup

Updated on: Aug 28, 2026 | 1:54 PM

దక్షిణాఫ్రికా స్టార్ మిడిల్‌ఆర్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ తన కెరీర్‌కు ప్రపంచకప్ విజయంతో ముగింపు పలకాలని బలమైన కోరికను వ్యక్తం చేశాడు. 2027లో స్వదేశంలో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తరఫున ఆడి, జట్టుకు ట్రోఫీ అందించడమే తన ప్రధాన లక్ష్యమని మిల్లర్ వెల్లడించాడు. 2027 అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా ప్రపంచకప్ జరగనుంది. దక్షిణాఫ్రికా ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్‌ను గెలవలేదు. 2023 ప్రపంచకప్‌లో సెమీఫైనల్ వరకు వెళ్లిన ప్రొటీస్ జట్టు.. కోల్‌కతాలో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది.

ఈ నేపథ్యంలో 2027 ప్రపంచకప్ తనకు ఎంతో ప్రత్యేకమని మిల్లర్ చెప్పాడు. కెరీర్ చివరి దశలో ఒక ప్రపంచకప్ ట్రోఫీని అందుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. అయితే జట్టులో తన స్థానం ఇప్పుడే ఖాయమని చెప్పలేమని, అప్పటివరకు అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ జట్టులో చోటు సంపాదించడమే తన లక్ష్యమని స్పష్టం చేశాడు. మిడిల్‌ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తూ క్లిష్ట పరిస్థితుల్లో మ్యాచ్‌లను ముగించడం తన కెరీర్‌లో అత్యంత గర్వకారణమైన అంశమని మిల్లర్ పేర్కొన్నాడు. ముఖ్యంగా లక్ష్య ఛేదనల్లో ఒత్తిడిని ఎదుర్కొంటూ మ్యాచ్‌ను ఫినిష్ చేయడం తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు. ఈ నైపుణ్యాన్ని సాధించడానికి ఎన్నో సంవత్సరాల అనుభవం అవసరమైందని వెల్లడించాడు.

ఇటీవల ది హండ్రెడ్ 2026లో సదరన్ బ్రేవ్ తరఫున మిల్లర్ ఎనిమిది మ్యాచ్‌ల్లో 166 పరుగులు చేశాడు. తన ఫామ్‌ను కొనసాగిస్తూ 2027 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలని చూస్తున్నాడు. తన కెరీర్‌లో అత్యంత ఇష్టమైన ఐపీఎల్ జ్ఞాపకంగా 2022లో గుజరాత్ టైటాన్స్‌తో కలిసి సాధించిన టైటిల్ విజయాన్ని మిల్లర్ గుర్తుచేసుకున్నాడు. అలాగే ఒత్తిడిలో సాధించిన రెండు సెంచరీలను తన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లుగా పేర్కొన్నాడు. ఆర్‌సీబీపై 101 పరుగులు, ఆస్ట్రేలియాపై డర్బన్‌లో సాధించిన 118 నాటౌట్ తనకు ఎప్పటికీ ప్రత్యేకమని చెప్పాడు. ఇప్పుడు ఆ అనుభవాన్నంతా ఉపయోగించి సొంతగడ్డపై దక్షిణాఫ్రికాకు తొలి వన్డే ప్రపంచకప్ అందించాలనే కలతో మిల్లర్ ముందుకు సాగుతున్నాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us