ప్రపంచకప్‌లో చెత్త ప్రదర్శన.. కట్ చేస్తే.. 15 బంతుల్లో ఊహకందని ఊచకోత.. ఎవరీ ప్లేయర్.?

|

Jul 02, 2024 | 11:49 AM

టీ20 ప్రపంచకప్ 2024లో వనిదు హసరంగా సారధ్యంలోని శ్రీలంక జట్టు పేలవ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. గ్రూప్ స్టేజిలో లంకేయులు ఆడిన 4 మ్యాచ్‌ల్లో రెండింట ఓడిపోయి.. కేవలం ఒక్క మ్యాచ్‌లోనే గెలిచి టోర్నీ నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించారు. టీ20 ఫార్మాట్..

ప్రపంచకప్‌లో చెత్త ప్రదర్శన.. కట్ చేస్తే.. 15 బంతుల్లో ఊహకందని ఊచకోత.. ఎవరీ ప్లేయర్.?
Dasun Shanaka
Follow us on

టీ20 ప్రపంచకప్ 2024లో వనిదు హసరంగా సారధ్యంలోని శ్రీలంక జట్టు పేలవ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. గ్రూప్ స్టేజిలో లంకేయులు ఆడిన 4 మ్యాచ్‌ల్లో రెండింట ఓడిపోయి.. కేవలం ఒక్క మ్యాచ్‌లోనే గెలిచి టోర్నీ నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించారు. టీ20 ఫార్మాట్ అనుభవమున్న ఎంతోమంది కీలక ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. ప్రపంచకప్ టోర్నీలో గ్రూప్ స్టేజి నుంచి సూపర్-8కి చేరుకోలేకపోయింది శ్రీలంక. ఇక ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ జట్టు హెడ్ కోచ్‌గా క్రిస్ సిల్వర్‌వుడ్, కన్సల్టెంట్ కోచ్‌గా జయవర్దనే తక్షణమే వైదొలిగారు. ఇదిలా ఉంటే.. ఈ జట్టుకు చెందిన ఓ ఆటగాడు టీ20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన చేసినప్పటికీ.. స్వదేశంలో జరుగుతోన్న టీ20 లీగ్‌లో మాత్రం దుమ్ములేపాడు. బ్యాట్‌తో కీలకమైన 46 పరుగులతో పాటు.. బంతితో 3 వికెట్లు పడగొట్టాడు. మరి అతడెవరో కాదు దసున్ షనాక.

సోమవారం పల్లెకేలే వేదికగా లంక ప్రీమియర్ లీగ్ షురూ అయింది. మొదటి మ్యాచ్‌లో కండి ఫాల్కన్స్, దంబుల్లా సిక్సర్లు తలబడ్డాయి. ఇందులో కండీ జట్టు టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో దంబుల్లా సిక్సర్లు నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. చాప్‌మాన్(91), విక్‌రామసింగ్(62) అదిరిపోయే అర్ధ సెంచరీలతో రాణించారు.

ఇక 180 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కండి ఫాల్కన్స్‌కు.. ఆ జట్టు వికెట్ కీపర్ దినేష్ చండీమల్(65) అర్ధ శతకంతో ఆదుకున్నాడు.  చివర్లో దసున్ షనాక(46), ఏంజెలో మాథ్యూస్(37) కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో.. ఫాల్కన్స్ జట్టు 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. 6వ స్థానంలో బరిలోకి దిగిన షనాక కేవలం 15 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు. మొదటి బంతి నుంచి దూకుడైన ఆటతీరు కనబరిస్తూ క్షణాల్లో మ్యాచ్‌ను తమ జట్టు వైపుకి తిప్పేశాడు. అటు బంతితోనూ మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా, షనాక టీ20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన విషయం విదితమే. అటు బంతి, ఇటు బ్యాట్‌తో అట్టర్ ప్లాప్ అయ్యాడు. ఆడిన 3 మ్యాచ్‌ల్లో 12 పరుగులు, కేవలం 1 వికెట్ మాత్రమే తీసి.. తన జట్టు నిష్క్రమణలో భాగమయ్యాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..