IPL 2027: ఘోర పరాజయంతో చెన్నై షాకింగ్ డిసిషన్.. ధోనీతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లకు గుడ్ బై..?

ఐపీఎల్ 2026 సీజన్ లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ప్రయాణం అత్యంత నిరాశాజనకంగా ముగిసింది. వరుసగా మూడో ఏడాది కూడా ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమై అభిమానుల గుండెల్ని పగల్గొట్టింది. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఎదురైన ఘోర పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించిన సీఎస్కే, రాబోయే సీజన్ కోసం జట్టును ప్రక్షాళన చేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో ముగ్గురు కీలక ఆటగాళ్లను వదులుకోనుంది.

IPL 2027: ఘోర పరాజయంతో చెన్నై షాకింగ్ డిసిషన్.. ధోనీతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లకు గుడ్ బై..?
Ipl 2026 Csk

Updated on: May 22, 2026 | 3:24 PM

IPL 2027: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు ఈ సీజన్ ఒక పీడకలలా మిగిలిపోయింది. మే 21న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక పోరులో 89 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడంతో చెన్నై లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. ఈ సీజన్‌లో ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 6 విజయాలు మాత్రమే సాధించి, 8 ఓటములతో 12 పాయింట్ల వద్దే నిలిచిపోయింది. 2024, 2025 సీజన్ల తరహాలోనే 2026లోనూ ప్లేఆఫ్స్ చేరలేకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

గాయాల సమస్యలు జట్టు సమతూకాన్ని పూర్తిగా దెబ్బతీశాయి. ఎంఎస్ ధోనీ, నాథన్ ఎల్లిస్, జేమీ ఓవర్టన్, ఖలీల్ అహ్మద్ వంటి కీలక ఆటగాళ్లు ఫిట్‌నెస్ సమస్యలతో మైదానానికి దూరం కావడం జట్టుకు కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఈ ఘోర పరాజయం తర్వాత, ఫ్రాంచైజీ యాజమాన్యం కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. రాబోయే వేలంలో పర్స్ మనీని పెంచుకోవడానికి, కొత్త రక్తాన్ని జట్టులోకి ఆహ్వానించడానికి ముగ్గురు ఆటగాళ్లను విడుదల చేసే యోచనలో ఉంది. ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

1. అన్షుల్ కాంబోజ్: భారీగా పరుగులు సమర్పించుకున్న పేసర్..

గత వేలంలో సీఎస్కే 3.40 కోట్ల రూపాయల భారీ ధరతో అన్షుల్ కాంబోజ్‌ను సొంతం చేసుకుంది. ఈ సీజన్ లో అతను వికెట్లు తీసినప్పటికీ, పరుగులను నియంత్రించడంలో ఘోరంగా విఫలమయ్యాడు. 14 మ్యాచ్‌లలో 21 వికెట్లు పడగొట్టి ఒక దశలో పర్పుల్ క్యాప్ రేసులో నిలిచినప్పటికీ, మ్యాచ్‌లు గడుస్తున్న కొద్దీ అతని బౌలింగ్‌లో నిలకడ లోపించింది.

ఇది కూడా చదవండి: IPL 2026: తొలి క్వాలిఫైయర్‌లో SRH ఎంట్రీ అవ్వాలంటే.. RCBపై ఎంత తేడాతో గెలవాలంటే?

అన్షుల్ కాంబోజ్ ఈ సీజన్ లో కొన్ని అవాంఛనీయ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే సీజన్‌లో అత్యధికంగా 34 సిక్సర్లు సమర్పించుకున్న బౌలర్‌గా నిలిచాడు. లక్నోతో జరిగిన ఒకే మ్యాచ్‌లో ఏకంగా 8 సిక్సర్లు ఇచ్చి అభిమానులకు షాక్ ఇచ్చాడు. 10.52 భారీ ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చుకున్న కాంబోజ్ కంటే, నమ్మకమైన భారతీయ పేసర్‌ను వెతుక్కునే క్రమంలో సీఎస్కే ఇతడిని వదిలించుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

2. ప్రశాంత్ వీర్: 14.20 కోట్ల భారీ ధరకు తగ్గ న్యాయం చేయలేక..

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ఆటగాళ్లలో ఒకడిగా ప్రశాంత్ వీర్ రికార్డు సృష్టించాడు. రవీంద్ర జడేజాకు దీర్ఘకాలిక ప్రత్యామ్నాయంగా భావించి సీఎస్కే ఇతని కోసం వేలంలో 14.20 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని కుమ్మరించింది. కానీ, మైదానంలో ఆ నమ్మకాన్ని ప్రశాంత్ వీర్ నిలబెట్టుకోలేకపోయాడు.

ఈ సీజన్ లో కేవలం 6 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ప్రశాంత్, 45 సగటుతో 90 పరుగులు చేశాడు. అయితే, ఆల్రౌండర్‌గా జట్టులోకి వచ్చిన అతను బౌలింగ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. టోర్నీ మొత్తంలో కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి, వికెట్ ఏమీ తీయకుండా 25 పరుగులు సమర్పించుకున్నాడు. ఎక్కువ కాలం బెంచ్‌కే పరిమితమైన ప్రశాంత్‌ను విడుదల చేస్తే జట్టు పర్స్ మనీ భారీగా పెరుగుతుంది కాబట్టి, యాజమాన్యం ఇతడిని వదిలేయడానికే మొగ్గు చూపుతోంది.

3. మహేంద్ర సింగ్ ధోనీ: లెజెండ్ ప్రయాణానికి ముగింపు పడినట్లేనా?

చెన్నై సూపర్ కింగ్స్ చరిత్రలో అత్యంత కఠినమైన, భావోద్వేగ భరితమైన నిర్ణయం ఎంఎస్ ధోనీ గురించే కానుంది. ఈ సీజన్ లో ధోనీని అన్‌క్యాప్డ్ ప్లేయర్ కోటాలో జట్టు నిలబెట్టుకున్నప్పటికీ, కాలిపిక్క, బొటనవేలి గాయాల కారణంగా అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు.

ఇది కూడా చదవండి: ‘ఎవరున్నా లేకపోయినా.. 2027 ప్రపంచకప్‌లో ఈ ఇద్దరు ఉంటే చాలు.. ట్రోఫీ టీమిండియాదే..’

44 ఏళ్ల వయసులో ఫిట్‌నెస్ సమస్యలు పెరగడం, మరోవైపు జట్టు పునర్నిర్మాణ దశలోకి అడుగుపెడుతుండటంతో సీఎస్కే ఇకపై ధోనీ లేని భవిష్యత్తు వైపు అడుగులు వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ధోనీ ఈ సీజన్ లో మైదానంలోకి రాలేదనే వార్తలు కూడా వచ్చాయి. చెన్నై గుండె చప్పుడు అయిన ధోనీని వచ్చే సీజన్ లో ఆటగాడిగా కాకుండా మెంటార్ రూపంలో చూసే అవకాశం ఉంది.

ఐపీఎల్ 2026 పరాజయం చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి కనువిప్పు కలిగించింది. పాత వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలంటే పాత ఆటగాళ్లను వదిలించుకుని, కొత్త వ్యూహాలతో బరిలోకి దిగడం సీఎస్కేకు అత్యంత ముఖ్యం. ధోనీ యుగం ముగింపుతో పాటు ప్రశాంత్ వీర్, అన్షుల్ కాంబోజ్ ల విడుదల చెన్నై భవిష్యత్తును ఎలా మారుస్తుందో వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us