ధోని సహచరుడి సూపర్ సెంచరీ.. 200 స్ట్రైక్ రేట్‌తో 13 ఫోర్లు, 5 సిక్సర్లు.. సునామీ ఇన్నింగ్స్.!

|

Sep 05, 2021 | 9:48 AM

CPL 2021: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ సెకండ్ హాఫ్ ప్రారంభం కానుంది. అయితే ఈలోపే మెరుపులు మెరుస్తున్నాయి. బ్యాట్స్‌మెన్లు తమ ఫామ్‌ను...

ధోని సహచరుడి సూపర్ సెంచరీ.. 200 స్ట్రైక్ రేట్‌తో 13 ఫోర్లు, 5 సిక్సర్లు.. సునామీ ఇన్నింగ్స్.!
Duplessis
Follow us on

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ సెకండ్ హాఫ్ ప్రారంభం కానుంది. అయితే ఈలోపే మెరుపులు మెరుస్తున్నాయి. బ్యాట్స్‌మెన్లు తమ ఫామ్‌ను తిరిగి రాబట్టుకుంటున్నారు. కరేబీయన్ దీవుల్లో చిన్న సైజు విధ్వంసం సృష్టిస్తున్నారు. తాజాగా ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓపెనర్ డుప్లెసిస్ సునామీ ఇన్నింగ్స్‌తో తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.

సీపీఎల్-2021లో సెయింట్ లూసియా కింగ్స్ తరపున ఆడుతున్న డుప్లెసిస్.. సెయింట్ కిట్స్, నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత సెంచరీ చేశాడు. 51 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఫ్రాంచైజీ టీ20 క్రికెట్‌లో డుప్లెసిస్‌కు ఇది తొలి సెంచరీ. మొత్తంగా 60 బంతులు ఆడిన డుప్లెసిస్ 200 స్ట్రైక్ రేట్‌తో 120* పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 13 ఫోర్లు ఉన్నాయి. డుప్లెసిస్ చేసిన అద్భుత ఇన్నింగ్స్‌తో లూసియా కింగ్స్ జట్టు 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.

తుఫాన్ ఇన్నింగ్స్‌తో డుప్లెసిస్ చెలరేగిపోయాడు..

ఓపెనర్‌గా బరిలోకి దిగిన డుప్లెసిస్.. మొదటి బంతి నుంచి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరో ఓపెనర్ ఆండ్రీ ఫ్లెచర్‌తో కలిసి మొదటి వికెట్‌కు 7.2 ఓవర్లలో 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 23 పరుగులకు ఫ్లెచర్ ఔట్ అయ్యాడు. అయితే డుప్లెసిస్ మాత్రం స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. రోస్టన్ ఛేజ్‌తో కలిసి మూడో వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఛేజ్ 31 బంతుల్లో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

భారీ లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన సెయింట్ కిట్స్, నెవిస్ పేట్రియాట్స్‌ జట్టుకు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. 22 పరుగులకే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. అయితే ఓపెనర్ ఎవిన్ లెవిస్(73) ఒకవైపు నుంచి స్కోర్‌ను ముందుకు కదిలించాడు. అది కూడా ఎంతోసేపు నిలవలేదు. లూసియా కింగ్స్ బౌలర్లు జోసెఫ్(3/27), కీమో పాల్(3/23) ధాటికి సెయింట్ కిట్స్, నెవిస్ పేట్రియాట్స్‌ జట్టు 124 పరుగులకు ఆలౌట్ అయింది. దీనితో లూసియా కింగ్స్ 100 పరుగల తేడాతో విజయం సాధించింది. కాగా, ఐపీఎల్‌కు ముందు డుప్లెసిస్ తిరిగి ఫామ్‌లోకి రావడం చెన్నై సూపర్ కింగ్స్‌కు కలిసొచ్చే అంశం. ఇప్పటికే అద్భుత విజయాలు అందుకున్న చెన్నై.. సెకండాఫ్ హాఫ్‌లో కూడా ఇదే రీతిలో ప్రదర్శన కనబరిచి ట్రోఫీని సాధించాలని ఉవ్విళ్ళూరుతోంది.

Also Read: Chanakya Niti: కష్ట సమయాల్లో ఈ నాలుగు విషయాలను ఖచ్చితంగా గుర్తించుకోండి.. అవేంటో తెలుసా!