Champak Issue : కోర్టుకెక్కిన రోబో డాగ్ చంపక్ ఇష్యూ.. బీసీసీఐ కీలక వ్యాఖ్యలు

ఐపీఎల్‌లో రోబోటిక్ డాగ్ చంపక్ పేరు వాడకంపై బీసీసీఐ, చంపక్ పత్రిక మధ్య ట్రేడ్‌మార్క్ వివాదం ఢిల్లీ హైకోర్టులో కొనసాగుతోంది. మధ్యవర్తిత్వానికి బీసీసీఐ నిరాకరించి, ఇది డబ్బుల కోసమే చేస్తున్న కేసు అని ఆరోపించింది. కేసు తదుపరి విచారణ సెప్టెంబర్‌లో జరగనుంది.

Champak Issue : కోర్టుకెక్కిన రోబో డాగ్ చంపక్ ఇష్యూ.. బీసీసీఐ కీలక వ్యాఖ్యలు
Champak Issue

Updated on: Jul 10, 2025 | 6:20 PM

Champak Issue : ఐపీఎల్‌-18 సందర్భంగా మైదానాల్లో ఏఐ రోబోటిక్‌ డాగ్‌ చంపక్‌ అలరించిన సంగతి తెలిసిందే. ఈ రోబోటిక్ డాగ్ పేరు పేరు ప్రస్తుతం బీసీసీఐకు తలనొప్పులను తీసుకొచ్చింది. ఈ సీజన్లో 29వ మ్యాచ్‌ సందర్భంగా బీసీసీఐ దీనిని ప్రవేశ పెట్టింది. ఫ్యాన్‌ పోల్‌ ద్వారా దానికి చంపక్‌ అని నామకరణం చేసింది. అయితే ఈ పేరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ చిన్నపిల్లల మ్యాగజైన్‌ చంపక్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఇది తమ ట్రేడ్ మార్క్ ఉల్లంఘనే అని చంపక్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై జూలై 9 నాటికి రాతపూర్వక వివరణ ఇవ్వాలంటూ బీసీసీఐని కోర్టు ఆదేశించింది.

ఈ క్రమంలోనే బీసీసీఐ బుధవారం ఢిల్లీ హైకోర్టుకు కీలక విషయం తెలిపింది. ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్రవేశపెట్టిన రోబోటిక్ డాగ్‌కు చంపక్ అనే పేరును ఉపయోగించడంపై నెలకొన్న ట్రేడ్‌మార్క్ వివాదంలో చంపక్ పబ్లిషర్ అయిన ఢిల్లీ ప్రెస్ పత్రా ప్రకాషన్ తో మధ్యవర్తిత్వం చేయడానికి తాము సిద్ధంగా లేమని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ కేసును జస్టిస్ సౌరభ్ బెనర్జీ విచారించారు. ఇరు పక్షాలు తమ వాదనలను విన్న తర్వాత తదుపరి విచారణను సెప్టెంబర్‌కు వాయిదా వేశారు. విచారణ సందర్భంగా, ఢిల్లీ ప్రెస్ తరఫున వాదించిన న్యాయవాది అమిత్ గుప్తా, ఐపీఎల్ సీజన్ ముగిసినందున ఈ వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

రాబోయే ఐపీఎల్ సీజన్‌లో చంపక్ పేరును ఉపయోగించమని వారు హామీ ఇస్తే కేసు ఉపసంహరించుకుంటామని గుప్తా కోర్టుకు తెలిపారు. ఢిల్లీ ప్రెస్ మధ్యవర్తిత్వానికి కూడా సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.అయితే, బీసీసీఐ తరఫున న్యాయవాది తన్మయ్ మెహతా ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. పేరును ఉపయోగించడంలో అనేక వాణిజ్యపరమైన అంశాలు ఉన్నాయని, బీసీసీఐ అలాంటి హామీని ఇవ్వబోదని ఆయన వాదించారు. ఈ దావా ఆర్థిక ప్రయోజనాల కోసం తీసుకొచ్చిందని బీసీసీఐ నుంచి డబ్బులు రాబట్టుకోవడానికి ఢిల్లీ ప్రెస్ ఈ కేసును వాడుకుంటోందని తన్మయ్ మెహతా అన్నారు. విచారణ సందర్భంగా పబ్లిషర్‌పై తమ వాదనలను సమర్పిస్తామని ఆయన తెలిపారు. బీసీసీఐ తరఫున మెహతాతో పాటు న్యాయవాది కను అగర్వాల్ కూడా హాజరయ్యారు.

ఐపీఎల్‌లో ఒక మార్కెటింగ్ ఫీచర్‌గా ప్రవేశపెట్టిన రోబోటిక్ డాగ్‌కు, అభిమానుల ఓటింగ్ ఆధారంగా ఏప్రిల్ 23న చంపక్ అని పేరు పెట్టడంతో ఈ ట్రేడ్‌మార్క్ వివాదం మొదలైంది. కోర్టు క్రికెటర్ విరాట్ కోహ్లీ నిక్ నేమ్ చీకు తో పోల్చి, అలాంటి సందర్భంలో ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించింది. దీనికి గుప్తా వివరణ ఇస్తూ.. కోహ్లీ ఆ పేరుతో ఏ ఉత్పత్తిని ప్రారంభించలేదని, అయితే ఐపీఎల్ రోబోటిక్ డాగ్‌ను లీగ్ మార్కెటింగ్ వ్యూహంలో భాగంగా ప్రచారం చేసిందని, తద్వారా ట్రేడ్‌మార్క్ హక్కులను ఉల్లంఘించిందని తెలిపారు.ఇరు పక్షాల వాదనలు పూర్తి అయిన తర్వాత కోర్టు ఈ కేసును సెప్టెంబర్‌లో తిరిగి విచారించనుంది.

 

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..