Bengaluru Stampede: విరాట్ కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు.. చర్యలు తీసుకోవాలని డిమాండ్

Complaint Filed Against Virat Kohli: జూన్ 4న బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ వేడుకల సందర్భంగా ఎం చిన్నస్వామి స్టేడియం వెలుపల అభిమానుల భారీ గుమిగూడడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు.

Bengaluru Stampede: విరాట్ కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు.. చర్యలు తీసుకోవాలని డిమాండ్
RCB యాజమాన్యంలోని యునైటెడ్ స్పిరిట్స్, బ్రిటిష్‌కు చెందిన డియాజియో అనుబంధ సంస్థ. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, డియాజియో RCB కి $2 బిలియన్ల (రూ. 17,000 కోట్లు) విలువను అంచనా వేసింది.

Updated on: Jun 06, 2025 | 8:35 PM

Bengaluru Stampede: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన విషాదకరమైన తొక్కిసలాట ఘటనకు సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలైంది. సీనియర్ సామాజిక కార్యకర్త H.M. వెంకటేష్ ఈ ఫిర్యాదును దాఖలు చేశారు.

ఘటన నేపథ్యం..

ఐపీఎల్ 2025 టైటిల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) గెలుచుకున్న అనంతరం జూన్ 4న చిన్నస్వామి స్టేడియం వద్ద విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు లక్షలాది మంది అభిమానులు తరలిరావడంతో స్టేడియం బయట భారీగా తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

విరాట్ కోహ్లీపై ఫిర్యాదు ఎందుకు?

ఈ తొక్కిసలాటకు కారణం RCB యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యమేనని వెంకటేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా ఉచిత పాస్‌లు, ఆటగాళ్లతో ముఖాముఖి కలిసే అవకాశం కల్పిస్తామని చేసిన ప్రకటనల వల్లే లక్షలాది మంది అభిమానులు ఒక్కసారిగా గుమిగూడారని ఆయన ఆరోపించారు. జట్టులో కీలక ఆటగాడిగా, ప్రజల్లో విస్తృతమైన ఆదరణ ఉన్న విరాట్ కోహ్లీ, ఈ ఈవెంట్‌కు సంబంధించిన ప్రకటనలలో భాగస్వామ్యం వహించాడని, కాబట్టి ఈ తొక్కిసలాటకు అతను కూడా బాధ్యుడేనని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

పోలీసులు ఇప్పటికే RCB, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ DNA ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. RCB మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేతో సహా నలుగురు అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID)కి బదిలీ చేశారు.

పోలీసుల స్పందన..

విరాట్ కోహ్లీపై దాఖలైన ఈ ఫిర్యాదును ఇప్పటికే నమోదైన కేసులో భాగంగానే పరిగణిస్తామని, కొనసాగుతున్న విచారణలో భాగంగా దీన్ని పరిశీలిస్తామని కబ్బన్ పార్క్ పోలీసులు స్పష్టం చేశారు. అయితే, కోహ్లీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.

ఆర్‌సీబీ, ఇతర బాధ్యులపై విచారణ..

ఈ తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ఏకసభ్య న్యాయ కమిషన్‌ను కూడా నియమించింది. ఈ కమిషన్ ఘటనకు గల కారణాలు, లోపాలు, బాధ్యులను గుర్తించి 30 రోజుల్లో నివేదికను సమర్పించనుంది.

ఈ ఘటన భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. వేడుకల నిర్వహణలో నిర్లక్ష్యంపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ కేసులో విచారణ కొనసాగుతున్నందున, మరిన్ని అరెస్టులు, చర్యలు ఉంటాయో లేదో వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..