WCL 2025: పొలార్డ్ పవరంతా వ్యర్థం.. బిన్నీ ఆల్‌రౌండ్ షోతో సెమీస్‌లోకి భారత్

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నమెంట్‌లో సెమీస్‌లోకి ఇండియా ఛాంపియన్స్ దూసుకెళ్లింది. స్టువర్ట్ బిన్నీ అద్భుత ప్రదర్శనతో జట్టు విజయం సాధించింది. ఇప్పుడు ఆగస్టు 31న పాకిస్తాన్‌తో హైవోల్టేజ్ సెమీఫైనల్ పోరుకు సిద్ధమైంది. మరి పాక్ తో ఆడతారా లేదా అనేది చూడాలి.

WCL 2025: పొలార్డ్ పవరంతా వ్యర్థం.. బిన్నీ ఆల్‌రౌండ్ షోతో సెమీస్‌లోకి భారత్
Stuart Binny

Updated on: Jul 30, 2025 | 11:47 AM

WCL 2025: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నమెంట్‌లో ఇండియా ఛాంపియన్స్ జట్టు అదరగొట్టింది. 15వ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఛాంపియన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి సెమీఫైనల్‌లో తమ స్థానాన్ని పక్కా చేసుకుంది. ఇప్పుడు టీమిండియా ఆగస్టు 31న జరగనున్న కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ఛాంపియన్స్ తో తలపడనుంది. ఈ విజయానికి ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ బ్యాట్, బాల్ రెండింటితోనూ అద్భుత ప్రదర్శన చేసి కీలక పాత్ర పోషించాడు.

గ్రేస్ రోడ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండియా ఛాంపియన్స్ కెప్టెన్ యువరాజ్ సింగ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. వెస్టిండీస్ ఛాంపియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. వెస్టిండీస్ తరఫున కీరన్ పొలార్డ్ 43 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 74 పరుగులు చేసి వీరోచితంగా పోరాడాడు. అయితే, మిగతా వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. ఇండియా ఛాంపియన్స్ బౌలర్లలో స్పిన్నర్ పియూష్ చావ్లా 3 వికెట్లు పడగొట్టగా, స్టువర్ట్ బిన్నీ, వరుణ్ ఆరోన్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. పవన్ నేగికి ఒక వికెట్ లభించింది.

145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఇండియా ఛాంపియన్స్ జట్టుకు ఆరంభం బాగానే లభించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 25 పరుగులు చేసి మంచి శుభారంభాన్ని అందించాడు. అయితే, గుర్కీరత్ మాన్, సురేష్ రైనా త్వరగా అవుటయ్యారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన స్టువర్ట్ బిన్నీ విధ్వంసకరంగా బ్యాటింగ్ చేశాడు. బిన్నీ 21 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 50 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపించాడు.

కెప్టెన్ యువరాజ్ సింగ్ కూడా 21 పరుగులు చేసి తన వంతు సహకారం అందించాడు. ఆ తర్వాత వచ్చిన యూసుఫ్ పఠాన్ కేవలం 7 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్సర్లతో 21 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు. విజయం సాధించిన వెంటనే యూసుఫ్ మైదానంలోనే తన పిల్లలతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. వెస్టిండీస్ తరఫున డ్వేన్ స్మిత్, డ్వేన్ బ్రావో చెరో 2 వికెట్లు తీసుకున్నప్పటికీ, వారి జట్టును గెలిపించలేకపోయారు.

ఈ విజయంతో ఇండియా ఛాంపియన్స్ జట్టు సెమీఫైనల్‌లో తమ స్థానాన్ని పక్కా చేసుకుంది. ఇప్పుడు టీమిండియా ఆగస్టు 31న పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్టుతో తలపడనుంది. గ్రూప్ స్టేజ్‌లో భారత్ పాకిస్తాన్‌తో ఆడటానికి నిరాకరించింది. కానీ, ఇప్పుడు ఈ హై-వోల్టేజ్ సెమీఫైనల్ మ్యాచ్‌ను ఆపడానికి ఎలాంటి అడ్డంకులూ కనిపించడం లేదు. క్రికెట్ అభిమానులంతా ఈ ఉత్కంఠ పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..