BCCI : టీమిండియా స్పాన్సర్ కావాలంటే ఎన్ని కోట్లు పెట్టాలి? బీసీసీఐ కొత్త రూల్స్ తో కంపెనీలకు షాక్!

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తదుపరి స్పాన్సర్‌షిప్ కోసం దాదాపు రూ. 452 కోట్ల డీల్‌ను ఆశిస్తోంది. ఇది కేవలం ప్రారంభ ధర మాత్రమే. భారతీయ కంపెనీలు రూ. 5,90,000 చెల్లించి సెప్టెంబర్ 2 నుండి 12 వరకు ఇన్విటేషన్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ పొందవచ్చు. విదేశీ కంపెనీలు అయితే 5,675 డాలర్లు చెల్లించాలి.

BCCI : టీమిండియా స్పాన్సర్ కావాలంటే ఎన్ని కోట్లు పెట్టాలి? బీసీసీఐ కొత్త రూల్స్ తో కంపెనీలకు షాక్!
Bcci

Updated on: Sep 03, 2025 | 8:01 AM

BCCI : మీ బ్రాండ్ పేరును టీమిండియా జెర్సీపై చూడాలని కలలు కంటున్నారా? అయితే, భారీగా డబ్బులు రెడీ చేస్కోండి. మీడియా నివేదికల ప్రకారం.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తదుపరి స్పాన్సర్‌షిప్ కోసం సుమారు రూ.452 కోట్లు ఆశిస్తోంది. ఈ ఒప్పందం 2025 నుంచి 2028 వరకు మూడు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఇందులో స్వదేశంలో, విదేశాల్లో జరిగే దాదాపు 140 మ్యాచ్‌లు కవర్ అవుతాయి. ప్రతి మ్యాచ్​కు వేర్వేరు రేట్లు ఉన్నాయి. బీసీసీఐ ప్రతి ద్వైపాక్షిక మ్యాచ్‌కు రూ.3.5 కోట్లు, ఐసీసీ లేదా ఏసీసీ టోర్నమెంట్‌లలో జరిగే మ్యాచ్‌లకు రూ.1.5 కోట్లు కోరుకుంటోంది. ఇంతకు ముందు డ్రీమ్‌11 రూ.358 కోట్ల ఒప్పందానికి గానూ, ద్వైపాక్షిక మ్యాచ్‌లకు రూ.3 కోట్లు, ఐసీసీ/ఏసీసీ ఈవెంట్‌లకు రూ.కోటి చొప్పున చెల్లించింది.

డ్రీమ్‌11 ఎందుకు వెళ్లిపోయింది?

కొత్త స్పాన్సర్‌షిప్ వేలంపాట ప్రారంభించడానికి ప్రధాన కారణం.. గతంలో ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న డ్రీమ్‌11 ఒప్పందం నుంచి తప్పుకోవడం. భారత ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ చట్టం, 2025 ప్రకారం రియల్ మనీ గేమింగ్, బెట్టింగ్, జూదం, వాటి ప్రకటనలను నిషేధించింది. డ్రీమ్‌11 బిజినెస్ ఈ చట్టం పరిధిలోకి వస్తుంది. అందుకే, బీసీసీఐ ఒప్పందాన్ని కొనసాగించలేమని డ్రీమ్‌11 బోర్డుకు తెలిపింది. ఈ పరిస్థితి డ్రీమ్‌11 తప్పు కాదని, ప్రభుత్వ చట్టం కారణంగా ఇలా జరిగిందని బీసీసీఐ కూడా అర్థం చేసుకుంది. అందుకే, డ్రీమ్‌11పై ఎటువంటి జరిమానా విధించలేదు.

కొత్త స్పాన్సర్‌షిప్ నియమాలు

బీసీసీఐ ఈసారి స్పాన్సర్‌షిప్ కోసం మరింత కఠినమైన నియమాలను పెట్టింది. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు ఆసక్తి ఉన్న కంపెనీలు ఇన్విటేషన్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (IEOI)ను పొందవచ్చు. దీని కోసం భారతీయ కంపెనీలు రూ.5,90,000 (జీఎస్టీతో కలిపి), విదేశీ సంస్థలు 5,675డాలర్లు చెల్లించాలి. అంతేకాకుండా, బిడ్డర్లకు ఆర్థిక అర్హత కూడా ఉండాలి. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో సగటు వార్షిక టర్నోవర్ లేదా నికర విలువ కనీసం రూ.300 కోట్లు ఉండాలి.

నిషేధిత, బ్లాక్ చేసిన కేటగిరీలు

బీసీసీఐ స్పాన్సర్ కావాలనుకునే వారికి రెండు ప్రధాన వర్గాలుగా నిబంధనలను విభజించింది: నిషేధిత, బ్లాక్ చేసిన కేటగిరీలు.

నిషేధిత కేటగిరీలు:

* మద్యం ఉత్పత్తులు

* బెట్టింగ్ లేదా జూదం సేవలు

* క్రిప్టోకరెన్సీ, దానికి సంబంధించిన వ్యాపారాలు

* ఆన్‌లైన్ గేమింగ్ చట్టం, 2025 కింద నిషేధించబడిన ఆన్‌లైన్ మనీ గేమింగ్

* పొగాకు ఉత్పత్తులు

* అశ్లీలతతో సహా ప్రజా నైతికతను కించపరిచే బ్రాండ్లు

బ్లాక్ చేసిన కేటగిరీలు:

ఈ రంగాలకు ఇప్పటికే బీసీసీఐతో స్పాన్సర్‌షిప్ ఒప్పందాలు ఉన్నాయి. అందువల్ల, ప్రస్తుత భాగస్వాములు కాకపోతే కొత్త బిడ్డర్లు ఈ కేటగిరీల్లో పాల్గొనలేరు.

* స్పోర్ట్స్‌వేర్ తయారీదారులు: అడిడాస్ (ప్రస్తుత కిట్ స్పాన్సర్)

* బ్యాంకులు, ఆర్థిక సేవలు: ఐడీఎఫ్‌సీ బ్యాంక్ (ప్రస్తుత టైటిల్ స్పాన్సర్)

* నాన్-ఆల్కహాలిక్ శీతల పానీయాలు: క్యాంపా (అధికారిక భాగస్వామి)

* గృహోపకరణాలు (ఫ్యాన్స్, మిక్సర్ గ్రైండర్స్, సేఫ్టీ లాక్స్): అటోంబెర్గ్ టెక్నాలజీస్ (అధికారిక భాగస్వామి)

* ఇన్సూరెన్స్: ఎస్‌బీఐ లైఫ్ (అధికారిక భాగస్వామి)

భారత జట్టు స్పాన్సర్ లేకుండా ఆసియా కప్‌లో ఆడుతుందా?

ఐఈఓఐని కొనుగోలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 12. బిడ్ పత్రాలను సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 16. అయితే, ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. దీంతో బీసీసీఐకి కొత్త స్పాన్సర్‌ను సెలక్ట్ చేయడానికి చాలా తక్కువ సమయం ఉంది. అందుకే, భారత జట్టు ఆసియా కప్‌లో జెర్సీపై ప్రధాన స్పాన్సర్ లోగో లేకుండానే ఆడే అవకాశం ఉంది. అయినప్పటికీ, క్రికెట్ మార్కెట్‌లో టీమిండియాకు ఉన్న విలువ దృష్ట్యా, టోర్నమెంట్ తర్వాత కూడా స్పాన్సర్‌షిప్ డీల్ ఖరారయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..