IND Vs AFG: ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్‌కు బీసీసీఐ అండ.. ఇప్పటివరకు ఎన్ని స్టేడియంలు ఇచ్చారో తెలుసా?

IND Vs AFG: సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభమయ్యే భారత్, ఆఫ్ఘనిస్థాన్ టీ20 సిరీస్‌కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది. ఈ సిరీస్‌కు ఆఫ్ఘనిస్థానే ఆతిథ్య జట్టు అయినప్పటికీ, బీసీసీఐ సాయంతో భారత వేదికపైనే సొంత గ్రౌండ్‌గా ఆడుతుండటం విశేషం.

IND Vs AFG: ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్‌కు బీసీసీఐ అండ.. ఇప్పటివరకు ఎన్ని స్టేడియంలు ఇచ్చారో తెలుసా?
Ind Vs Afg

Updated on: Sep 09, 2026 | 8:40 AM

IND Vs AFG: ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు అభివృద్ధిలో బీసీసీఐ కీలక పాత్ర పోషిస్తోంది. సొంత దేశంలో మైదానాల కొరత, భద్రతా కారణాల వల్ల అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడినప్పుడు బీసీసీఐ అండగా నిలిచింది. 2015లో మొదలైన ఈ సత్సంబంధాలు నేటికీ కొనసాగుతున్నాయి. భారత భూభాగంలోని ప్రధాన క్రికెట్ మైదానాలను అఫ్గాన్ జట్టుకు సొంత ఇంటిగా మార్చి, అంతర్జాతీయ స్థాయిలో వారు ఎదిగేందుకు ఎంతో సహకరించింది.

గ్రేటర్ నోయిడా, డెహ్రాడూన్ మైదానాల ఆతిథ్యం

ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో గల షహీద్ విజయ్ సింగ్ పథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అఫ్గాన్ జట్టుకు భారత్‌లో లభించిన తొలి హోమ్ గ్రౌండ్లలో ఒకటి. 2015 నుంచి ఈ వేదికపై వారు ఎన్నో మ్యాచ్‌లు ఆడారు. ఇక ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం అఫ్గాన్‌కు మరో కీలక స్థావరంగా మారింది. ఇక్కడ మొత్తం 9 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. అందులో ఒక టెస్టు, 5 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లకు ఈ మైదానం ఆతిథ్యమిచ్చింది. 2019 తర్వాత అక్కడ ఆడకపోయినా, అఫ్గాన్ సాధించిన అనేక విజయాలకు ఈ స్టేడియం వేదికగా నిలిచింది.

లక్నో నుంచి ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వరకు

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఏకానా స్టేడియం కూడా అఫ్గాన్ జట్టుకు హోమ్ గ్రౌండ్‌గా వ్యవహరించింది. 2019లో వెస్టిండీస్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌తో పాటు అనేక పరిమిత ఓవర్ల సిరీస్‌లకు లక్నో ఆతిథ్యమిచ్చింది. ఇప్పుడు ఈ జాబితాలోకి దేశ రాజధాని ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం కొత్తగా చేరింది. గతంలో ఈ మైదానంలో 2 వన్డేలు, 2 టీ20లు ఆడిన అనుభవం అఫ్గాన్ జట్టుకు ఉంది. కానీ ఈసారి ఏకంగా తమ సొంత వేదికగా భావిస్తూ టీమిండియాతో తలపడనుండటం విశేషం.

సరిహద్దులు దాటిన క్రీడా స్ఫూర్తి

క్రికెట్ ప్రపంచంలో రెండు దేశాల బోర్డుల మధ్య ఇంతటి మైత్రి అరుదుగా కనిపిస్తుంది. తమ క్రీడాకారులకు నిరంతరం ప్రాక్టీస్ సౌకర్యాలు, మ్యాచ్‌ల నిర్వహణ అవకాశాలు కల్పిస్తూ బీసీసీఐ అందిస్తున్న ప్రోత్సాహం పట్ల అఫ్గాన్ క్రికెటర్లు, ఆ దేశ బోర్డు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటారు. సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభమయ్యే సిరీస్‌లోనూ ఈ క్రీడా మైత్రి మరోసారి ప్రతిబింబించనుంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us