
BCCI : ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సుదీర్ఘ టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ టూర్ మధ్యలోనే బీసీసీఐ రాబోయే జింబాబ్వే పర్యటన కోసం టీమిండియా టీ20 జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ కోసం గతంలో గెలిచిన జట్టులోని కోర్ టీమ్‌ను అలాగే ఉంచుతూ, కొందరు కొత్త ఆటగాళ్లకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. జింబాబ్వే జట్టును తక్కువ అంచనా వేయలేమని భావించిన అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ విన్నింగ్ ఫార్ములాతోనే ముందుకు వెళ్ళింది. అయితే, ఈ జట్టు ఎంపికపై క్రికెట్ వర్గాల నుంచి పూర్తి సానుకూల స్పందన రాలేదు. కొందరు ఆటగాళ్ల ఎంపికపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఎంపికలలో దొర్లిన మూడు ప్రధాన బ్లండర్స్ గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం.
వికెట్ తీయని బౌలర్‌కు టీమిండియాలో చోటా?
సెలెక్టర్లు ప్రకటించిన జట్టులో అందరినీ ఆశ్చర్యపరిచిన మొదటి పేరు స్పీడ్ స్టర్ మయాంక్ యాదవ్. అసలు టీ20 జట్టులో మయాంక్ యాదవ్ ఏం చేస్తున్నాడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐపీఎల్ 2024లో తన బుల్లెట్ వేగంతో సంచలనం సృష్టించిన ఈ యువ పేసర్ కెరీర్ ఆ తర్వాత పూర్తిగా గాయాలపాలైంది. గాయం నుంచి కోలుకున్నాక అతని బౌలింగ్ వేగం బాగా పడిపోయింది. దానికి ఐపీఎల్ 2026లో అతని ప్రదర్శనే నిదర్శనం. ఐపీఎల్ 2026లో అతను కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడి, ఒక్క వికెట్ కూడా తీయకుండా ఘోరంగా విఫలమయ్యాడు. పైగా 11.38 భారీ ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకున్నాడు. అంతకుముందు ఐపీఎల్ 2025 లోనూ 12.50 ఎకానమీతో కేవలం 2 వికెట్లే తీశాడు. ఇంత దారుణమైన ఫామ్‌లో ఉన్నా, అతనికి జింబాబ్వే టూర్‌లో చోటు కల్పించడం పెద్ద తప్పుగా భావిస్తున్నారు.
టీ20లకు హర్ష్ దూబే సరిపోతాడా?
సెలెక్షన్‌లో జరిగిన రెండో తప్పు హర్ష్ దూబే ఎంపిక. హర్ష్ దూబేకు ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో మంచి రికార్డు ఉంది, అలాగే ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డేలలోనూ అతను బాగానే రాణించాడు. అయితే అతడిని టీ20 ఫార్మాట్‌కు ఎంపిక చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్, టీ20లలో అతని రికార్డులు అంత ఆశాజనకంగా లేవు. ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరఫున ఆడిన ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఎనిమిది మ్యాచ్‌లలో కేవలం 8 వికెట్లు మాత్రమే తీసి, 10.36 ఎకానమీ రేటుతో విఫలమయ్యాడు. మొత్తంగా 38 టీ20 మ్యాచ్‌లలో కేవలం 34 వికెట్లు మాత్రమే సాధించాడు. ప్రస్తుత ఆధునిక టీ20 క్రికెట్‌కు వికెట్లు తీసే అటాకింగ్ బౌలర్లు అవసరం కాగా, దూబే కేవలం డిఫెన్సివ్ బౌలర్‌గా మాత్రమే కనిపిస్తున్నాడు. అతని స్థానంలో ఆల్‌రౌండర్ క్రునాల్ పాండ్యాను ఎంపిక చేసి ఉంటే జట్టుకు అటాకింగ్ ఆప్షన్ లభించేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఐపీఎల్‌లో బెంచ్‌కే పరిమితమైన ఆటగాడికి లక్కీ ఛాన్స్
జట్టు ఎంపికలో జరిగిన మూడో పెద్ద పొరపాటు యష్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకోవడం. ఎలాంటి ముందస్తు అంచనాలు లేకుండానే ఈ రైట్ ఆర్మ్ పేసర్‌ను సెలెక్టర్లు జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేశారు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టులో సభ్యుడైన యష్ ఠాకూర్, గత రెండు సీజన్లలో కలిపి ఆడింది కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే అంటే నమ్మడం కష్టం. కనీసం ఐపీఎల్ ఫ్రాంచైజీనే తన తుది జట్టులో ఆడేందుకు నమ్మకం ఉంచని ఒక బౌలర్‌ను, ఏకంగా భారత జాతీయ జట్టులోకి ఎలా ఎంపిక చేస్తారంటూ అభిమానులు సెలెక్టర్లను నిలదీస్తున్నారు.
నిజానికి దేశీయ లేదా ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ఎవరికైనా ప్రతిఫలం ఇవ్వాలనుకుంటే, ఆ అవకాశం ఆర్సీబీ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన రాసిఖ్ సలామ్ దార్‌కు దక్కాలి. కానీ సెలెక్టర్లు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐపీఎల్ లీగ్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడకుండా, కేవలం బెంచ్‌కే పరిమితమైన ఆటగాడిని ఎంపిక చేయడం పెద్ద బ్లండర్ అని క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..