BCCI New Rule : నో రెస్ట్ ఫర్ స్టార్స్.. ఫ్రీగా ఉన్నారా? వెంటనే దేశవాళీ మ్యాచ్ ఆడాల్సిందే.. బీసీసీఐ కొత్త రూల్
BCCI New Rule : భారత్, సౌతాఫ్రికా మధ్య ప్రస్తుతం 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతోంది. అంతకుముందు టెస్ట్, వన్డే సిరీస్‌లు కూడా ముగిశాయి. ఈ అంతర్జాతీయ సిరీస్‌ల మధ్యలోనే, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది.

BCCI New Rule : భారత్, సౌతాఫ్రికా మధ్య ప్రస్తుతం 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతోంది. అంతకుముందు టెస్ట్, వన్డే సిరీస్‌లు కూడా ముగిశాయి. ఈ అంతర్జాతీయ సిరీస్‌ల మధ్యలోనే, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. వన్డే, టీ20 జట్లలో ఆడే ఆటగాళ్లకు బీసీసీఐ ఒక కొత్త ఆదేశాన్ని జారీ చేసింది. దీని ప్రకారం వైట్ బాల్ ఫార్మాట్లో ఆడే ఆటగాళ్లందరూ ఒక ముఖ్యమైన దేశవాళీ టోర్నమెంట్‌లో కనీసం రెండు మ్యాచ్‌లు ఆడటం తప్పనిసరి. ఈ నియమం సీనియర్ ఆటగాళ్లతో పాటు జూనియర్ ఆటగాళ్లకు కూడా వర్తిస్తుంది.
మీడియా నివేదికల ప్రకారం.. బీసీసీఐ తీసుకున్న ఈ పెద్ద నిర్ణయం ద్వారా వన్డే, టీ20 టీమ్స్‌లో ఉన్న ఆటగాళ్లందరూ తప్పనిసరిగా విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో కనీసం రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్ కారణంగా ఎక్కువ కాలం దేశవాళీ క్రికెట్‌లో ఆడలేని సీనియర్ ఆటగాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశవాళీ మ్యాచ్‌లలో ఆడటం వల్ల ఆటగాళ్లు మ్యాచ్ ఫిట్నెస్ను కాపాడుకోగలరు, అదే సమయంలో దేశవాళీ క్రికెట్ బలోపేతం అవుతుంది. ఈ కొత్త నియమం ప్రకారం సెంట్రల్ కాంట్రాక్ట్లో ఉన్న ఏ ఆటగాడైనా జాతీయ విధుల్లో లేనప్పుడు, దేశవాళీ టోర్నమెంట్‌లో పాల్గొనడం తప్పనిసరి.
బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆటగాళ్లు అంతర్జాతీయ షెడ్యూల్ తర్వాత కూడా నిరంతరం మ్యాచ్ ప్రాక్టీస్‌లో ఉంటారు. దీనితో పాటు దేశవాళీ క్రికెట్‌లో ఆడే యువ ఆటగాళ్లకు తమ సీనియర్ల నుంచి నేర్చుకునే అవకాశం లభిస్తుంది. విజయ్ హజారే ట్రోఫీ అనేది భారత క్రికెట్‌లో ఒక ముఖ్యమైన లిస్ట్-ఏ టోర్నమెంట్. ఇది డిసెంబర్ 24, 2025 నుంచి ప్రారంభం కానుంది.
ఈ ఏడాది విజయ్ హజారే ట్రోఫీ (లిస్ట్-ఏ టోర్నమెంట్) డిసెంబర్ 24, 2025 నుంచి జనవరి 18, 2026 వరకు జరగనుంది. ఈ కొత్త నియమం నేపథ్యంలో, టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఈ టోర్నమెంట్‌లో ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ ఇప్పటికే ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌కు తన లభ్యత గురించి తెలియజేశారు. ఆయన కనీసం రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. విరాట్ చివరిసారిగా విజయ్ హజారే ట్రోఫీలో 16 ఏళ్ల క్రితం 2010లో ఆడారు. అలాగే రోహిత్ శర్మ కూడా ఈ టోర్నమెంట్‌లో ఆడనున్నట్లు సమాచారం. రోహిత్ కూడా చివరిసారిగా 2010లో ఈ ట్రోఫీలో కనిపించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




