షాకిచ్చిన బీసీసీఐ.. ఐపీఎల్ 2026 షెడ్యూల్‌లో కీలక మార్పులు.. ఆ 2 జట్ల మ్యాచ్‌లపై ఎఫెక్ట్..!

IPL 2026 Schedule Change: భారత క్రికెట్ నియంత్రణ మండలి తాజాగా ఐపీఎల్ 2026 సీజన్ షెడ్యూల్‌లో కీలక మార్పులు చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ల వేదికలు మారాయి. ఇది అభిమానులను విస్మయానికి గురిచేసింది.

షాకిచ్చిన బీసీసీఐ.. ఐపీఎల్ 2026 షెడ్యూల్‌లో కీలక మార్పులు.. ఆ 2 జట్ల మ్యాచ్‌లపై ఎఫెక్ట్..!
Ipl 2026 Csk Vs Gt

Updated on: Apr 13, 2026 | 9:19 PM

ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ 19వ సీజన్ మధ్యలో భారత క్రికెట్ నియంత్రణ మండలి అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 26వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగాల్సిన గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మధ్యాహ్నం మ్యాచ్ ఇప్పుడు చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియానికి మార్చింది. అదేవిధంగా, మే 21వ తేదీన చెన్నైలో జరగాల్సిన మ్యాచ్ ఇప్పుడు అహ్మదాబాద్‌లో రాత్రి గం. 7:30లకు జరుగుతుంది. గుజరాత్‌లో ఏప్రిల్ 26న జరిగే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఈ మార్పులు అనివార్యమయ్యాయని క్రికెట్ పాలక మండలి స్పష్టం చేసింది.

ఎన్నికల ప్రభావం, భద్రతా సవాళ్లు..

సాధారణంగా ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను ఒకేసారి ప్రకటిస్తారు. కానీ 2026లో దేశంలోని పలు రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలు ఉండటంతో, దీనిని రెండు విడతల్లో విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పోలింగ్ తేదీల ఆధారంగా మ్యాచ్‌లను సర్దుబాటు చేశారు. స్టేడియాల వద్ద భారీ భద్రత కల్పించాల్సి ఉండటంతో, ఎన్నికల విధుల్లో ఉండే పోలీసు బలగాలకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. కోల్‌కతా, రాజస్థాన్ జట్ల సొంత మైదానాల్లో జరిగే మ్యాచ్‌ల విషయంలో కూడా గతంలో ఇటువంటి జాగ్రత్తలే తీసుకున్నారు.

ప్రస్తుత పాయింట్ల పట్టికలో జట్ల పరిస్థితి..

ఈ మార్పుల వల్ల ప్రభావితమైన రెండు జట్ల ప్రదర్శన ఈ సీజన్‌లో భిన్నంగా ఉంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ జట్టు స్థిరమైన ఆటతీరుతో నాలుగు మ్యాచ్‌లలో రెండు విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు, రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడు ఓటములతో సీజన్‌ను నిరుత్సాహంగా ప్రారంభించింది. అయితే, ఢిల్లీ జట్టుపై సాధించిన విజయంతో ప్రస్తుతం కోలుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం చెన్నై పట్టికలో తొమ్మిదవ స్థానంలో ఉండటం గమనార్హం.

ప్లేఆఫ్ వేదికలపై సందిగ్ధం..

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గ్రూప్ దశ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను సవరించిన బోర్డు, ప్లేఆఫ్, ఫైనల్ మ్యాచ్‌ల వేదికలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఎన్నికల ఫలితాలు, భద్రతా లభ్యతను బట్టి వీటిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us